Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి..!

By:  Tupaki Desk   |   10 July 2016 8:20 AM GMT
ప‌వ‌న్‌ పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి..!
X
పార్టీని స్థాపించిన అధ్య‌క్షుడు ఒకింత మౌనంగా - మెత్త‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఆ పార్టీని - ఆ అధ్య‌క్షుడిని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌లు మాత్రం త‌మ‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. అవినీతిపై త‌మ‌దైన పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. అంతేకాదు, ప్ర‌జాక్షేత్రంలో నిల‌బ‌డి త‌మ స‌త్తా చాటేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్నారు. మ‌రో అడుగు ముందుకేసి మిత్ర‌ప‌క్షాల అవినీతిపై స‌మ‌ర శంఖం పూరించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇంత‌కీ ఆ పార్టీ ఏంట‌నేదేగా సందేహం.. అదేనండీ మెగా బ్ర‌ద‌ర్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో తెలియదు కానీ.. విశాఖ జనసేన కార్యకర్తలు మాత్రం మంచి ఊపుమీదున్నారు.

ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నంలో జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల‌కు వారు ద‌శ దిశ నిర్దేశించుకుంటున్నారు. అంతేకాదు, టీడీపీ - బీజేపీల‌తో జ‌న‌సేన క‌లిసి ఉండ‌డాన్ని వారు అస్స‌లు స‌హించ‌లేక పోతున్నారు. ఆ రెండు పార్టీలూ ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తున్నాయ‌ని, అవినీతిలో కూరుకుపోతున్నాయ‌ని తెగ బాధ‌ప‌డిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ - బీజేపీలతో తెగదెంపులు చేసుకునే విషయమై జనసేన కార్యకర్తలు పవన్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. విశాఖ నగరంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ నగర పాలక ఎన్నికల నాటికి టీడీపీ - బీజేపీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సైతం జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

విశాఖ‌లో కాలుష్య నివారణ విష‌యంలో ప్రభుత్వం విఫలం చెందిందని, హుదూద్ తుఫానుకు సంబంధించి చేప‌ట్టిన‌ సహాయక చర్యల్లో అవినీతి జరిగిందని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ రెండు విషయాల పై ఆందోళన చేసేందుకు విశాఖపట్నం లో వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖపట్నం నగర పాలక సంస్థ(జీవీఎంసీ)లోని 72 వార్డుల్లో కూడా జనసేన సమావేశాలు నిర్వహించింది. వార్డుల వారీగా ప్రజల సమస్యల పై అధ్యనం చేసి నివేదికని పవన్‌కు సమర్పించాలనే యోచనలో జనసేన కార్యకర్తలు ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ పై సూచనలు సలహాలు చేయమని పవన్ ను కోరనున్నారు.

సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు టీడీపీ, బీజేపీలతో తెగదెంపులు చేసుకునేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం. ప్రజలలో ఆ రెండు పార్టీల‌పై వ్యతిరేకత మొదలైందని మిత్ర పక్షం గా ప్రజలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని అంటున్నారు. ఈ విషయంలో పవన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు. అయితే, ఏ విష‌యంలోనైనా ఆచితూచి అడుగేసే ప‌వ‌న్ ఇప్పుడు త‌న కార్య‌క‌ర్త‌ల డిమాండ్‌పై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో వేడి పుట్ట‌డం ఆశించ‌ద‌గిన ప‌రిణామమ‌న్న టాక్ ఏపీ రాజ‌కీయాల్లో వినిపిస్తోంది. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు జోరుగా దూసుకెళుతుంటే నాయ‌కుడు ప‌వ‌న్ మాత్రం మౌనంగా ముందుకు వెళుతున్నారు.