Begin typing your search above and press return to search.

గెల‌వ‌గ‌లిగే చోట జ‌న‌సేన‌కు అభ్య‌ర్థి ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   22 July 2022 11:30 PM GMT
గెల‌వ‌గ‌లిగే చోట జ‌న‌సేన‌కు అభ్య‌ర్థి ఎక్క‌డ‌?
X
అవ‌నిగడ్డ‌.. కాపు సామాజిక‌వ‌ర్గం అత్యంత బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. కృష్ణా జిల్లాలో దివిసీమ‌లో కీల‌క కేంద్రం.. అవ‌నిగ‌డ్డ‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓటర్ల‌లో 75 శాతం మంది కాపు ఓట‌ర్లే. అందుకే ఎన్నో ద‌శాబ్దాల నుంచి ప్ర‌ధాన పార్టీల త‌ర‌ఫున ఇక్క‌డ కాపు సామాజిక‌వ‌ర్గానికే చెందిన‌వారే పోటీ చేస్తున్నారు. అలాగే జ‌న‌సేన పార్టీ కాస్త దృష్టి పెడితే గెల‌వ‌గ‌లిగే నియోజ‌క‌వ‌ర్గంగా కూడా దీన్ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లోనూ అవ‌నిగ‌డ్డ నుంచి జ‌న‌సేన పార్టీ గెలుపు ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రిగింది. 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సింహాద్రి ర‌మేష్, టీడీపీ నుంచి మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్, జ‌న‌సేన పార్టీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు. వీరు ముగ్గురూ కాపు సామాజిక‌వ‌ర్గానికే చెందిన‌వారే. వీరిలో సింహాద్రి ర‌మేష్ గెలుపొందారు. జ‌నసేన పార్టీ అభ్య‌ర్థికి దాదాపు 29 వేల ఓట్లు పోల‌య్యాయి. జ‌న‌సేన అభ్య‌ర్థి శ్రీనివాస‌రావు 16 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

అయితే ముత్తంశెట్టి స్థానిక అభ్య‌ర్థి కాదు. ఆయ‌న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడిన నాటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేద‌ని చెబుతున్నారు. అప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్చార్జ్ లేక ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌తోనే నెట్టుకొస్తున్నార‌ని అంటున్నారు. జ‌న‌సేన పార్టీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌నిగ‌డ్డ ఒక‌టిగా ఉన్న నేప‌థ్యంలో అభ్య‌ర్థి లేక‌పోవ‌డంతో ద్వితీయ శ్రేణి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపం ఏర్పడుతోంద‌ని అంటున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ ప‌ద‌వికి ద్వితీయ శ్రేణి నాయ‌కులే మ‌ధ్య పోటీ ఉంద‌ని చెబుతున్నారు. జ‌న‌సైనికులు భారీగానే ఉన్నా వారిని న‌డిపించే నాయ‌కుడు లేడ‌ని పేర్కొంటున్నారు. మ‌రోవైపు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండి రామ‌కృష్ణ ఇటీవ‌ల అవ‌నిగ‌డ్డ‌లో జ‌న‌సేన పార్టీ కార్యాల‌యాన్ని తెరిచారు.

గత ఎన్నికల్లో స్థానికేతర అభ్యర్ధి.. వైసీపీ గాలి.. తదితర కారణాలతో జనసేన మూడో స్థానానికి పరిమితం అయినా.. ఈ సారి ఖచ్చితంగా సీటు కొట్టేస్తామన్న నమ్మకం అక్కడి నాయకత్వంలో ఉంది. అయితే ఆ గెలుపుకు అవసరమైన వ్యూహాలను జనసేన ఎంత వరకు అమలు చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంద‌ని అంటున్నారు. ఇద్దరు రాజకీయ ఉద్దండులైన ప్రత్యర్ధులను ఢీ కొట్టే స్థాయి నాయకులు జనసేనకు ఉన్నారా అన్నదే సమస్యగా మారింద‌ని పేర్కొంటున్నారు.

నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలంగా కాచుకునే ఇంఛార్జ్ లేకపోవడం.. ఉన్న ద్వితియశ్రేణి నాయకత్వం అంతా ఆ పదవి కోసం పోటీ పడే పనిలో బిజీగా ఉండి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని మర్చిపోవడం వంటి అంశాలు ఈ సారి జనసేన విజయంపై ప్రభావితం చూపబోతున్నాయని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా పార్టీ బ‌లంగా ఉన్న‌చోట గ‌ట్టి అభ్య‌ర్థుల‌ను జ‌న‌సేనాని ప‌వ‌న్ నిల‌బెట్టాల్సి ఉంద‌ని చెబుతున్నారు. బలమైన ప్రత్యర్ధుల్ని బలమైన ఓటు బ్యాంకుతో కొట్టగల సత్తా ఉన్నా.. దాన్ని ముందుకు తీసుకువెళ్లే స్థాయి నాయకత్వం అవనిగడ్డలో జనసేనకు లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఆ నాయకత్వ లోపాన్ని జనసేన ఎలా అధిమిస్తుందో వేచి చూడాలి మరి.