Begin typing your search above and press return to search.

జ‌న‌సేన బీజేపీ సేన‌గా మారుతోంద‌ట‌

By:  Tupaki Desk   |   3 May 2018 2:30 PM GMT
జ‌న‌సేన బీజేపీ సేన‌గా మారుతోంద‌ట‌
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇర‌కాటంలో పడే సంద‌ర్భం ఇది. ఇప్ప‌టికే బీజేపీకి ద‌గ్గర‌య్యార‌నే నిందారోప‌ణ‌ల‌ను ఎదుర్కుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా నిర్ణ‌యంతో ఈ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఆ పార్టీ నేత‌ల గురించి రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ నిజ‌మైతే...ప‌వర్ స్టార్ పార్టీ కాస్త క‌మ‌ళం పార్టీ `బీ` టీంగా మారిపోయిన‌ట్లే. ఇంత‌కీ ఎందుకు ఇంత చ‌ర్చ జ‌రుగుతోందంటే...జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ స‌ల‌హాదారుగా తాజాగా దేవ్ అనే వ్య‌క్తిని నియ‌మించ‌డం గురించి. ఆయ‌న బీజేపీ మ‌ద్ద‌తుదారుడ‌నే వార్త‌లు వెలుగులోకి రావ‌డం వ‌ల్ల‌.

రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీని ఏపీలోని అన్నిస్థానాల్లోనూ బ‌రిలో దింపుతామ‌ని ఇందుకోసం పార్టీ బ‌లోపేతం చేసేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా పార్టీ స‌ల‌హాలు సూచన‌లు అందించేందుకు దేవ్ అనే వ్య‌క్తిని రాజ‌కీయ స‌ల‌హాదారుగా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఈ వ్య‌క్తి ఎవ‌ర‌నే ప‌లువురు ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు - కొంద‌రు నెటిజ‌న్లు కూడా ఆరాతీయ‌గా ఆయ‌న బీజేపీ ఫాలోవ‌ర్ అని తేలింది. గ‌తంలో బీజేపీ అధ్య‌క్షుడు జి.కిష‌న్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ఫ్లెక్సీలు కూడా వేసిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో బీజేపీ వ్య‌క్తిని ప‌వ‌న్ ఇంత‌గా ఎందుకు నెత్తిన పెట్టుకున్నార‌నే సందేహం మొద‌లైంది. అదే స‌మ‌యంలో ప‌వ‌న్‌ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యార‌నే కామెంట్లు వినిపించాయి. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాష్ట్రంలోని పార్టీల‌న్నీ...కేంద్రంలో గ‌ద్దెనెక్కిన బీజేపీని విమ‌ర్శిస్తుండ‌గా...ప‌వ‌న్ మాత్రం అలాంటి కామెంట్లేవి చేయ‌డం లేద‌ని...బీజేపీని ఒక్క‌మాట కూడా అన‌డం లేద‌నే అప‌ప్ర‌ద ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఏకంగా బీజేపీ ఫాలోవ‌ర్‌నే త‌న పార్టీ స‌ల‌హాదారుగా ప్ర‌క‌టించ‌డంతో...ఆయ‌న క‌మ‌ళ‌నాథుల ఆప్తుడ‌నే ప్ర‌చారం జోరందుకుంది.

మ‌రోవైపు పార్టీకి చెందిన అధికార ప్ర‌తినిధి అద్దేప‌ల్లి శ్రీ‌ధ‌ర్ సైతం బీజేపీ నుంచి వ‌చ్చిన నాయ‌కుడే కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న పార్టీలో చేరిన వెంట‌నే కీల‌క‌మైన అధికార ప్ర‌తినిధి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం, ఆయ‌న‌తోనే కీల‌క‌మైన టీవీ డిబేట్ల‌న్నీ సాగిస్తున్న నేప‌థ్యంలో బీజేపీ మాజీ నాయ‌కుడికి ఇంత ప్రాధాన్యం ఎందుక‌నే చ‌ర్చ మొద‌లైంది. జ‌నసేన కోసం ముందు నుంచి క‌ష్ట‌ప‌డిన వారికంటే కూడా అద్దేప‌ల్లికి అంద‌లం క‌ట్ట‌బెట్ట‌డంతో ప‌వ‌న్ బీజేపీ సానుభూతిప‌రుడ‌నే భావ‌న నెల‌కొంది. తాజాగా పార్టీ రాజ‌కీయ వ్యూహక‌ర్తగా దేవ్ నియామ‌కంతో ప‌వ‌న్ జ‌న‌సేన కాస్త బీజేపీ సేన‌గా మారిపోయింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.