Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు జ‌న‌సేన కౌంట‌ర్‌.. ఏమందంటే!

By:  Tupaki Desk   |   21 Oct 2022 7:00 AM GMT
జ‌గ‌న్‌కు జ‌న‌సేన కౌంట‌ర్‌.. ఏమందంటే!
X
తనను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తాజాగా అవనిగడ్డ సభలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చింది. "మాట తప్పితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లే గతి.. నాకైనా ఇదే వర్తిస్తుంది" అంటూ జగన్‌ గతంలో ప్రతిపక్ష నేతగా చేసిన వ్యాఖ్యల్ని జనసేన కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్‌ చేస్తున్నారు.

రాజకీయ నాయకుడు ఎవరైనా అబద్ధాలు చెబితే, మోసాలు చేస్తే... చెప్పులు, చీపుర్లు చూపిస్తామంటూ ఏ రోజైతే ప్రజలు గట్టిగా నిలదీస్తారో అప్పుడే ఈ వ్యవస్థ మారుతుందని 2016 జూన్‌ 14న విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 'రాజకీయ నాయకులు తమను మోసగిస్తే చెప్పులు, చీపుర్లు చూపిస్తామనే స్థాయికి ప్రజలు రావాలి. ఇది రాజకీయ నాయకులందరికీ వర్తించాలి. అబద్ధాలు ఆడితే ఎవరికైనా సరే చెప్పులు, చీపుర్లు చూపించండి. ఈ సవాల్‌ ఎందుకు చేస్తున్నానంటే రేపు నాకైనా ఇదే వర్తిస్తుంది' అని ఆయన అన్నారు.

సీఎంకు చెముడొచ్చిందా?

'మూడు పెళ్ళిళ్లు చేసుకుంటే మంచిదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎక్కడా మాట్లాడలేదు. అలా ఆయన మాట్లాడారని ముఖ్యమంత్రి జగన్‌ అవనిగడ్డ సభలో చెప్పారు. సీఎంకు వినికిడి శక్తి లోపించిందో ఏమో.. మంచి ఈఎన్‌టీ వైద్యుడికి చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఒక పెళ్లి చేసుకుని 30 మంది స్టెప్నీలను పెట్టుకున్న వాళ్ల గురించి పవన్‌కల్యాణ్‌ మాట్లాడితే ముఖ్యమంత్రి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాసలీలలకు వైసీపీ బ్రాండ్‌ అంబాసిడర్‌. కొందరు నాయకుల తీరు అందరికీ తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకుంటామని చెబుతున్న మీరు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల తీర్పు కోరాలి' అని జనసేన రాష్ట్ర నాయకులు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లోని జనసేన ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి షేక్‌ రియాజ్‌, పార్టీ తెలంగాణ ఇంఛార్జి నేమూరి శంకర్‌గౌడ్‌లు విలేకరుల సమావేశంలో ఈ విమర్శలు చేశారు. జనం కష్టాలు తెలుసుకునేందుకు పవన్‌కల్యాణ్‌ జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి జగన్‌ దానిని అడ్డుకోవడం దుర్మార్గమని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అర్హంఖాన్‌ విమర్శించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.