Begin typing your search above and press return to search.

పవన్ లో మిస్ అయిన ఫైర్.. ఎందుకిలా?

By:  Tupaki Desk   |   10 Aug 2022 4:16 AM GMT
పవన్ లో మిస్ అయిన ఫైర్.. ఎందుకిలా?
X
ఉన్నదే చెబుతాడు. ఎదుటోడు ఎంత తోపు అన్నది అస్సలు పట్టించుకోడు. ఆ మాటకు వస్తే.. అనవసర మర్యాదలు.. గౌరవాల్ని ఇవ్వడు. తన కోసం.. తన ప్రయోజనం కోసం కాకుండా తన ప్రజల కోసం మాత్రమే మాట్లాడటం.. ఉన్నది ఉన్నట్లు చెప్పటం.. నిష్ఠూరాన్ని నిర్మోహమాటంగా చెప్పేయటం లాంటి లక్షణాల కలయికగా జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుపరిచితుడు.

రాజకీయ నేతలు ఎంతోమంది ఉన్నా.. వారందరికి భిన్నంగా ఆయన్ను చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే.. పవన్ మైండ్ సెట్ మిగిలిన రాజకీయ నేతలు కలలో కూడా ఆలోచించటానికి ఇష్టపడని తీరు.

ఏ పార్టీ అధినేత తాను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే.. డబ్బులు.. మద్యం.. బహుమానాలు ఇవ్వాల్సి ఉంటుందన్న విషయాన్ని పట్టించుకోకుండా.. అలాంటివి చేస్తే వచ్చే గెలుపు తనకు వద్దని.. పోటీ చేసిన రెండుచోట్ల ఓడి.. అవమానాన్ని మూటగట్టుకునేందుకు సిద్ధమే తప్పించి.. నమ్మిన విలువల్ని వదిలేసేందుకు ససేమిరా అనే తత్త్వం పవన్ కు మాత్రమే సొంతమని చెప్పాలి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి పవర్ ఫుల్ నేత అధికారంలో ఉన్న వేళలో.. పంచెలు ఊడదీసి కొడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేయగలిగిన దమ్ము.. ధైర్యం పవన్ కు మాత్రమే. అంతేనా.. తిరుగులేని అధికారంలో చేతిలో ఉండి.. యావత్ దేశంలో మరెవరూ విమర్శలు చేయటానికి ఇష్టపడని రోజుల్లో మోడీ సర్కారును ఉద్దేశించి.. ఏపీకి జరిగిన అన్యాయం గురించి గళం విప్పి.. పాచి లడ్డూలు అంటూ విభజన హామీల మీద కేంద్రం వైఖరిని నిలదీసిన వైనం చూసినప్పుడు.. ఎన్నాళ్లకు తెలుగు రాష్ట్రాల్లో నికార్సైన దమ్మున్న నేత ఒకడు వచ్చాడని సంతోషించినోళ్లు ఎంతోమంది.

అలాంటి పవన్ కు ఏమైందో తెలీని పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్నట్లు మాట్లాడటం మొదలైంది. అప్పుడప్పుడు మెరుపులు మెరిసినట్లుగా విరుచుకుపడటమే తప్పించి.. మిగిలిన సందర్భాల్లో మాత్రం వేలెత్తి చూపేందుకు వీల్లేని విధంగా మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని చెప్పొచ్చు.

దీని వల్ల జరిగే నష్టం ఏమంటే.. సూటిగా.. మొహమాటం అన్నది లేకుండా మాట్లాడే ఒకే ఒక్క నేత కూడా ఇప్పుడు లేనట్లే. మనిషి ఎదిగే కొద్దీ.. మెచ్యురిటీ పెరుగుతుందంటారు. పవన్ లో వచ్చిన మార్పు మెచ్యూరిటీనా? లేదంటే.. రాజీ పడటమా? అన్నదిప్పుడు ప్రశ్న. ఏమైనా.. ఫైర్ ఉన్న అధినేతగా పేరున్న పవన్ లో.. ఈ మధ్యలో అలాంటి తీరు తగ్గుతుందన్న మాట మాత్రం చెప్పక తప్పదు.