Begin typing your search above and press return to search.

ఏపీలో.. జగనన్న ఒళ్లు గుల్ల ఆస్పత్రి.. ఎక్క‌డంటే!?

By:  Tupaki Desk   |   16 July 2022 3:15 AM GMT
ఏపీలో.. జగనన్న ఒళ్లు గుల్ల ఆస్పత్రి.. ఎక్క‌డంటే!?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు మంచి కాక మీద ఉన్నాయి. ఓవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష టీడీపీ, ఇంకోవైపు జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా పార్టీల అధినేత‌ల మ‌ధ్య తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌రికొక‌రు వాడివేడీ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. వైఎస్ జ‌గ‌న్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సీబీఎన్ ద‌త్త‌పుత్రుడు అని విమ‌ర్శిస్తుంటే, ప‌వ‌న్ క‌ల్యాణ్.. జ‌గ‌న్ ను సీబీఐ ద‌త్త‌పుత్రుడు అంటూ నాలుగంటిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వినూత్న కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లో దూసుకువెళ్తున్నారు. ఇప్ప‌టికే జ‌న‌సేన కౌలురైతు భ‌రోసా యాత్ర పేరుతో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌వ‌న్ ల‌క్ష రూపాయ‌ల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. అలాగే ప్ర‌తి ఆదివారం.. జ‌న‌సేన పార్టీ జ‌న‌వాణి పేరుతో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రోడ్ల దుస్థితిపై జ‌న‌సేన పార్టీ డిజిట‌ల్ క్యాంపెయిన్ చేప‌ట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర‌వ్యాప్తంగా ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు దారుణ స్థితిలో ఉన్న రోడ్ల ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వంపై సెటైరిక‌ల్ గా జ‌గ‌న‌న్న ఒళ్లు గుల్ల‌ ఆస్ప‌త్రి పేరుతో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశార‌ని అంటున్నారు. రాష్ట్రంలో ర‌హ‌దారులపై ప్ర‌యాణించేవారి ప‌రిస్థితి ఘోరంగా ఉంటోందని.. ప్ర‌స్తుతం వ‌ర్షాల‌తో రోడ్లు మ‌రింత దిగ‌జారాయ‌ని చెబుతూ ఒక ఫ్లెక్సీ పెట్టి.. అందులో జ‌గ‌న‌న్న ఒళ్లు గుల్ల ఆస్ప‌త్రి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

రోడ్డుల‌పై ప్ర‌యాణించేవారు ప‌డిపోయి తీవ్రంగా గాయ‌ప‌డుతున్నార‌ని.. అందుకే జ‌గ‌న‌న్న ఒళ్లు గుల్ల ఆస్ప‌త్రి పేరుతో సెటైరిక‌ల్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశామ‌ని అంటున్నారు. ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేయటానికి తిరుపతిలో ఇలా 'జగనన్న' ఒళ్లు గుల్ల ఆస్పత్రి ఫ్లెక్సీని పెట్టామ‌ని చెబుతున్నారు.

అసలే ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌ల‌తోపాటు ప‌క్క రాష్ట్రానికి చెందిన మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటీవ‌ల తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌స్తుతం ఏ రోడ్డు చూసిన గుంతలమయంగానే ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. బైక్ మీద వెళ్లినా..ఆటో, బ‌స్సుల్లో ప్రయాణించినా నడుములు విరిగిపోతున్నాయ‌ని అంటున్నారు. రోడ్లమీద ప్రయాణించాలంటేనే హడలిపోతున్న పరిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. ఇదే అంశంపైన‌ జనసేన డిజిటల్ యుద్ధం ప్రారంభించింది.

గుంతలమయంగా ఉన్న రోడ్ల దుస్థితిని తెలియజేయటానికి, నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి 'గుమ్ మార్నింగ్ సీఎం' పేరుతో కార్యక్రమాన్ని చేపట్టిన సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల జ‌గ‌న్ పాలనలో రోడ్ల దుస్థితిపై వినూత్న‌ కార్యక్రమాలు చేపట్టింది. రోడ్ల దుస్థితిపై ఫోటోలు, వీడియోలు తీసి ప్రభుత్వానికి పంపుతోంది. జూలై 15కల్లా రోడ్లపై గుంతలను పూడ్చి మరమత్తులు చేపట్టాలని జగన్ ఆదేశాలను ప్రకటనల్లో కాదు అమలులో చేసి చూపించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. దీంట్లో భాగంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.