Begin typing your search above and press return to search.

జనసేనకు ఊరటనిస్తున్న ఆ రెండు అంశాలు

By:  Tupaki Desk   |   1 May 2019 1:30 AM GMT
జనసేనకు ఊరటనిస్తున్న ఆ రెండు అంశాలు
X
మొన్నటి ఎన్నికల్లో ఏపీలో అధికార టీడీపీ - ప్రతిపక్ష వైసీపీ తో పాటు వామపక్షాలతో కలిసి జనసేన - కాంగ్రెస్ - బిజెపి - ప్రజాశాంతి పార్టీలు పోటీ చేశాయి... అయితే ఎవరేమనుకున్నా... ఎన్నికల ముందు వరకు ప్రధానంగా ఏపీలో త్రిముఖ పోరు ఉంటుంది అది కూడా టీడీపీ - వైసీపీ - జనసేన మధ్యననే అందరూ ఊహించారు.. అయితే ఎన్నికలు దగ్గరపడిన కొద్దీ ఆ ట్రెండ్ కాస్తా.. రెండు పార్టీల మధ్య పోరుగా మారి పోయింది.. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వైసీపీ - టీడీపీ మధ్య నువ్వా - నేనా అన్న రీతిలో పోరు జరిగిందని... ఎవరు బయటపడినా.. ఎడ్జ్ లో బయటపడతారనే టాక్ ఏపీ ప్రజల్లో ఉంది... దీంతో జనసైనికులు కొంత నిరుత్సాహపడ్డారు.. ఏపీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత సీన్ లోకి వచ్చిన కొన్ని సర్వేల్లోనూ ఎక్కడా జనసేన ప్రస్తావన లేకపోవడంతో పవర్ స్టార్ పవర్ ప్లాన్ వర్కవుట్ అవ్వలేదంటూ జనసేన పార్టీ కార్యకర్తలు - పవన్ అభిమానులు డీలా పడిపోయారు...

మరికొందరైతే.. తమకు తప్పకుండా 30కి పైగా స్థానాలోస్తాయని.. కర్నాటకలో జేడీ ఎస్ తరహాలో కింగ్ మేకర్ గా మారి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారాన్నిమొదలుపెట్టారు... ఒక వేళ ఎవరికైనా మద్దతిస్తే అది టీడీపీ కే ఇస్తారంటూ వాదనను కూడా తెరపైకి తెచ్చారు... అలాగే పోలింగ్ రోజు మధ్యాహ్నాం తర్వాత జరిగిన భారీ పోలింగ్ పాజిటివ్ పోలింగని... మేమే మళ్లీ అధికారంలోకి వస్తున్నామని టీడీపీ నేతలు మరో వైపు తెగ ప్రచారం చేస్తున్నారు.. మరి అయితే జనసేన మద్దతు మాకే కాబట్టి సీట్లు తక్కువైనా ఫర్వాలేదంటూ కొత్త సమీకరణాలపై మరికొందరు విశ్లేషణలు మొదలుపెట్టారు... పోలింగ్ తర్వాత జనసేన ఊసు లేకపోవడంతో తమ పార్టీ అధినేత పోటీ చేసిన గాజువాక - భీమవరంలోనైనా గట్టేక్కడం కష్టమేనా అనే భావన ఆ పార్టీ శ్రేణుల్లో వచ్చేసింది.

అయితే కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో జోరుగా సాగుతున్న బెట్టింగుల్లో .. బెట్టింగ్ బంగార్రాజులు..జనసేన పైనా కూడా బెట్టింగ్ కడుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.. పార్టీ అధికారంలోకి వస్తుందా.. రాదా.. అన్నది కాకుండా.. సీట్ల వారీగా ఈ పందాలు నడుస్తున్నాయి. కొన్నిచోట్ల రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతోనే ఏర్పడుతుందని కూడా జనసేన తరఫున బెట్టింగులు కాస్తున్నారు. కృష్ణా - ఉభయ గోదావరి - విశాఖ జిల్లాల్లోని కొన్ని స్థానాలపై ఆ పార్టీ అభిమానులు పందేలు వేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం - తూర్పుగోదావరి జిల్లా రాజోలు - కృష్ణా జిల్లా పెడన - అవనిగడ్డ - విజయవాడ(తూర్పు) - విజయవాడ సెంట్రల్ తదితర నియోజకవర్గాల్లో తమ పార్టీయే గెలుస్తుందని.. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా పోటీచేసిన భీమవరం - గాజువాక స్థానాల్లోనూ తమదే విజయమని జోరుగా పందేలు కాస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా.. అది జనసేన మద్దతుతోనేనని బెట్టింగుల జోరు సాగుతోంది. దీంతో పాటు లగడపాటి మే 19న విడుదల చేయబోతున్న ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వేకు సంబంధించి ఆ పార్టీకి 14 స్థానాలు దక్కబోతున్నాయనే చర్చ కూడా ఆ పార్టీలో హుషారు కు కారణమవుతోంది.. వీటి తో పాటు విశాఖ - అమలాపురం ఎంపీ స్థానాలను ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ లెక్కలేసుకుంటోంది.