Begin typing your search above and press return to search.

జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల జోరు...నాయ‌కుడి బేజారు

By:  Tupaki Desk   |   8 Aug 2016 9:30 AM GMT
జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల జోరు...నాయ‌కుడి బేజారు
X
మెగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీలో అధినేత క‌న్నా కార్య‌క‌ర్త‌ల‌దే దూకుడు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పార్టీని స్థాపించ‌డంతో స‌రిపెట్టిన ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత రెండు మూడు సార్ల‌కంటే ఎక్కువ‌గా మీడియా ముందుకు రాలేదు. అదికూడా కొన్ని ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అయ్యారు. ముఖ్యంగా త‌న సామాజిక వ‌ర్గం కాపు ఉద్య‌మం ఉవ్వెత్తున సాగిన‌ప్పుడు కానీ, ముద్ర‌గ‌డం వారం రోజులు దీక్ష చేసిన‌ప్పుడు కానీ, కాపు వ‌ర్గానికి చెందిన సినీ ప్ర‌ముఖులు ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేసిన‌ప్ప‌డు కానీ జ‌న‌సేన త‌ర‌ఫున ప‌వ‌న్ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. పోనీ త‌న ట్విట్ట‌ర్‌ లోనూ స్పందించ‌లేదు. అంతెందుకు నాలుగు రోజుల కింద‌టి వ‌ర‌కు ఏపీలో అట్టుడికిన ప్ర‌త్యేక హోదా - రాష్ట్ర బంద్‌ ల‌పైనా మౌనం వ‌హించాడు. ఒక రాజ‌కీయ పార్టీ పెట్టి, అందునా 2019లో ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల్సిన నేత ఇలా మౌనం వ‌హించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా ప‌వ‌న్ మౌనంగానే ఉన్నారు. త‌న సినిమా షూటింగ్‌ లో బిజీగా గ‌డిపేస్తున్నారు.

కానీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు - దిగువ‌స్థాయి నేత‌లు మాత్రం త‌మ అధినేత‌ - అభిమాన హీరో మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ‌కు తామే దిశానిర్దేశం చేసుకుని జ‌న‌సేన‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని డిసైడైపోయారు. ఇప్ప‌టికే విశాఖ హుద్‌ హుద్ తుఫాను స‌హా ప‌లు కార్య‌క్ర‌మాల్లో స్వ‌చ్ఛందంగా పాల్గొన్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్ప‌టి నుంచే ఏపీ - తెలంగాణ‌ల్లో పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు స్కెచ్‌ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో నెల్లూరులో ఆదివారం జ‌న‌సేన స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించారు. అన్ని జిల్లాలకు చెందిన జ‌న‌సేన నేతలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు టోనీబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

పార్టీలకు అతీతంగా జనసేన తరఫున ప్రజా సమస్యలపై పోరు సాగించేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులంతా ముందుకు రావాలని ఆయన కోరారు. వచ్చే నెల 2న పవన్ జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో రక్త దాన శిబిరాలను భారీగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా, జ‌న‌సేన‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు కార్య‌క‌ర్త‌లు సిద్ధంగా ఉండాల‌ని కూడా తీర్మానం చేయ‌డం గ‌మ‌నార్హం. కొద్ది రోజుల క్రితం విశాఖ‌ - విజ‌య‌వాడ‌లో కూడా ప‌వ‌న్ అభిమానులు స‌మావేశాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా ప‌వ‌న్ నిద్ద‌రోతున్నా.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మాత్రం దూసుకుపోతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి ప‌వ‌న్‌.. ఎప్ప‌టికి నిద్ర‌లేస్తారో.. ఎప్ప‌టికి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తారో.. ఆయ‌న వ్యూహం ఏంటో?!