Begin typing your search above and press return to search.

సోము స్పీడుకు పవన్ బ్రేకులు వేసినట్లేనా

By:  Tupaki Desk   |   9 Dec 2020 4:30 PM GMT
సోము స్పీడుకు పవన్ బ్రేకులు వేసినట్లేనా
X
బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పీడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బ్రేకులు వేసినట్లేనా ? అవుననే అంటున్నారు పరిశీలకులు. అసలింతవరకు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు నోటీఫికేషన్ రాకముందే వీర్రాజు విపరీతమైన హడావుడి మొదలుపెట్టేశారు. ఓ విధంగా పవన్ పై మైండ్ గేమ్ మొదలు పెట్టేసినట్లే అనిపించింది. అయితే పవన్ కూడా అంతే స్ధాయిలో రివర్స్ రాజకీయం మొదలుపెట్టడంతో ఏమి చేయాలో అర్ధంకాక తన జోరును పూర్తిగా తగ్గించేశారట వీర్రాజు.

వైసీపీ ఎంపి బల్లి దుర్గా ప్రసాదరావు చనిపోవటంతో తిరుపతి లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. మార్చిలోగా జరుగుతుందని అనుకుంటున్న ఉపఎన్నికకు సుమారు రెండు నెలల క్రితమే వీర్రాజు హడావుడి మొదలుపెట్టేశారు. పార్టీలోని ముఖ్యనేతలందరినీ పిలిపించేసి మీటింగులు పెట్టించటం, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించటం, మీడియా సమావేశాల్లో హోరెత్తించటం చేసేశారు. బీజేపీ హడావుడి చూసి పవన్ అలర్టయ్యారు.

ఉపఎన్నికలో తమ పార్టీ తరపునే అభ్యర్ధి ఉంటారన్నట్లుగా పవన్ కూడా ప్రకటనలు ఇవ్వటం మొదలుపెట్టారు. దాంతో పోటీ విషయంలో రెండుపార్టీల మధ్య వివాదం మొదలైందనే ప్రచారం పెరిగిపోయింది. దాంతో వీర్రాజుకు ఓ విధంగా షాక్ కొట్టినట్లే అయ్యింది. అందుకనే అప్పటికప్పుడు తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తిరుపతి లోక్ సభ సీటుపై సైలెంట్ అయిపోయారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్ధి గురించి ఆలోచిస్తామంటు మీడియాకు చెప్పారు.

తిరుపతిలో పోటీ విషయంలో వీర్రాజు ఢిల్లీలోని అగ్రనేతలతో మాట్లాడారో లేదో తెలీదు. అయితే రాష్ట్రంలో మాత్రం తెగ హడావుడి చేసేశారు. పవన్ మాత్రం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా తమ అభ్యర్ధి విషయమై స్పష్టంగా చెప్పేశారు. దాంతో వీర్రాజుకన్నా పవనే కాస్త చురుగ్గా ఉన్నట్లు అర్ధమవుతోంది. అయితే బీజేపీని మాత్రం నమ్మేందుకు లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉందన్న అడ్వాంటేజ్ వల్లే మిత్రపక్షాలు లేకపోతే ప్రతిపక్షాలను లొంగదీసుకుంటోంది. మరి తిరుపతి లోక్ సభ పోటీ విషయంలో ఏమి చేస్తుందో చూడాల్సిందే.