Begin typing your search above and press return to search.

జనసేన టీడీపీ కలిసినా...వైసీపీ మళ్ళీ గెలవాలంటే...?

By:  Tupaki Desk   |   31 Oct 2022 3:30 PM GMT
జనసేన టీడీపీ కలిసినా...వైసీపీ మళ్ళీ గెలవాలంటే...?
X
ఏపీలో కూటమి దాదాపుగా ఖాయమనే అంటున్నారు. రాజకీయం మీద ఆ మాత్రం అవగాహన ఉన్న ఎవరికైనా ఇది కచ్చితంగా అర్ధమవుతుంది. వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు అంటే సంస్థాగతంగానే కాకుండా ఆర్ధికంగా రాజకీయంగా ఢీ కొట్టేంత బలం జనసేన ఇప్పటప్పట్లో పెంచుకోవడమూ కష్టమే అన్న విశ్లేషణ ఉంది.

మరో వైపు చూస్తే పవన్ కానీ నిన్నటికి నిన్న నాదెండ్ల మనోహర్ కానీ చెప్పిన దాని బట్టి చూస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమనే అంటున్నారు. అంటే పొత్తులు ఉంటాయి. అవి ఏ రూపంలో ఉంటాయి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏపీలో టీడీపీ జనసేన పొత్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎందుకంటే ఏ రకమైన అభ్యంతరాలు లేకుండా ఈ మధ్యనే విజయవాడ వేదికగా పవన్ బాబు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

ముందు ప్రజాస్వామ్య పరిరక్షణ అని ఇద్దరూ అంటున్నా చివరికి ఈ కద తేలేది పొత్తుల తీరం వద్దనే అని కూడా అంతా చెబుతున్న మాట. బీజేపీ విషయమే తేలాల్సి ఉంది. బీజేపీ ఈ కూటమిలో చేరితే చేరుతుందా లేదా అంటే వైసీపీ అంచనాల బట్టి చూస్తే అసలు చేరదనే అంటున్నారు. ఎందుకంటే ఢిల్లీలోని మోడీ అమిత్ షాలకు జగన్ మీద ఉన్నంత నమ్మకం చంద్రబాబు మీద లేదని అంటున్నారు. ఈ రోజున కేవలం మూడు ఎంపీ సీట్లు ఉండబట్టి బాబు అమరావతిలో ఉన్నారు కానీ ఆయనకే రెండంకెల సీట్లు వస్తే కేసీయార్ కంటే ఎక్కువ జోరు చేస్తారని, ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వస్తారని అంటున్నారు.

ఆ విధంగా జాతీయ రాజకీయాల్లో తన అవసరాలు, తన లెక్కలు అనుకూలతలు చూసుకునే చంద్రబాబు మద్దతు ఇస్తారని అంటున్నారు. అంటే ఏపీలో టీడీపీ గెలిస్తే కచ్చితంగా బీజేపీకే ఆ ఎంపీల మద్దతు ఉంటుందని బీజేపీ పెద్దలు గుండె మీద చేయి వేసుకుని చెప్పలేరనే అంటున్నారు. అదే జగన్ కి కాంగ్రెస్ తో ఉన్న బద్ధ విరోధం దృష్ట్యా ఆయన కచ్చితంగా ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వరని, అందుకే ఆయన ఎంపీలు గెలిస్తేనే అవి నేరుగా తమ ఖాతాలో పడతాయని బీజేపీ లెక్కలు వేస్తోందని అంటున్నారు.

ఆ విధంగా ఏపీలో వైసీపీ వ్యతిరేక కూటమి బలపడడానికి బీజేపీ నుంచి అయితే మద్దతు ఉండబోదు అని అంటున్నారు. ఆ విధంగా విశ్లేషణలు చూసుకున్నపుడు వైసీపీకి కొంతవరకూ బేఫికర్ గానే ఉంటోంది అని అంటున్నరు. ఇక పవన్ చంద్రబాబు కలయిక వల్ల టోటల్ కాపు ఓట్లు గుత్తమొత్తంగా ఆ కూటమికి పడతాయి అని ఎవరూ చెప్పడంలేదు. పవన్ జనసేన తరఫున కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని కానీ బరిలోకి దిగి తాను సీఎం క్యాండిడేట్ అంటే కాపుల రియాక్షన్ వేరేగా ఉంటుందని, చంద్రబాబుతో పొత్తు కూడి వస్తే కాపులలో వచ్చే స్పందన వేరేగా ఉంటుందని వైసీపీ లెక్కలు వేస్తోంది

ఆ విధంగా చూసుకుంటే కాపుల ఓట్లు బాగానే చీలి వైసీపీ ఒక మేరకు గణనీయంగా లాభపడుతుంది అని కూడా అంచనా కడుతున్నారు. ఇక ఏపీలో కాపులు కమ్మల మధ్య ఉన్న సామాజికపరమైన అంతరాలు, గత రాజకీయ పరిణామాలను చూసుకున్నా ఈ కూటమి వైపు కాపులు నూరు శాతం మొగ్గు చూపరనే అంటున్నారు. మరో వైపు చూస్త కాపులు ఒక వైపు ఉంటే బీసీలు మరో వైపు ఉంటారని, ఆ విధంగా బీసీల పార్టీగా ఉన్న టీడీపీకి అది ఇబ్బందికరమైన పొత్తు అవుతుందని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారుట.

ఇప్పటికే బీసీలను తమ పార్టీ వైపునకు తిప్పుకునే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. రానున్న రోజులలో దానికి మరింతగా ముమ్మరం చేస్తారని అంటున్నారు. అలా కనుక చూసుకుంటే ఇటు కాపులలో చీలిక రావడం, అటు బీసీలలో మార్పు రావడంతో తమకు రెండిందాల లాభం సమకూరి మరోమారు ఏపీలో వైసీపీ జెండాను ఎగరేయవచ్చు అన్న ధీమాతో వైసీపీ అధినాయకత్వం ఉంది అంటున్నారు. అందువల్ల జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకున్నా తమదే విజయం అని లెక్కలు వేసుకుంటోందిట. అయితే సీట్లు మాత్రం గతంతో పోలిస్తే కొంత తగ్గుతాయి కానీ మరోసారి అధికారానికి ఢోకా ఉండబోదు అని విశ్లేషించుకుంటోంది అని చెబుతున్నారు.

ఈ రకమైన అంచనాలు వేసుకున్న మీదటనే బీసీల ఆత్మీయ సభలతో వైసీపీ రంగంలోకి దిగింది. అలాగే వైసీపీ కాపు నేతల మీటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానున్న రోజులలో అటు బీసీల సభలు జిల్లాల స్థాయిలో నిర్వహిస్తూనే ఇటు కాపుల సమావేశాలు కూడా ఎక్కడికక్కడ నిర్వహించడం ద్వారా తమదైన సోషల్ ఇంజనీరింగ్ కి వైసీపీ తెర తీస్తోంది అని అంటున్నారు. మరి వైసీపీ లెక్కలు అంచనాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయన్నది చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.