Begin typing your search above and press return to search.

ఆ ఉన్న‌తాధికారి ఆక‌స్మిక బ‌దిలీ.. కోకాపేట ఎఫెక్ట్‌?

By:  Tupaki Desk   |   29 Jan 2019 4:39 AM GMT
ఆ ఉన్న‌తాధికారి ఆక‌స్మిక బ‌దిలీ.. కోకాపేట ఎఫెక్ట్‌?
X
సింఫుల్ గా చెబితే.. హెచ్ ఎండీఏ. కాస్త వివ‌రంగా చెప్పండి బాస్ అంటారా? ఓకే. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాభివృద్ధి సంస్థ‌. దీనికో క‌మిష‌న‌ర్ ఉంటారు. ఆయ‌న పేరు జ‌నార్ధ‌న్ రెడ్డి. ఎక్క‌డో విన్న‌ట్లుందే అంటారా? క‌రెక్టే. ఐదు నెల‌ల క్రితం వ‌ర‌కూ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌హాపాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన ఉన్న‌తాధికారి ఆయ‌న‌. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. ఎవ‌రైనా స‌రే.. నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరు.

అలాంటి ఆయ‌న‌పై సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో బ‌దిలీ వేటు వేస్తూ ప్ర‌భుత్వం నుంచి నిర్ణ‌యం వెలువ‌డింది. అధికారిక ఉత్త‌ర్వులు రావ‌టానికి కొన్ని గంట‌ల ముందే అన‌ధికారికంగా ఈ స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఏ శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారి అయినా విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న తిరిగి వ‌చ్చే వ‌ర‌కూ బ‌దిలీ చేయ‌రు. కానీ.. అందుకు భిన్నంగా జ‌నార్ద‌న్ రెడ్డి సోమ‌వారం రాత్రి తిరిగి రావ‌టానికి ముందే ఆయ‌న బ‌దిలీ ఉత్త‌ర్వులు విడుద‌లై ఉంది. అంతేనా.. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వ‌కుండా వెయిటింగ్ లో పెట్టింది.

ముక్కుసూటిగా ఉండే అధికారికి ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌కుండా వెయిటింగ్ లో పెట్ట‌టం చాలా అరుదు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. హెచ్ ఎండీఏ క‌మిష‌న‌ర్ గా మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. నిబంధ‌న‌ల‌కు భిన్నంగా నిర్ణ‌యం తీసుకోవ‌టానికి ఏ మాత్రం ఒప్పుకోని అధికారిగా పేరున్న జ‌నార్ద‌న్ రెడ్డికి స‌మ‌స్య ఏదైనా ఉంటే చాలు ప‌రిష్క‌రించే స‌త్తా ఉన్న ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరుంది.

అలాంటి ఆయ‌న్ను ఎందుకింత ఆక‌స్మికంగా బ‌దిలీ చేశారు. అది కూడా పోస్టింగ్ ఇచ్చిన ఐదు నెల‌ల స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఎందుకు మార్చారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు బ‌దిలీ చేసిన‌ట్లు చెబుతుంటే.. అదేమీ లేదు మాట విన‌ని కార‌ణంగానే ఆయ‌న‌పై బ‌దిలీ వేటు ప‌డింద‌న్న మాట వినిపిస్తోంది. ఎందుక‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఏమంటే.. వేలాది కోట్లు విలువైన కోకాపేట భూముల‌కు సంబంధించిన అంశంలో ఆయ‌న ఫేవ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్నది ప్ర‌ధాన ఆరోప‌ణ‌గా వినిపిస్తోంది.

కోకాపేట భూముల‌కు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఈ మ‌ధ్య‌నే అత్యున్న‌త న్యాయ‌స్థానం భూముల వివాదాన్ని ప‌రిష్క‌రిస్తూ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్ర‌కారం గ‌తంలో డ‌బ్బు చెల్లించిన వారికి నాడు క‌ట్టిన మొత్తానికి త‌గ్గ‌ట్లుగా భూములు కేటాయించాల‌ని పేర్కొంది. ఇక్క‌డే.. అస‌లు క‌థ మొద‌లైన‌ట్లు చెబుతున్నారు. కోకాపేట‌లోని 623 ఎక‌రాల భూమిని ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి ప్ర‌భుత్వం హెచ్ ఎండీఏకు అప్ప‌గించింది. నిధుల స‌మీక‌ర‌ణ‌లో భాగంగా ఆ భూముల‌ను ప్లాట్లుగా విభ‌జించి వేలంలో అమ్మాల‌ని డిసైడ్ అయ్యింది.

2006-08 మ‌ధ్య‌లో 166 ఎక‌రాల‌ను వేలం వేసింది. అందులో ఎక‌రం రూ.5.50 కోట్ల నుంచి రూ.13 కోట్ల ధ‌ర ప‌లికింది. మొత్తం భూముల‌కు రూ.177 కోట్లకు కొనుగోలు చేసేందుకు ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయి. వేలంలో భాగంగా ఈఎండీతో పాటు మొద‌టి.. రెండో వాయిదా మొత్తం కింద రూ.687 కోట్లు కేటాయించారు. వేలానికి ముందే ఈ భూములు త‌న‌వేన‌ని అలీ అనే వ్య‌క్తి కోర్టులో కేసు వేశారు. కోకాపేట భూములు వివాదాస్ప‌దం కావ‌టంతో వేలం చేసి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాల‌ని కోర్టు చెప్ప‌గా.. అప్పీలులో హెచ్ ఎండీఏకు అనుకూలంగా ఆదేశాలు వ‌చ్చాయి. కోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వ‌చ్చిన నేప‌థ్యంలో వేలంలో భాగంగా మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే భూములు ఇస్తామంటూ స‌మాచారాన్ని అందించింది.

అదే స‌మ‌యంలో అలీ అప్పీలుకు వెళ్ల‌టంతో వేలంలో భూములు సొంతం చేసుక‌న్న వారు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. తాము చెల్లించిన డ‌బ్బును తిరిగి ఇప్పించాల్సిందిగా స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ వేశారు. తాము చెల్లించిన మొత్తాల‌కు వ‌డ్డీతో స‌హా తిరిగి ఇవ్వాల‌ని కొంద‌రు కోర‌గా.. మ‌రికొంద‌రు తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇస్తే చాల‌ని పేర్కొన్నారు. ఇంకొంద‌రు తాము న‌గ‌దు చెల్లించిన నాడు ఉన్న ధ‌ర‌కు.. తాము చెల్లించిన మొత్తానికి స‌రిప‌డా భూముల్ని కేటాయించాల‌ని కోరారు.

ఇదిలా ఉంటే.. భూముల్ని వేలంలో కొనుగోలు చేసిన వాయిదా మొత్తాన్ని క‌ట్టిన వారు.. అప్ప‌ట్లో ఎంత మొత్తాన్ని క‌ట్టారో.. అంత మొత్తానికి (అప్ప‌టి ధ‌ర‌కు త‌గ్గ‌ట్లు) వ‌చ్చే భూమిని ఇస్తామ‌ని.. మిగిలిన భూమి కావాలంటే ఇప్ప‌టి మార్కెట్ రేటు చెల్లించాల‌ని హెచ్ ఎండీఏ వాదిస్తోంది. దీనికి జ‌నార్ద‌న్ రెడ్డి కీల‌కంగా మారారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం కోకాపేట భూముల‌పై పెద్ద‌ల క‌న్ను ప‌డింది. పాత ధ‌ర ప్ర‌కార‌మే మొత్తం భూమిని ఇవ్వాలంటూ ఒత్తిళ్లు చేయ‌టం మొద‌లైంది. ఇందులో భాగంగా కారుచౌక ధ‌ర‌కే మొత్తం భూమిని సొంతం చేసుకోవాలంటూ పావులు క‌దిపిన‌ట్లుగా తెలుస్తోంది.

అప్ప‌ట్లో కోకాపేట‌లో ఎక‌రం భూమి రూ.5.50 కోఎట్ల నుంచి రూ.13 కోట్లు ప‌లికిన భూమి ధ‌ర ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల‌కు పెరిగింది. ప్ర‌స్తుత ధ‌ర ప్ర‌కారం వేలం వేసిన 166 ఎక‌రాల విలువ ఏకంగా రూ.4వేల కోట్లు. పాత లెక్క‌ల ప్ర‌కారం చూస్తే.. అది కేవ‌లం రూ.1775 కోట్లు మాత్ర‌మే. అంటే.. తేడా రూ.2500 కోట్లు అన్న మాట‌. ఈ భారీ మొత్తాన్ని సింఫుల్ గా త‌మ ఖాతాలో వేసుకునేందుకు వీలుగా పావులు క‌దుపుతున్నారు.

కానీ.. రూల్ బుక్ లో రూల్ కి ఏ మాత్రం తేడా కొట్టినా నో అంటే నో అనేసే జ‌నార్దునుడు అందుకు స‌సేమిరా అన‌టం.. పెద్ద‌ల ఒత్తిడికి కూల్ గా నో చెప్పేయ‌టంతో బ‌దిలీ వేటు ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ విష‌యం ఇప్పుడు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ.. వ్యాపార వ‌ర్గాల్లోనూ..అధికార వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.