Begin typing your search above and press return to search.

సైకిల్ ఎక్కొద్దు : జన సైనికులు

By:  Tupaki Desk   |   3 Jan 2019 2:48 AM GMT
సైకిల్ ఎక్కొద్దు : జన సైనికులు
X
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజురోజుకు రసకందాయంలో పడుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజుకో మలుపు తిరుగుతూ ఎప్పుడు ఏం జరుగుతుందో అంతు చిక్కని పరిస్థితి ఉంది. నిన్నటి వరకూ రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన వారు నేడు చేతులు కలిపే సరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా తెలుగుదేశం - వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవలే పార్టీ పెట్టి అధికారం తమదే అంటూ మాంచి ఊపు మీదున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో ఉంటుదని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీకి - జనసేనకు మధ‌్య పొత్తులు కుదిర్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి - జనసేనకు మధ్య వారధిలా ఉన్న కొందరు పెద్దలు కలుగజేసుకుని ఈ ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే "కమ్మ"గా ఉంటుందనేది వారి ఉద్దేశ్యంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంత వరకూ సఫలం అవుతాయో తెలియదు కాని... ఈ పొత్తును మాత్రం జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జనసేనకు ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడేనని - అలాంటిది ఆయనతో చేతులు కలిపితే భవిష్యత్ రాజకీయాలు చాలా దారుణంగా ఉంటాయని జనసైనికులు అంటున్నారని సమాచారం. తగ ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడి మద్దతు పలికి తప్పు చేశానని అనేక సభల్లో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఆయనతో చేతులు కలపడం రాజకీయ ఆత్మహత్య కిందే వస్తుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడికి - తెలుగుదేశం పార్టీకి గడ్డు రోజులని జనసేన జరిపిన రహస్య సర్వేలో వెల్లడైందంటున్నారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీతో కలిస్తే రాజకీయంగా ఆ పార్టీకే మేలు జరుగుతుంది తప్ప జనసేనకు మాత్రం భారీ నష్టం తప్పదని అంటున్నారు. గడచిన రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో పవన్ తో పొత్తుపై ప్రస్తావించారు. ఇది కూడా పచ్చ మీడియా చేత ప్రశ్నలు వేయించుకుని ఓ చర్చకు తెరతీసారంటున్నారు. ఇలాంటి రాజకీయాలు నెరపే చంద్రబాబు నాయుడితో కలిస్తే మేలు కంటే కీడే ఎక్కువని జనసేన కార్యకర్తలు అంచనా వేస్తున్నారంటున్నారు. ఇదే విషయాన్ని తమ నాయకుడు పవన్ కల్యాణ్ కు ఖ‌రాఖండీగా చెబుతున్నట్లు సమాచారం.