Begin typing your search above and press return to search.

వార్డుల్లో జ‌న‌సేన పోటీ.. వ‌చ్చిన ఓట్లు 252... మ‌రీ దారుణం!

By:  Tupaki Desk   |   10 Dec 2021 1:28 AM GMT
వార్డుల్లో జ‌న‌సేన పోటీ.. వ‌చ్చిన ఓట్లు 252... మ‌రీ దారుణం!
X
ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, ఆ పార్టీకి.. ఇప్పుడు పెద్ద పెద్ద ప్ర‌శ్న‌లే ఎదుర‌వుతున్నాయి. ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌డం ఏమో కానీ.. ప‌వ‌న్‌నే ప్ర‌శ్నించే ప‌రిస్థితి ఇటు పార్టీలోనూ.. అటు ప్ర‌జ‌ల్లోనూ నెల‌కొంది. దీనికి కార‌ణం.. పార్టీని న‌డిపించే నాయ‌కుడులేక‌పోవ‌డ‌మే! ఏదో అప్పుడ‌ప్పుడు వ‌చ్చి.. నాలుగు సినిమా డైలాగులు పేలిస్తే.. మోకాళ్ల‌పై నిల‌బెడ‌తాం.. తాట‌తీస్తాం.. తోలు తీస్తాం.. అంటూ వ్యాఖ్యానిస్తే.. ఏమేర‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏ పార్టీకైనా.. ఎన్నిక‌లే ప‌ర‌మావ‌ధి. ఎన్నిక‌ల్లో స‌త్తా చూప‌డం.. పార్టీల ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్యం.

లేక‌పోతే.. స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు పార్టీల‌కు తేడా ఉండ‌దు. మాకు ఓటు బ్యాంకు అవ‌స‌రం లేదు.. అనే స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఉన్నాయి కానీ.. పార్టీలు ఉండ‌వు. కానీ.. జ‌న‌సేన‌లో మాత్రం ఓటు బ్యాంకు కోసం.. ప్ర‌య‌త్నిస్తున్న ప‌రిస్థితి మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా.. ఉన్న ఓటు బ్యాంకును కూడా ప‌దిలం చేసుకునే వ్యూహాలు కూడా క‌నిపించ‌డం లేదు. దీనికి పెద్ద ఉదాహ‌ర‌ణ... ఇటీవ‌ల రెండో విడ‌త‌లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లే. కొత్త‌గా ఏర్ప‌డిన న‌గ‌ర పంచాయ‌తీలు, మునిసిపాలిటీల్లో ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి కూడా ఉంది.

నిజానికి ప్ర‌కాశంలో ఇప్పుడు వైసీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలో ద‌ర్శి కూడా వైసీపీ ఖాతాలో ప‌డుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ మునిసిపాలిటీని టీడీపీ ద‌క్కించుకుంది. టీడీపీ స‌త్తా ఇక్క‌డ బాగానే చూపింద‌నే టాక్ కూడా వ‌చ్చింది. దీంతో పార్టీలో నూత‌న ఉత్తేజం క‌నిపించింది. అయితే.. ఇదే ద‌ర్శి మునిసిపాలిటీలో జ‌న‌సేన త‌ర‌ఫున 12 వార్డుల్లో ఆపార్టీ అభ్య‌ర్థులు ఒంట‌రిగానే పోటీ చేశారు. నిజానికి ఇక్క‌డ కాపు ఓటు బ్యాంకుఎక్కువ‌. దాదాపు 8000 కాపు ఓట్లు ఉన్న‌ట్టు అంచ‌నా ఉంది. దీంతో త‌మ‌కు బాగానే ప్ల‌స్ అవుతుంద‌ని ఈ నాయ‌కులు భావించారు.

అయితే.. అనూహ్యంగా కాపు ఓటు బ్యాంకు టీడీపీకి ప్ల‌స్ అయింది. జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థు ల‌కు కేవ‌లం 252 ఓట్లు మాత్ర‌మే ద‌క్కాయి. దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌నే చ‌ర్చ జ‌రిగింది. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన ఇక్క‌డ ఎందుకు విఫ‌ల‌మైంద‌ని మేధావులు కూడా త‌ల‌లు ప‌ట్టుకున్నారు. తీరా ఈ చ‌ర్చ‌ల్లో తేలింది ఏంటంటే.. జ‌న‌సేన ను ముందుండి న‌డిపించే నాయ‌కులు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ పార్టీకి చెందిన వారు కూడా ప్ర‌యోజ‌నం లేద‌ని భావించి.. టీడీపీకే మొగ్గు చూపార‌ట‌. దీంతో ఇక్క‌డ టీడీపీ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క మాదిరిగా సాగిపోయింది.

దీనిని బ‌ట్టి.. జ‌న‌సేన ఓటు బ్యాంకు బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీలో నెల‌కొన్న నిర్ణ‌యాత్మ‌క విధానాల లోపం.. న‌డిపించే నాయ‌క‌గ‌ణం లేక పోవ‌డం పార్టీకి పెద్ద మైన‌స్‌గా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా.. జ‌న‌సేన ఇలాంటి లోటుపాట్ల‌పై దృష్టి పెడుతుందా? లేక .. ఏదో సినిమా డైలాగులు పేల్చేసి స‌రిపెడుతుందా? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఏం చేస్తారో చూడాలి.