Begin typing your search above and press return to search.

జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కు విప్ లేదు, మాట వింటారా?

By:  Tupaki Desk   |   21 Sep 2021 7:20 AM GMT
జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కు విప్ లేదు, మాట వింటారా?
X
ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కొద్దో గొప్పో ఉనికిని చాటుకుంది జ‌న‌సేన‌. నామ‌మాత్రంగా అయినా సీట్లు వ‌చ్చాయి. అయితే వ‌చ్చిన సీట్లు కొన్ని చోట్ల మాత్ర‌మే రావ‌డంతో.. జ‌న‌సేన రాజ‌కీయ ఉనికి అక్క‌డి వ‌ర‌కూ అయినా అవి ప‌నికొచ్చేలా ఉన్నాయి. గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన నంబ‌ర్ల‌ను రిజిస్ట‌ర్ చేసింది. మ‌రి అక్క‌డ ఎక్క‌డైనా ఎంపీపీల ఎన్నిక‌లో జ‌న‌సేన ఓట్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం.

ఆ సంగ‌తెలా ఉన్నా.. ఎంపీపీ, జ‌డ్పీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన విప్ జారీ చేయ‌లేద‌ని తెలుస్తోంది. త‌మ పార్టీ గుర్తుపై నెగ్గిన వారు ఫ‌లానా అభ్య‌ర్థికే ఓటు వేయాలి లేదా ఫ‌లానా అభ్య‌ర్థికి ఓటు వేయ‌వ‌ద్దంటూ జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశించ‌లేర‌ట‌. ఎంపీపీ, జ‌డ్పీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స‌భ్యులు స్వ‌తంత్రుల కిందే లెక్క అని తెలుస్తోంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం జ‌న‌సేన రిక‌గ్నైజ్డ్ పార్టీ కాక‌పోవ‌డ‌మే. జ‌న‌సేన ఇప్ప‌టి వ‌ర‌కూ రిజిస్ట‌ర్డ్ పార్టీగా మాత్ర‌మే ఉంది. ఇంకా దానికి పూర్తి స్థాయి అవ‌స‌ర‌మైన గుర్తింపు లేదు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే ఆ పార్టీ కి హోల్ సేల్ గా గుర్తు కూడా లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో త‌మ పార్టీ త‌ర‌ఫున నెగ్గి ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల‌కు జ‌న‌సేన ఎలాంటి విప్ జారీ చేయ‌లేద‌ని, ఓటు హ‌క్కు విష‌యంలో వారిపై పార్టీ విప్ చెల్ల‌ద‌ని తెలుస్తోంది.

ఏపీలోని ప్ర‌ధాన పార్టీల‌కు ఈ విప్ అధికారం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, క‌మ్యూనిస్టు పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్.. వీట‌న్నింటికీ ఆ అవ‌కాశం ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీల‌కు పెద్ద‌గా స‌భ్యులు లేక‌పోయినా.. విప్ అయితే జారీ చేసుకోవ‌చ్చు! కానీ కొద్దో గొప్పో స‌భ్యులున్నా.. జ‌న‌సేన మాత్రం ఎవ్వ‌రినీ నియంత్రించేలా విప్ జారీ చేయ‌లేదు. దీంతో.. జ‌న‌సేన త‌ర‌ఫున నెగ్గిన ఎంపీటీసీలు ఇప్పుడు ఎవ‌రైనా త‌మ పార్టీ వాణికి వ్య‌తిరేకంగా వెళ్తారా? ఎంపీపీల ఎన్నిక‌లో అవ‌కాశం ఉన్న చోట వేరే రూటు చూసుకుంటారా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశంగా మారింది.