Begin typing your search above and press return to search.

అడ్డుకుంటే రోడ్లెక్కుతాం: వారిపై ప‌వ‌న్ ఫైర్‌!

By:  Tupaki Desk   |   3 Sep 2022 10:14 AM GMT
అడ్డుకుంటే రోడ్లెక్కుతాం:  వారిపై ప‌వ‌న్ ఫైర్‌!
X
విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేటలలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైఎస్సార్సీపీ వ‌ర్గాలు అడ్డుకున్న ఘ‌ట‌న‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మండిప‌డ్డారు. జ‌న‌సేన పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ‌ల‌ను వైఎస్సార్సీపీ అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోంద‌న్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ చేయ‌నీయ‌కుండా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పోలీసులు అరెస్టు చేయ‌డం.. ఆయ‌నను రిమాండ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేయ‌డంపై ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌న్నారు.

అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను వైఎస్సార్సీపీ శ్రేణులు జేసీబీతో కూల్చివేశార‌ని మండిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డినవారిని వ‌దిలేసి.. ఫిర్యాదు చేసిన త‌మ పార్టీ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. దోషులపై కేసు నమోదు చేయడానికి బదులు ప్రశ్నించిన జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయబద్ధమో పోలీస్ అధికారులు ఆలోచించాలన్నారు.

జనసేన శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని అనుమతి లేదన్న సాకుతో పోలీసులు అడ్డుప‌డుతున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. దీన్ని అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నామ‌ని తెలిపారు. అధికార వైఎస్సార్సీపీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తోందా అని ప‌వ‌న్ నిల‌దీశారు.

వైఎస్సార్సీపీ శ్రేణులు వాడవాడల్లో పెట్టిన విగ్రహాలకు, జెండా దిమ్మల‌కు, వారు వేస్తున్న రంగులకు ముందుగా మున్సిపల్, పంచాయితీ శాఖ‌ల నుంచి అనుమతి తీసుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. వైఎస్సార్సీపీ తీసుకుంటున్న అన్నిటికీ అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించగలరా? అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా? అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాద‌ని ప‌వ‌న్ తేల్చిచెప్పారు. ప్రజలే పార్టీని కాపాడుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగచేయకూడదనే తాను నిన్న, మొన్న ఇంత జరుగుతున్నా రోడ్ల మీద‌కు రాలేద‌న్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను రోడ్డెక్కడం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు. పోతిన వెంక‌ట‌ మహేష్ కు, జగ్గయ్యపేట సంఘటనలో అక్రమ కేసులకు గురైన బండ్రెడ్డి రామకృష్ణ.. ఇతర నాయకులు, కార్యకర్తలకు జనసేన పార్టీ అండగా ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.

పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వంలోని పెద్దలు, ఎమ్మెల్యేలు ఈ రోజు ఉంటారు.. రేపు పదవి ఊడితే ఇంటికి పోతార‌న్నారు. కానీ పోలీసులు మాత్రం సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే గడుపుతార‌ని ప‌వ‌న్ గుర్తు చేవారు. మరో పార్టీ ప్రభుత్వం వస్తే పోలీసులు తలదించుకునే పరిస్థితి రాకూడద‌ని కోరుకుంటున్నాన‌న్నారు. అందువల్ల ధర్మాన్ని పాటించాల‌ని పోలీసుల‌ను కోరారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.