Begin typing your search above and press return to search.

పోరాటం తేలలేదు గానీ.. ఆహార్యం అదిరింది

By:  Tupaki Desk   |   22 Feb 2018 12:43 PM GMT
పోరాటం తేలలేదు గానీ.. ఆహార్యం అదిరింది
X
పవన్ కల్యాణ్ ఇంకా నిజాలను తేల్చే అధ్యయనంలోనే నిమగ్నం అయి ఉన్నారా.. ఆ పర్వం పూర్తిచేసి.. ఎలాంటి పోరాటాన్ని సాగించాలో డిజైన్ చేసుకునే పనిలో ఉన్నారా? ఇంతకూ ఆయన పోరాటం ఎజెండా ఏమిటి? ఏ అంశం మీద కీలకంగా పోరాబోతున్నారు లేదా ప్రయత్నించబోతున్నారు? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఎవరికి వ్యతిరేకంగా - ఎవరితో కలిసి ఆయన ప్రస్థానం ఉండబోతోంది?

ఇప్పుడు చెప్పుకున్నవన్నీ చాలా చాలా కీలకమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి కూడా పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వలేదు. ఆయన కమిటీ వేసి కసరత్తు చేస్తున్నారు. నిజాలు తేలుస్తా అంటున్నారు. అలా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా విషయాల్లో ఆయన ప్రజల్లో సందిగ్ధతను అలాగే విడిచిపెట్టారు.

ప్రధానంగా ప్రత్యేకహోదా అంశం! ఈ అంశానికి ఆయన కట్టుబడి ఉన్నారనే నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే.. తాను హోదా కోసం పోరాటం ప్రారంభించిన తర్వాత.. హోదా సాధ్యం కాదు దాన్నిమించినదే ప్యాకేజీ అని చంద్రబాబు నాయుడు తనకు చెప్పారని.. ఆ విషయాలు నమ్మిన తర్వాతనే తాను దాని గురించి మౌనం వహించానని ఆయన తాజా ఎపిసోడ్ తొలిరోజుల్లో చెప్పారు. ఆ తర్వాత నిజనిర్ధారణ కమిటీ పనిచేసినా.. హోదా డిమాండ్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ప్యాకేజీ మంచి చెడుల గురించి కూడా పవన్ కల్యాణ్ ఇంకా పెదవి విప్పలేదు. విభజన హమీల్లో ఎవరు ఏం చేశారు అనేది తేలుస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు.

ఒక వేళ ఎజెండా సెట్ అయినా కూడా జనసేన పార్టీ పోరాటాన్ని లీడ్ చేస్తుందా.. లేదా అవగాహనకు, అధ్యయనానికి మాత్రమే పరిమితం అవుతుందా? అనే సంగతి కూడా పవన్ చెప్పలేదు. జన జీవితాల్ని ఇబ్బందిపెట్టే ఆందోళన కార్యక్రమాలు నాకు ఇష్టం లేదు అని ఆయన గతంలో అన్నారు. మరి పోరుబాట ఉంటుందో లేదో గానీ.. మొత్తానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున యూత్ కోసం టీషర్టులు - టోపీలు తయారవుతున్నాయని సమాచారం.

ఈ టీషర్టులమీద ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని ముద్రిస్తున్నారట. వీటిని రాష్ట్రవ్యాప్తంగా కళాశాల యూత్ కు పంచేందుకు కూడా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోందిట. మొత్తానికి పవన్ కల్యాణ్ ఇంకా తన పోరాటాన్ని తేల్చలేదు గానీ.. ఆ పోరాటానికి ఆయన ప్లాన్ చేసిన ఆహార్యం గెటప్ టీషర్టులు - టోపీలు మాత్రం అదిరాయని అంతా అనుకుంటున్నారు.