Begin typing your search above and press return to search.

జానాకు రెండు రాజ‌కీయ ప‌రీక్ష‌లు

By:  Tupaki Desk   |   16 July 2016 10:36 AM GMT
జానాకు రెండు రాజ‌కీయ ప‌రీక్ష‌లు
X
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియ‌ర్ నేత జానా రెడ్డికి రెండు రాజ‌కీయ విష‌మ ప‌రీక్ష‌లు ఎదుర‌య్యాయ‌ట‌! రాజ‌కీయంగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లే ఆయ‌న‌కు ఒక ప‌రీక్షకాగా - ఆయ‌న వార‌సుడి అంశం ఆయ‌నకు మ‌రో ప‌రీక్ష‌గా మారింది. ఎవ‌రైనా స‌రే అది రాజ‌కీయ‌మైనా.. మ‌రో రంగమైనా.. ఆచి తూచి - నోరు అదుపులో పెట్టుకుని మాట్టాడ‌క‌పోతే ఇప్పుడు జానా ప‌డుతున్న వేద‌నే ప‌డాల్సి వ‌స్తుంది. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న ఎక్క‌డ ఏ సంద‌ర్భంగా వ‌చ్చినా అధికార టీఆర్ ఎస్‌ ను - కేసీఆర్‌ ను ప‌రోక్షంగా పొడిగేస్తున్నారు. ఆ ప‌ని పూర్త‌యితే.. నేను టీఆర్ ఎస్‌ కి ప్ర‌చారం చేస్తా.. ఈ ప‌ని పూర్త‌యితే.. ఇంకోటి చేస్తా.. ఐదు రూపాయ‌ల అన్నం మ‌హాద్భుతం అంటూ మాట్లాడిన జానాకు ఇప్పుడు ఆ మాట‌లే ప‌రీక్ష పెడుతున్నాయి. స‌ద‌రు వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న అధికార పార్టీకి తొత్తుగా మారార‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శించారు.

దీంతో తాను కాంగ్రెస్‌ కే క‌ట్టుబ‌డ్డ వీర విధేయుడిన‌ని చాటుకోవాల్సిన అగ‌త్యం ఏర్ప‌డింది. అంతేకాదు, తాను కేసీఆర్‌ కు - ఆయ‌న పార్టీకి కూడా తీవ్ర వ్య‌తిరేక‌మ‌నే భావ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతో ఆయ‌న ఒక ప‌క్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నారంట‌. అదేంటంటే.. ఇటీవ‌లే టీఆర్ ఎస్ లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి - మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుపై ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకుంటే ఆ రెండు స్థానాల్లోను ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించే ఛాన్సుంది. కాబ‌ట్టి అక్క‌డ త‌న‌యుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపాలని జానారెడ్డి ప్లాన్ చేశారట‌. దీంతో ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్టు త‌న‌పై వ‌చ్చిన అప‌వాదుల‌ను స‌రి చేసుకోవ‌డానికి ఇక‌, తన వార‌సుడిగా కుమారుడిని రాజ‌కీయ అరంగేట్రం చేయించ‌డానికి స‌రిపోతుంద‌ని ఆయ‌న వ్యూహంలో ఉన్నార‌ట‌.

అయితే, ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నేది అంద‌రికీ తెలిసిందే. మ‌రి ఈస‌మ‌యంలో జానా కుమారుడిని తెర‌మీద‌కి తెస్తే ఎంత‌మంది ఓట్లేస్తార‌ని మీకు డౌట్ వ‌చ్చుంటుంది. అయితే, కాక‌లు తీరిన జానాకు ఈ డౌటు రాకుండా ఉంటుందా? ఆయ‌న‌కూ వ‌చ్చింది. అయితే - కేవ‌లం త‌న‌ను తాను నిరూపించుకోవ‌డం, త‌న కుమారుడిని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌డం కోస‌మే ఉప ఎన్నిక‌ల‌ను ఆయ‌న వాడుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇదే జ‌రిగితే.. తాను ఎవ‌రిని ఎన్ని పొగిడినా.. కాంగ్రెస్‌ కే విధేయుడిన‌ని చెప్పుకునేందుకు జానాకు గొప్ప ఛాన్స్‌. ఇక‌, త‌న‌కుమారుడు ఓడినా.. వ‌చ్చే 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో టికెట్ అడ‌గ‌డం సులువ‌వుతుంద‌ని ఈ మాజీ హోం మంత్రి గారి ప్లాన్‌. బాగానే ఉంది. నిజంగా జానా అనుకున్న‌ట్టు జ‌రిగితే.. ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌లు కొట్ట‌డం ఖాయం. మ‌రేం జ‌రుగుతుందో కొన్నాళ్లు వేచి చూడాలి.