Begin typing your search above and press return to search.

గంటా సీటు మీద జనసేన జెండా... ?

By:  Tupaki Desk   |   26 Dec 2021 9:30 AM GMT
గంటా సీటు మీద జనసేన జెండా... ?
X
విశాఖ జిల్లాలో రాజకీయ హడావుడి మొదలైపోయింది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు టైమ్ ఉండగానే ఎవరి మటుకు వారు సర్దుకోవడం స్టార్ట్ చేసేశారు. విశాఖ సిటీ వరకూ తీసుకుంటే టీడీపీకి బలం ఉంది. 2019 ఎన్నికల్లో సైతం జగన్ సునామీలో ఇక్కడ నాలుగు సీట్లూ టీడీపీ గెలుచుకుని సత్తా చాటుకుంది. ఆ తరువాత విశాఖ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరిపోయారు. ఇక వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు సైలెంట్ అయ్యారు. నార్త్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే తాను గెలిచిన నియోజకవర్గాన్ని అలా వదిలేశారు. ఒక్క ఈస్ట్ లోనే టీడీపీ యాక్టివిటీ కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే విశాఖ సిటీలో జనసేనకు కూడా బలముంది. ముఖ్యంగా సౌత్, వెస్ట్, నార్త్ లో ఆ పార్టీ 2019 ఎన్నికల్లో చెప్పుకోదగిన ఓట్లు తెచ్చుకుంది. దాంతో ఇపుడు సిటీలో బలపడాలని జనసేన చూస్తోంది. ఆ పార్టీ ఆశావహులు అయితే తాము గట్టిగా ఇప్పటి నుంచే కష్టపడాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పొత్తుల సంగతి ఎలా ఉన్నా తాము ఇపుడే జెండా పాతేస్తే రాజకీయ బేరాలను ఆస్కారం ఉంటుందన్న ముందు చూపుతో అడుగులు వేస్తున్నారు.

అలా విశాఖ నార్త్ మీద ఒక మహిళా నేతతో సహా సిటీ జనసేన నేతలు కన్ను వేశారు. ఇక్కడ టీడీపీకి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గంటా ఉన్నా పట్టించుకోవడంలేదు, దాంతో డిఫ్యాక్టో ఎమ్మెల్యేగా గంటా మీద ఓడిన వైసీపీ నేత కేకే రాజే అన్నీతానై చేస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయనే వైసీపీ నుంచి పోటీ చేస్తారు అంటున్నారు. గంటా విషయానికి వస్తే ఆయన నార్త్ నుంచి మళ్ళీ పోటీకి దిగరు అన్న టాక్ ఉంది. 2019 ఎన్నికల్లో కనాకష్టంగా మూడు వేల ఓట్లతో గెలవడంతో పాటు పార్టీ ఓడి మాజీ మంత్రి కావడంతో ఆయన దాన్ని యాంటీసెంటిమెంట్ గా భావిస్తున్నారు అని చెబుతున్నారు.

దాంతో ఇక్కడ పొలిటికల్ గా మంచి స్కోప్ ఉందని జనసేన నేతలు అంచనా కడుతున్నారు. మరో వైపు చూస్తే నార్త్ నుంచి టీడీపీ, వైసీపీలలో ఉన్న అసంతృపి నేతలను కూడా జనసేన లాగేసే పని చేస్తోంది. ఇలా ఆపరేషన్ ఆకర్ష్ తో బాగా పుంజుకోవాలని చూస్తోంది. విశాఖ నార్త్ లో జనసేనకు ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ బలమైన కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారంతా జనసేనకు తమ సొంతం చేసుకున్నారు.

దాంతో సరైన క్యాండిడేట్ కనుక ఆ సామాజికవర్గం నుంచి పోటీకి దిగితే ధూం ధాం గా గెలుపు ఖాయమని జనసేన లెక్కలు వేసుకుంటోంది. మొత్తానికి ఈ పరిణామాలు అధికార వైసీపీలో కలవరం రేపుతున్నాయి. గంటా సైడ్ అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని భావిస్తున్న వైసీపీ నేతలకు జనసేన రాజకీయ హడావుడి చికాకుగా మారుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కానీ ఉంటే కచ్చితంగా ఇక్కడ నుంచి జనసేన జెండా ఎగరడం ఖాయమే అంటున్నారు. మొత్తానికి గంటా సీట్లో జనసేన జెండా ఈసారి కచ్చితంగా ఎగరేయాలన్న పట్టుదల అయితే ఆ పార్టీ క్యాడర్ లో గట్టిగా ఉంది.