Begin typing your search above and press return to search.

టీపీసీసీ ప్రెసిడెంట్ గా జానారెడ్డి.?

By:  Tupaki Desk   |   31 Oct 2019 7:40 AM GMT
టీపీసీసీ ప్రెసిడెంట్ గా జానారెడ్డి.?
X
‘మనోడే కావాలి.. పగోడు కావడానికి వీల్లేదు..’ ఇప్పుడీ సంప్రదాయం తెలంగాణ కాంగ్రెస్ లో అందరినోటా వినిపిస్తోందట.. తెలంగాణలో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్ దిగిపోవడమే తరువాయి అన్న చర్చ పార్టీలో సాగుతోంది. సొంత సిట్టింగ్ స్తానాన్ని కూడా గెలిపించుకోలేని ఉత్తమ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికే డిసైడ్ అయ్యాడని ప్రచారం సాగుతోంది.

అయితే ఉత్తమ్ దిగిపోతే నెక్ట్స్ తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే నాయకుడు ఎవరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఆధిపత్యాన్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదట. అనాదిగా కాంగ్రెస్ నే నమ్ముకొని ఆ పార్టీలోనే ఉంటున్న సీనియర్లు ఇప్పుడు పీసీసీ పదవి ఉత్తమ్ చేజారినా వేరొకరికి వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. పక్కపార్టీనుంచి వచ్చి ఏకు మేకు అయిన రేవంత్ రెడ్డికి పీసీపీ పీఠం వదులుకోవడానికి కాంగ్రెస్ సీనియర్లు అస్సలు ఇష్టపడడం లేదన్న చర్చ సాగుతోంది.

ఉత్తమ్ దిగిపోవడం ఖాయమని అంతా అంటున్నారు. మరి ఆ స్థానంలో బలంగా దూసుకువస్తున్న రేవంత్ కు ఆ అవకాశం ఇవ్వకూడదన్న బలమైన కోరిక టీపీసీసీ పెద్దల్లో ఉందట.. ముఖ్యంగా కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల చేతుల్లోనే కాంగ్రెస్ పగ్గాలు ఉండాలని ఆ జిల్లా సీనియర్లు అంతా పట్టుదలగా ఉన్నారట.. అంతా కూడబలుకుకొని రేవంత్ ను దూరం పెడుతున్నారన్న చర్చ సాగుతోంది.

మొన్నటి హుజూర్ నగర్ అభ్యర్థి విషయంలోనూ ఉత్తమ్ ప్రతిపాదించిన పద్మావతికే ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్లు అయిన జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డి సహా వీహెచ్, పొన్నం,భట్టి ఇతర సీనియర్లు మద్దతు తెలిపారు. రేవంత్ మాట నెగ్గలేకపోయింది. ఇప్పుడు కూడా కాబోయే పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ ఎంత లాబీయింగ్ చేస్తున్నా అతడి ఆశలపై నీళ్లు చల్లుతూ తాజాగా తెరపైకి జానారెడ్డి పేరు బయటకు వచ్చింది. టీపీసీసీ ప్రెసిడెంట్ గా జానారెడ్డిని కాంగ్రెస్ సీనియర్లు ప్రతిపాదిస్తున్నారట.. టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో ఎదుగుతున్న రేవంత్ కు ఛాన్స్ లేకుండా.. అతడి సీఎం ఆశలు నెరవేరకుండా కాంగ్రెస్ సీనియర్లే అడ్డుపడుతున్న పరిస్థితి ఆ పార్టీలో సాగుతోంది.