Begin typing your search above and press return to search.

పవన్ కు వచ్చే సీట్ల లెక్క చెప్పుకొచ్చారు

By:  Tupaki Desk   |   26 Feb 2017 2:50 PM GMT
పవన్ కు వచ్చే సీట్ల లెక్క చెప్పుకొచ్చారు
X
పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్న విషయాన్ని తనకు తానే చెప్పుకున్న జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తన స్టైల్ మార్చిన విషయం తెలిసిందే. గతంలో మాదిరి ఎప్పుడో ఒకసారి.. ఏదో ఒక విషయం మీద మాట్లాడటం మానేసి..నిర్మాణాత్మకంగా.. అంతకు మించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో అర్థం లేని ఆవేశాన్ని తన ప్రసంగాల్లో చూపించిన పవన్ తీరుపై కొందరు చేస్తున్న విమర్శలు ఆయన దృష్టికి వెళ్లాయేమో కానీ.. ఇప్పుడు విషయాల మీద వినిపించే వాదనలో కాస్తంత స్టైల్ మార్చారు. .

మొన్నటివరకూ సింగిల్ మ్యాన్ షోగా ఉన్న జనసేన పార్టీకి.. ఇటీవల కాలంలో కొందరిని తెర పైకి తీసుకొచ్చారు పవన్ కల్యాణ్. మరో రెండేళ్ల వ్యవధిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న బలమైన తలంపుతో ఉన్న పవన్.. అందుకు తగ్గట్లే పావులు కదుపుతున్న విషయాన్ని ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ దిలీప్ సుంకర చెప్పకనే చెప్పారు.

పవన్ కల్యాణ్ పై జనస్వామ్యంలో ఉన్న ప్రతి విమర్శకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిన ఆయన.. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెబుతున్న అంశాలు ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసిన పవన్.. అన్నను తన ఛరిష్మాతో గెలిపించలేకపోయారని.. అలాంటి ఆయన సొంతంగా తన జనసేనతో సానుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉందా? అన్న సూటిప్రశ్నకు.. కళ్యాణ్ దిలీప్ సుంకర తన వాదనను వినిపించారు.

చిరంజీవి.. పవన్ కల్యాణ్ ఛరిష్మా ఏపీ రాజకీయాల్లో డిసైండిగ్ ఫ్యాక్టర్ అవుతుందన్న విషయం ప్రజలకు బాగానే తెలుసని.. ఆ విషయం 2009 ఎన్నికల ఫలితాలు కూడా చెప్పాయన్నది మర్చిపోకూడదని వ్యాఖ్యానించారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. అదేమంత చిన్న మొత్తం కాదు. చాలా మంచి ఓట్లు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అలాంటి కుటుంబం నుంచి విడిపోయి.. ఒక అంశాన్ని తీసుకొని.. దాని మీద బలమైన వాదనను వినిపిస్తూ.. గట్టిగా రాజకీయాల్లోకి వచ్చిన మా పార్టీ అధినేతకు 13 రాష్ట్రాల్లో ఎలాంటి ఓట్లు వస్తాయో తెలుసు. ఏబీఎన్ వాళ్లు ఏదో నాలుగు సర్వేలు చేసేసి.. ఏదో చెప్పేస్తే కాదు. మేం జనంలోకి వెళ్లాం. సర్వే చేశాం. మా సర్వే ఫలితాల ప్రకారం 13జిల్లాల్లో 57 నుంచి 62 స్థానాల్ని సొంతం చేసుకుంటామని తేలింది. అది కూడా ఇవాల్టికి ఇవాళ ఎన్నికలు పెడితే గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయి. ఒంటరిగా.. జనసేన పార్టీ విడివిడిగా అభ్యర్థుల్ని బరిలోకి దింపితే మాకొచ్చే సీట్లు 57 నుంచి 62. పార్టీ కార్యకర్తగా మేం వ్యక్తిగతంగా జనంలోకి వెళ్లి సర్వే చేశాం. ఏయే నియోజకవర్గాల్లో మాకెంత బలం ఉందన్నది మాకు తెలుసు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ను త్వరలోనే బయటపెడతాం’’ అని వ్యాఖ్యానించారు.

వ్యక్తిగత ప్రయోజనం కంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే దాని కోసం పోరాడాలన్నదే మా లక్ష్యం. అందుకు ఎంతవరకైనా..ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు. జాతీయ పార్టీ తరఫున ప్రచారం చేసి.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్లమెంటుకు అహ్వానించారు. చిన్న పార్టీ.. ఆయన తప్ప పార్టీలో మరెవరూ లేరు.. ఫిలింస్టార్ అయిన ఆయన్ను.. మిగిలిన మిత్రపక్షాల సరసన కూర్చోబెట్టి మర్యాద.. విలువ ఇస్తే.. అలాంటి వారిని కూడా కాదనుకున్నామంటే ఎవరి కోసం కాదనుకున్నామన్నది మర్చిపోకూడదన్నారు.‘‘అలాంటి వాటినే వదులుకున్న మా పార్టీ అధినేత.. ప్రాంతీయ పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నిస్తారనుకుంటే తప్పు. ప్రాంతీయ పార్టీలతో పొత్తుతో వచ్చే భౌగోళిక ప్రయోజనాల కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పండి’’ అని తన వాదనను వినిపించారు.