Begin typing your search above and press return to search.

జనసైనికుల పంచ్.. బీజేపీ నేత ఔట్

By:  Tupaki Desk   |   2 Nov 2019 10:47 AM GMT
జనసైనికుల పంచ్.. బీజేపీ నేత ఔట్
X
సోషల్ మీడియా పవరేంటో భారతీయ జనతా పార్టీ నేత.. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి తెలిసొచ్చింది. ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఎంత మాటంటే అంత మాట అంటూ రెచ్చిపోవడం అలవాటైన విష్ణువర్ధన్.. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఏపీలో ఇసుక సంక్షోభం మీద ఆందోళనకు సిద్ధమవుతున్న పవన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయనకు విలువలు లేవని మండిపడ్డారు. ఇది జనసేన మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. విష్ణు స్థాయికి పవన్ మీద అంతేసి విమర్శలు చేయడాన్ని వాళ్లు సహించలేకపోయారు. విష్ణు బండారం బయటపెట్టడానికి పూనుకున్నారు. కొన్నేళ్ల వెనక్కి వెళ్లి ఆయన ట్విట్టర్ అకౌంట్లో పేలిన అవాకులు చెవాకులన్నింటినీ బయటికి తీశారు.

ఇప్పుడు ఏ భారతీయ జనతా పార్టీనైతే నెత్తికెత్తుకున్నాడో అదే పార్టీని విష్ణు ఒకప్పుడు తిట్టిపోశాడు. ఆ పార్టీని గంగలో కలపాలన్నాడు. అంతే కాదు.. తన సామాజిక వర్గం నాయకుల్ని, సినీ హీరోలను ఆకాశానికెత్తేస్తూ మరో సామాజికవర్గం హీరోలు, నాయకులపై తీవ్రమైన విమర్శలు చేశాడు. కుల, మతపరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. హీరోయిన్ సమీరా రెడ్డి గురించి సెక్సీ కామెంట్లు చేశాడు. బాలయ్యను, ఎన్టీఆర్‌ను తీవ్ర స్థాయిలో దూషించాడు. ఈ కామెంట్లలో చాలా వరకు చీప్‌గా ఉండటంతో విష్ణు ఇప్పుడు ఇరుకున పడిపోయాడు. పదుల సంఖ్యలో పాత ట్వీట్లు బయటికి రావడంతో కక్కలేక మింగలేక ఇబ్బంది పడిపోయాడు. జనసైనికులు వాటిని వైరల్ చేయడంతో ఈయన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. వెంటనే తన పాత ట్వీట్లను డెలీట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ అవి వందల్లో ఉండటంతో ఏం చేయాలో పాలుపోక చివరికి ఆ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాడు. తర్వాత యు టర్న్ తీసుకుంటూ అదసలు తన అకౌంటే కాదని చెబుతూ ఒక ప్రెస్ నోట్ జారీ చేశాడు. తన అకౌంట్‌ను వేరొకరు మేనేజ్ చేశారని.. వాళ్ల దగ్గర్నుంచి మరొకరి దగ్గరికి వెళ్లిందని.. తన పేరిట ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్న ట్వీట్లు తనవి కాదని తేల్చేశాడు. తనకు సంబంధం లేని విషయం అయినప్పటికీ ఈ వ్యవహారంపై క్షమాపణ చెబుతున్నట్లు తెలిపాడు. కానీ ఆయన ఎంత కవర్ డ్రైవ్ ఆడదామని చూసినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ పరిణామం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపినా ఆశ్చర్యం లేదు.