Begin typing your search above and press return to search.

జ‌న‌సేన దూకుడు.. ప‌వ‌న్ ప‌ట్టించుకుంటే గ్రాఫ్ మ‌రో రేంజ్‌లోనే..!

By:  Tupaki Desk   |   18 Nov 2021 5:30 AM GMT
జ‌న‌సేన దూకుడు.. ప‌వ‌న్ ప‌ట్టించుకుంటే గ్రాఫ్ మ‌రో రేంజ్‌లోనే..!
X
జ‌న‌సేన ప‌రిస్థితి ఎలా ఉంది? ప‌వ‌న్ లేకున్నా.. పార్టీ ప‌రిస్థితి దూకుడు చూపుతోందే! ఇప్పుడు ఇవే మాట‌లు వినిపిస్తున్నాయి. తాజాగా.. జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్ర‌మేయం పెద్ద‌గా లేక‌పోయినా.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఆ పార్టీ నేత‌ల దూకుడు ప్ర‌త్య‌క్షంగా క‌నిపించింది. ఆకివీడులో మూడు వార్డుల‌ను జ‌న‌సేన నేత‌లు కైవ‌సం చేసుకున్నారు. అదేవిధంగా తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ‌లో జ‌రిగిన ఒక వార్డులోనూ.. ఫ‌ర్వాలేద‌నిపించేలా స‌త్తా చూపించారు. ఆకివీడులో మాత్రం మూడు చోట్ల విజ‌యం సాధించారు. మిగిలిన చోట్ల ఓడిపోయారు. అయితే.. ఇక్క‌డ చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం ఏంటంటే.. జ‌న‌సేన దూకుడు బాగుంద‌నే..!

విచిత్రం ఏంటంటే ఆకివీడులో టీడీపీతో పొత్తు పెట్టుకుని జ‌న‌సేన ఐదు వార్డుల్లో పోటీ చేస్తే మూడు చోట్ల గెలిచింది. టీడీపీ 15 చోట్ల పోటీ చేస్తే కేవ‌లం 4 చోట్లే గెలిచింది. ప్ర‌స్తుతం.. రాష్ట్రంలో మ‌రో పార్టీ ప్ర‌త్యామ్నాయం లేకుండా పోయింది. అంటే.. వైసీపీని మిన‌హా.. ఇత‌ర ప‌క్షాల‌ను గ‌మ‌నిస్తే.. ఒక్క టీడీపీ ఉంది. దీనిని కూడా కాద‌నుకుంటే.. ప్ర‌జ‌లు ఓట్లేసేందుకు.. మ‌రో పార్టీ అంటూ లేకుండా పోయింది. ఇది పెద్ద వ్యూహం. అధికారంలో ఉన్న పార్టీలు అనుస‌రించే విధానం కూడా! ప్ర‌తిప‌క్షాల‌ను లేకుండా చేయాల‌నేది ఏ అధికార పార్టీ అయినా.. చేసే ప‌నే. అయితే.. ఇప్పుడు ఆ గ్యాప్‌.. జ‌న‌సేన రూపంలో ప్ర‌జ‌ల‌కు కొంత మేర‌కు క‌నిపిస్తోంది.

అయితే.. ఈ పార్టీని ముందుండి న‌డిపించే క్షేత్ర‌స్థాయి నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. కొంద‌రు ప‌ట్టించుకుని.. వ్య‌క్తిగ‌తంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న చోట్ల .. ఖ‌చ్చితంగా పార్టీ గెలుస్తున్న ప‌రిణామాలు ఉన్నాయి. గ‌తంలోనూ ఇదే జ‌రిగింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఏర్ప‌డింది. పార్టీ నుంచి కీల‌క నేత‌లు పెద్ద‌గా రియాక్ట్ కాక‌పోయిన‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ముందుకు క‌దిలారు. వారి ఉన్న ఆర్థిక ప‌రిస్థితిలోనే.. పార్టీని న‌డిపించారు. దీనికి సామాజిక వ‌ర్గాలు కూడా క‌లిసివ‌చ్చాయి.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికైనా ప‌ట్టించుకుని పార్టీని ముందుకు న‌డిపిస్తే.. పుంజుకునేందుకే కాదు.. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా కూడా పార్టీ అవ‌త‌రించే అవ‌కాశం ఉంది. టీడీపీ వ్య‌తిరేక‌.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును జ‌న‌సేన కైవ‌సం చేసుకునే అవ‌కాశం స్ప‌ష్టం గా క‌నిపిస్తోంది అయితే.. దీనిని అందిపుచ్చుకునే వ్యూహ‌మే పార్టీలో కొర‌వ‌డుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను క‌దిలించ‌డం వంటి కీల‌క‌మైన చ‌ర్య‌ల దిశ‌గా అడుగులు వేస్తే.. జ‌న‌సేన గెలుపు ఎంతో దూరంలో లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.