Begin typing your search above and press return to search.

పబ్లిక్ మీటింగ్ లో వైసీపీ కండువా వేసుకున్న జనసేన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   5 Aug 2021 2:30 PM GMT
పబ్లిక్ మీటింగ్ లో వైసీపీ కండువా వేసుకున్న జనసేన ఎమ్మెల్యే
X
జనసేన ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎప్పుడూ ఆ పార్టీ జెండాను, ఆ పార్టీ అధినేత పవన్ తో కలవని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తాజాగా ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత వైసీపీ కండువాను అనధికారికంగా కప్పుకున్నాడు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ కాకుండా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకనే. తాజాగా మామిడికుదురు మండలంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో వైసీపీ కండువాను ధరించారు. అంతటితో ఆగకుండా రాపాక మీటింగ్ లో కొత్తగా చేరిన వారికి వైసీపీ కండువాలను కప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టికెట్ పై గెలిచినప్పటి నుంచి రాపాక అన్ని సమయాల్లో వైఎస్ జగన్ ను పొగుడుతూనే ఉన్నాడు. రాపాక సొంత పార్టీని ధిక్కరించే చర్యలు జనసేన కార్యకర్తలను , పార్టీ అగ్రనేతలు పవన్ కళ్యాణ్,నాదెండ్ల మనోహర్ ను కలవరపెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాపాకను నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు వెలివేశారు. మాలికిపురంలో బ్యానర్లు కట్టి ఈ ఏడాది మార్చిలో జరిగిన పార్టీ సమావేశానికి రావద్దని కోరారు. అదప్పుడు వైరల్ అయ్యింది.

ఇప్పటికైనా రాపాక మారి జగన్ అనుకూల ప్రకటనలు నిలిపివేయాలని. బదులుగా జిల్లాలో జనసేనను బలోపేతం చేయాడానికి పని చేయాలని రాజోల్ ఎమ్మెల్యేను నాదెండ్ల మనోహర్ అభ్యర్థించాడు.

అయితే జనసేనలో తనకు భవిష్యత్తు లేదని రాపాక అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ కండువాను ధరించి అతడు తాజాగా షాకిచ్చాడు. బయటపడ్డాడు.

ఇప్పటికే రాపాక తన కుమారుడిని సంవత్సరంన్నర క్రితం వైసీపీలో చేర్చుకున్నాడు. ఆయన ఇప్పటికీ జనసేన సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. అతడి చర్యలు జనసేన క్యాడర్ లో , పార్టీలో తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నప్పటికీ రాపాకపై వైసీపీలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది.