Begin typing your search above and press return to search.

పవన్ కు షాక్.. జనసైనికుల అస్త్రసన్యాసం

By:  Tupaki Desk   |   5 Jun 2019 5:19 AM GMT
పవన్ కు షాక్.. జనసైనికుల అస్త్రసన్యాసం
X
గోరుచుట్టు మీద రోకలిపోటు అంటే ఇదేనేమో.. ఏపీలో వైసీపీ గాలిలో కొట్టుకుపోయిన జనసేనకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కలలతో అడుగుపెట్టారు జనసేనాని పవన్. కానీ స్వయంగా ఆయన కూడా రెండు చోట్ల పోటీచేసి గెలవలేకపోయారు. ఒకే ఒక్క స్థానంలో జనసేన అభ్యర్థి గెలిచాడు. ఇక జనసేన నిలబడదని.. ఆ పార్టీలో భవిష్యత్ లేదని ఒక్కరొక్కరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఓటమిని జీర్ణించుకోలేని జనసేన అభిమానులకు ఇప్పుడు తాజాగా జనసేన నుంచి కీలక నేతలు నిష్క్రమించడం కలవరపెడుతోంది.

జనసేనలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ లేదని భావిస్తున్న నేతలు ఆ పార్టీని వీడి ఇప్పుడు అధికార వైసీపీలో చేరుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కోఆర్డినేటర్ ఎర్రంకి సూర్యారావు పవన్ పార్టీకి గుడ్ బై చెప్పాడు. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ - నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుల సమక్షంలో వైసీపీలో చేరారు.

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కోఆర్డినేటర్ గా ఎర్రంకి సూర్యారావును గతంలో నియమించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీకి అన్నా తానై సూర్యారావు నడిపించారు. పవన్ గెలుపు కోసం కూడా భీమవరంలో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వైసీపీ గాలిలో పవన్ కూడా గెలవకపోవడంతో ఆయన డైలామాలో పడ్డారు. దీంతో ఇక జనసేనలో భవిష్యత్ లేదని గ్రహించి వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎంపీ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

జనసేన దారుణ ఓటమితో పవన్ కోలుకోవడం లేదు. మీడియా ముందుకు కూడా రావడం లేదు. 2024 వరకు పార్టీ పునర్మిర్మాణానికి పవన్ ప్లాన్ చేశారు. గ్రామ - బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసి మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసైనికులు అస్త్రసన్యాసం చేయడం ఆ పార్టీని షాక్ కు గురిచేస్తోంది.