Begin typing your search above and press return to search.

ఆ ఎన్నిక‌లే జ‌న‌సేన‌కు సెమీఫైన‌ల్స్‌..!

By:  Tupaki Desk   |   4 Sep 2016 6:52 AM GMT
ఆ ఎన్నిక‌లే జ‌న‌సేన‌కు సెమీఫైన‌ల్స్‌..!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ పూర్తి స్థాయిలో కార్యాచ‌ర‌ణ ప్రారంభించ‌నుందా? ఇక నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నుందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది! ఇటీవ‌ల తిరుప‌తిలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఓ రేంజ్‌ లో ప్ర‌సంగించిన ప‌వ‌న్‌.. ఇక నుంచి అటు సినిమాల్లోను, ఇటు ప్ర‌జ‌ల్లోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదాపైనా కామెంట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో 2014లో కేవ‌లం పార్టీ ఏర్పాటుకే ప‌రిమిత‌మైన ప‌వ‌న్.. ఇక దానిని ప‌రుగులు పెట్టిస్తార‌ని ఇప్పుడు అంద‌రూ భావిస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పూర్తిగా పోటీకి దిగుతుంద‌ని అంటున్నారు. అయితే, ఈ ఫైన‌ల్స్‌ లో పోటీకి ముందే ఈ ఏడాది న‌వంబ‌ర్‌ లో జ‌ర‌గ‌నున్న లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్‌ లో ప‌వ‌న్ త‌న టీంను దింపుతార‌ని అంటున్నారు.

ఈ ఏడాది చివ‌ర్లో ఏపీలోని 11 మునిసిపాలిటీలు - కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎల‌క్ష‌న్‌ లో జ‌న‌సేన పూర్తిస్థాయిలో రంగంలోకి దిగ‌డం ద్వారా జ‌న‌సేన స‌త్తా నిరూపించుకుంటుంద‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే చెబుతున్నారు. ఈ ఫ‌లితాలు 2019లో జ‌రిగే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కూడా వారు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ విష‌యాన్ని ఈ నెల 9న కాకినాడ‌లో నిర్వ‌హించే స‌భ ద్వారా ప‌వ‌నే ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంద‌ని కూడా వారు అంటున్నారు. ఇదే జ‌రిగితే.. ఏపీలో ట్ర‌యాంగిల్ పాలిటిక్స్ జోరు పెరుగుతుంద‌ని చెబుతున్నారు. ఇక‌, కాకినాడ స‌భ‌లో ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంపైనా ప‌వ‌న్ త‌న మ‌న‌సులో మాట చెబుతార‌ని, ఈ విష‌యంలో ఒకింత అస‌హ‌నంతోనే ఆయ‌న ఉన్నార‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా అంటూ ఊరిస్తూ వ‌చ్చి.. ఇప్పుడు ఒక్క‌సారిగా ప్యాకేజీకే కేంద్రం మొగ్గు చూపుతుండ‌డంపై ఆయ‌న స్పందిస్తార‌ని, ఈ విష‌యంలో త‌న‌కు మిత్ర‌ప‌క్షం బీజేపీ తో తాడోపేడో కూడా తేల్చుకునే ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు. విభజనకు ముందు రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాపై బీజేపీ వెనకడుగు వేయడంపై పవన్ విరుచుకుపడే అవకాశాలే కనిపిస్తున్నాయ‌ని అంటున్నారు. ఇదిలావుంటే, ప‌వ‌న్ స‌భకు సంబంధించి ఇప్ప‌టికే భూమి పూజ పూర్తి చేసిన కార్య‌క‌ర్త‌లు మిగిలిన ఏర్పాట్ల‌లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది సభకు వస్తారని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ తెర‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.