Begin typing your search above and press return to search.

పవన్ ఆదేశం బేఖాతర్.. జనసేన సొంత అజెండా

By:  Tupaki Desk   |   20 March 2020 3:30 PM GMT
పవన్ ఆదేశం బేఖాతర్.. జనసేన సొంత అజెండా
X
మొదటి నుంచి జనసేన పాత్ర రాజకీయాల్లో అధ్వానంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నుంచి ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీ అధినేత ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు.. ఎందుకు తీసుకుంటాడో తెలియదు. కానీ ఆయన ఒక్కరోజు ఒక తీరున ఉండని నాయకుడి తో జనసేన శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గందరగోళంలో మునిగారు. ఈ సమయంలోనే హఠాత్తుగా బీజేపీ తో పొత్తు అని అది స్థానిక సంస్థల్లో బీజేపీ తో కలిసి పని చేస్తామని జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ ప్రకటించాడు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని ఎవరూ గౌరవించడం లేదు. నాయకుడి నిర్ణయాన్ని పక్కకు పెట్టి జనసేన నాయకులు తమకు అనుకూలమైన వారితో జత కడుతుండడం గమనార్హం.

వాస్తవంగా బీజేపీ తో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ విధంగా బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని భావించగా క్షేత్రస్థాయిలో పవన్ కల్యాణ్ కు షాకిచ్చేలా పరిణామాలు జరుగుతున్నాయి. స్థానిక జనసేన నాయకులు అక్కడి పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీని కాదని ముఖ్యంగా టీడీపీ తో కూడా కలిసి పని చేస్తున్నారు. అక్కడక్కడ అధికార పార్టీ వైఎస్సార్సీపీ తో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కనిపిస్తోంది. బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కనిపించడం లేదు. ఆ పొత్తు వికటించి టీడీపీ తో జతకట్టారు. జనసేన నాయకులు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీతో చేతులు కలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా అదే మాదిరి రాజకీయం సాగుతోంది.

అయితే విజయవాడ నగరపాలక సంస్థలో 40 వార్డుల్లో జనసేన, 24 వార్డుల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకోగా అది అమలుకాలేదు. ఎవరికి బలం ఉన్నచోట వారు వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుని నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ జనసేన కొత్త పొత్తులు పెట్టుకుంది. కొన్ని చోట్ల జనసేన, టీడీపీ నేతలు ఎంపీటీసీని ఒకరు, సర్పంచ్ పదవిని మరొకరు పంచుకునేలా రాజకీయం నడిపారు. మరికొన్ని ప్రాంతాల్లో మండలస్థాయిలో కుదిరిన పొత్తులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో మండల అధ్యక్ష పదవిని రెండున్నరేళ్ల పాటు మీరు.. ఆ మిగతా కాలం మేం అని పంచుకుని ఎన్నికల్లో కలిసి పని చేశారంట. ఈ విధంగా టీడీపీ, జనసేన నాయకులు గ్రామస్థాయిల్లో పొత్తులు కుదుర్చుకున్నారు.

అయితే పైకి పొత్తు మాత్రం బీజేపీ తో ఉండగా వాస్తవంగా మాత్రం టీడీపీ తో కొనసాగుతోంది. ఇది పలుచోట్ల బహిర్గతమవుతోంది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ శ్రేణులు భిన్నంగా ఉండడం తో పవన్ కల్యాణ్ కు చెప్పగా ఆయన పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. గతంలో ఉన్నట్టు టీడీపీ, జనసేన మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అయితే దీనిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం చూసీచూడకుండా వదిలేస్తున్నారు. ఎవరి తో కలిసినా తమకు పదవులు వస్తే చాలనే వైఖరిలో వారు ఉన్నారు.