Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లో జ‌న‌సేనాని 'ర‌థ‌యాత్ర'

By:  Tupaki Desk   |   15 July 2017 9:51 AM GMT
త్వ‌ర‌లో జ‌న‌సేనాని ర‌థ‌యాత్ర
X
రాబోయే ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌న్నాహాలు ప్రారంభించిన‌ట్లు వినికిడి. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. కొంత కాలంగా షూటింగ్ ప‌నుల్లో బిజీగా ఉన్న ప‌వ‌న్ సెప్టెంబ‌ర్ 2 న త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. వైఎస్ ఆర్‌ - చంద్ర‌బాబు చేప‌ట్టిన పాద‌యాత్ర త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసేందుకు కార్య‌చ‌ర‌ణ రూపొందించిన‌ట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే! అయితే ప్ర‌చారం దిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించలేదు. తాజాగా, జ‌న‌సేనాని రాబోయే ఎన్నిక‌ల ప్ర‌చారంలో తొలి అడుగు వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ త‌న పుట్టిన‌రోజైన సెప్టెంబ‌ర్ 2న అనంత‌పురం నుంచి ర‌థయాత్రను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కేవలం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కే ప‌రిమితం కాకుండా, తెలంగాణ లోనూ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ప్ర‌త్య‌క్షంగా వెళ్లి వారి స‌మ‌స్య‌ల గురించి తెలుసుకుంటాన‌ని జ‌న‌సేన స‌భ‌ల్లో ప‌వ‌న్ చాలాసార్లు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఆ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఈ ర‌థ‌యాత్ర చేప‌ట్టాల‌ని ప్లాన్ చేసిన‌ట్టు ప‌వ‌న్ స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ర‌థ‌యాత్రలో ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న అంశంపైనే ప‌వ‌న్ ఎక్కువ‌గా దృష్టిసారించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర అక్టోబ‌ర్ 27 నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ లెక్క‌న ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని జ‌న‌సేన పార్టీ ప్రారంభించిన‌ట్ల‌వుతుంది.