Begin typing your search above and press return to search.

టీటీడీ ఈఓ ఎంపిక‌...జ‌న‌సేన క్లారిటీ

By:  Tupaki Desk   |   10 May 2017 4:17 PM GMT
టీటీడీ ఈఓ ఎంపిక‌...జ‌న‌సేన క్లారిటీ
X
టీటీడీ బోర్డు కార్యనిర్వహణాధికారిగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి సింఘాల్ నియామ‌కం విష‌యంలో కొన‌సాగుతున్న వివాదం విష‌యంలో జ‌న‌సేన మ‌రోమారు త‌న‌దైన శైలిలో కామెంట్ చేసింది. ఉత్త‌రాది అయిన సింఘాల్‌ ను ఈఓగా నియ‌మించ‌డాన్ని ప‌వ‌న్ త‌ప్పుప‌ట్ట‌గా...ప‌లువురు పవ‌న్ తీరును ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిందే. సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌ - సినీన‌టుడు మోహ‌న్‌ బాబు ప‌వ‌న్ తీరును ఎండ‌గ‌ట్టారు. ఇక ప‌లువురు టీడీపీ నేత‌లు ప‌వ‌న్ తీరుపై దుమ్మెత్తిపోశారు. ఈ క్ర‌మంలో తాజాగా జ‌న‌సేన ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు అన్ని ప్ర‌క‌ట‌న‌లు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరున విడుద‌ల కాగా...తాజా ప్ర‌క‌ట‌న మాత్రం జనసేన పార్టీ ఉపాధ్యకుడు బి.మహేంద‌ర్‌ రెడ్డి పేరుతో వచ్చింది.

జ‌న‌సేన ప్ర‌క‌ట‌న ఇది...`` భారతదేశ సమగ్రత విషయంలో జనసేన నిబద్దత ఎవరూ ప్రశ్నించలేనిది. దేశ సమగ్రతే జనసేన విధానం. టీటీడీ బోర్డు కార్యనిర్వహణాధికారిగా ఉత్తరాది ఐఏఎస్ అధికారిని నియమించడాన్ని జనసేన వ్యతిరేకించడం లేదు. ఇదే విధానాన్ని ఉత్తర భారతంలో కుడా అనుసరించాలని మాత్రమే జనసేన కోరుతోంది. అమరనాథ్‌ - మధుర - వారణాసి వంటి క్షేత్రాలకు కుడా పాలకులుగా దక్షిణాది రాష్ట్రాలవారిని నియమించాలన్న విజ్ఞప్తిని మీరు తప్పని ఎలా అంటారని జనసేన ప్రశ్నిస్తోంది. రెండు రోజుల కిందట జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ లో భావం కుడా ఇదేనని గమనించాలి. ఈ ట్వీట్ పై పలు రకాల వ్యాఖ్యానాలు చేసేముందు, మా పార్టీ అధ్యకుడు ట్వీట్ ను అర్థం చేసుకోవలసిన అవసరం వుంది. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దేశభక్తిని ప్రశ్నించే వారి నేతి బీర దేశభక్తి గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసని జనసేన భావిస్తోంది. విమర్శలు మాని దక్షణాది వారికి ఉత్తరాదిలో సమాన అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని జనసేన కోరుతోంది. ఇట్లు మహేంద‌ర్‌ రెడ్డి...జనసేన పార్టీ ఉపాధ్యకుడు`` అని ఈ ప్ర‌క‌ట‌న ఉంది.