Begin typing your search above and press return to search.

జనసైనిక్స్ ట్యూనప్ అయినట్లే...వైసీపీ పప్పులు ఉడవవ్..!

By:  Tupaki Desk   |   14 Jan 2023 5:30 PM GMT
జనసైనిక్స్ ట్యూనప్ అయినట్లే...వైసీపీ పప్పులు ఉడవవ్..!
X
అక్కడ ఉన్నది జనసైనికులు. అంతకంటే ముందు వారు పవన్ వీరాభిమానులు. వెండితెర మీద రియల్ గా బయటా పవన్ని చూసి లక్షలాది మంది ఆయనకు జై కొడుతూ వస్తున్నారు. వారే పవన్ పార్టీ స్టార్ట్ చేయగానే చేరిపోయారు. వారే జనసైనికులు. ఒక విధంగా చెప్పాలీ అంటే వారే పార్టీకి మూల నిధి, అసలైన పెట్టుబడి. అది చెక్కుచెదరదు.

పవన్ ఏమి చెబితే వారికి అది వేదం. మరి అలాంటి జనసైనికుల విషయంలో అనవసరమైన హితబోధలు చేస్తూ వైసీపీ నేతలు మంత్రులు తెగ ఆయాసపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్ అని ఆయన జనసైనిక్స్ ని అందరినీ తీసుకెళ్ళి తెలుగుదేశానికి అమ్మేస్తాడు అని అంటున్నారు. వారిని హెచ్చరిస్తున్నారు. మీరు మారండి, తేరుకోండి అని అంటున్నారు.

కానీ ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి సభ చూశాక అయినా వైసీపీ నేతలకు కనువిప్పు కలగాలి. ఆ సభ ముప్పయి ఎకరాలకు పైగా సువిశాల స్థలంలో జరిగింది. ఆ సభ నిండా జనాలే బయట జనాలే. నేల ఈనిందా అని అప్పట్లో అన్నగారు అన్నట్లుగా పవన్ సభకు జనాలే జనాలు కనిపించారు. ఒక విధంగా జన సునామీ అక్కడ కనిపించింది

ఇక పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడినా వారు ఉర్రూతలూగిపోయారు. పవన్ కి భారీ స్పందన కనిపించింది. ఆయన ఒంటరి పోరు అన్నా లేక పొత్తులు అన్నా సైనిక్స్ సై అన్నారు తప్ప నో అనలేదు. అదే వారికి పవన్ పట్ల ఉన్న భక్తి. వారు నమ్మింది ఎవరినో కాదు పవన్ని. ఆయన తమ నాయకుడు. ఆయన తప్పుడు నిర్ణయం తీసుకోడు అని వారు భావిస్తారు.

అందుకే వారు వరసబెట్టి మంత్రుల మీద రివర్స్ అటాక్ చేస్తున్నారు. పైగా పొత్తులు కుదిరితే వైసీపీ పని అయిపోతుందని భయం తప్ప మరేమీ కాదని సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో పవన్ ఒక నిర్ణయాత్మకమైన శక్తి అని వారు అంటున్నారు. జనసేన లేని రాజకీయం ఏపీలో లేదని కూడా బల్లగుద్దుతున్నారు. భయంతోనే వైసీపీ మంత్రుల నుంచి కీలక నేతల దాకా పవన్ మీద పడిపోతున్నారు అని ఫైర్ అవుతున్నారు.

ఇక ఈ విషయంలో వైసీపీ మంత్రులు జనసైనికులకు హిత బోధలు మానకుంటే ఇంకా వారు అగ్రెస్సివ్ గా మారుతారు. మరింతగా పట్టుదలకు పోతారు. ఇక్కడ వైసీపీ మరచిపోతున్న లాజిక్ ఒకటి ఉంది. పవన్ కి జనసైనిక్స్ మధ్య ఉన్న అవ్యాజమైన బంధాన్ని ఆ పార్టీ అసలు గమనంలోకి తీసుకోవడంలేదు. పవన్ వేరు క్యాడర్ వేరు అని అనుకోవడమే వైసీపీ చేస్తున్న అతి పెద్ద తప్పు.

నిజానికి అవిభాజ్యమైన బంధం వారిది. దాన్ని మామూలు ట్రెడిషనల్ పాలిటిక్స్ లుక్స్ తో చూస్తే అర్ధం కాదు. అందుకే పవన్ ఫ్యాన్స్ తోనూ జనసైనికుల తోనూ ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు. మిగిలిన వారి మాదిరిగా వారు చూడరు. పవన్ విషయాన్ని తమ సొంతానికి తీసుకుంటారు. వైసీపీ గత నాలుగేళ్లుగా పవన్ని ఎదుర్కొనే విషయంలో ఫెయిల్ అయింది అనడానికి ఆ పార్టీ అనుసరిస్తున్న ఇలాంటి రాజకీయ విధానాలే కారణం అని అంటున్నారు.

పవన్ని విమర్శించి జనసైనికుల మద్దతు పొందలేరు. అలాగే పవన్ని ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తూ మీ కోసమే అని చెబితే జనసైనిక్స్ అసలు పట్టించుకోరు. పవన్ పార్టీకి ఇలా ప్రత్యేకమైన క్యాడర్ ఉంది కాబట్టే ఆయన సులువుగా లక్షలాది మంది జనాలతో మీటింగ్స్ పెడుతున్నారు. ఇక్కడ వైసీపీ చేసే విమర్శలు కానీ పవన్ని అటాక్ చేసే విధానం కానీ జనసైనికుల సంకల్పాన్ని మరింతగా పెంచేస్తోంది.

నిజానికి సీఎంగా పవన్ ఉండాలనే వారికీ ఉంది. కానీ వారిని ఆలోచించుకోనీయకుండా చేస్తూ జనసేనానిని వరసబెట్టి మంత్రులు అంతా విమర్శలు చేస్తూ దారుణంగా దూషణలు చేయడం వల్ల వారు పూర్తిగా యాంటీ వైసీపీ పంధాకు వెళ్లిపోయారు. బహుశా పవన్ కళ్యాణ్ ఎన్నికల స్ట్రాటజీ అదీ అని అనుకోవచ్చేమో. కానీ ఆయన వ్యూహాల కంటే వైసీపీ వారి విఫల రాజకీయమే కరడు కట్టిన యాంటీ వైసీపీ సైన్యాన్ని తయారుచేసుకుంది అని అంటున్నారు.

ఇప్పటికైనా పవన్ మీటింగ్స్ ని ఆయన విమర్శలను లైట్ గా తీసుకోకపోతే అతి పెద్ద సెక్షన్ నుంచే వైసీపీకి తీవ్ర వ్యతిరేకత పెరిగి అది రేపటి ఎన్నికల్లో ఇబ్బంది కరం అవుతుంది అని అంటున్నారు. ఇక్కడ ఒక మాట ఎపుడూ పాత చింతకాయ పచ్చడి పాలిటిక్స్ పనిచేయదు. ఇక పవన్ లాంటి వెండి తెర దేవుడు పార్టీ పెట్టి జనమలోకి వచ్చిన తరువాత ఆయన ఫ్యాన్ బేస్ ని ఫాలోయింగ్ ని చూసి అయినా తీరు వ్యూహాలు మార్చుకోకపోతే ఇబ్బంది పడేది వైసీపీయే. చిత్రమేంటి అంటే ఈ సత్యం తెలుగుదేశానికి బాగా తెలుసు. వైసీపీకి తెలియదు అనే కంటే తెలిసి కూడా లైట్ తీసుకుంటున్నారు అనుకుంటే బెటరేమో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.