Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్‌- ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన రెడీ!

By:  Tupaki Desk   |   29 April 2018 1:29 PM GMT
అఫిషియ‌ల్‌- ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన రెడీ!
X
దేశ చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ లేని కొత్త విధానంలో స్థాపించ‌బ‌డిన పార్టీగా జ‌న సేన మాత్ర‌మే నిలుస్తుంద‌ని చెప్పొచ్చు. పార్టీ పెట్టిన నాలుగు సంవ‌త్స‌రాల వ‌ర‌కు పార్టీకి కార్య‌క‌ర్త నుంచి లీడ‌ర్ వ‌ర‌కు అన్నీ ఒకే వ్య‌క్తి. చివ‌ర‌కు పార్టీలో స‌భ్య‌త్వం ఇవ్వ‌డానికి కూడా ఆ పార్టీకి నాలుగేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. ఎట్ట‌కేలకు ఇటీవ‌లే పార్టీ స‌భ‌త్వ న‌మోదు ఫోన్ ద్వారా స‌ర‌ళంగా ప్రారంభించిన ప‌వ‌న్ ఇప్ప‌టికీ పార్టీకి పూర్తి స్థాయి రూపును ఇవ్వ‌లేదు. ఇంక పార్టీయే నిర్మాణ ద‌శ‌లో ఉంది. అయినప్ప‌టికీ ఈరోజు ఆ పార్టీ ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

జ‌న‌సేన పార్టీ 2019 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేయ‌నున్న‌ట్లు పార్టీ తీర్మానించిందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ నేమూరి శంకర్‌ గౌడ్‌ ఈ రోజు తమ పార్టీ తరఫున ప్రకటించారు. అయితే, అంత కీల‌క‌ విష‌యాన్ని కూడా వారు మీడియా ముఖంగా కాకుండా యూట్యూబ్ వీడియో ద్వారా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - తెలంగాణ రాష్ట్రాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చూపిన బాట‌లో ఎంతో మంది యువ‌త న‌డుస్తున్నార‌ని, పార్టీకి వారే బ‌ల‌మ‌ని శంక‌ర్ గౌడ్ స్ప‌ష్టంచేశారు.

ఇప్ప‌టికే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క‌మిటీలు - భ‌విష్య‌త్తు కార్య‌క్ర‌మాలు స‌మావేశాలు నిర్వ‌హించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దీనికోసం ప్ర‌త్యేక బృందాలు అన్ని జిల్లాలు-నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లాయ‌ని ఆయ‌న చెప్పారు. యువ‌త పెద్ద ఎత్తున పవ‌న్ వెనుక ఉన్న‌ట్లు చెప్పిన ఆయ‌న జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో దిగ్విజ‌యంతో ముందుకు వెళ్తుంద‌ని స్ప‌ష్టంచేశారు.

ఎన్నిక‌ల‌కు ఇక ఏడాదే ఉంది. కానీ జ‌న‌సేన పార్టీ నిర్మాణం ఇప్ప‌టికే జిల్లా స్థాయిలో కూడా జ‌ర‌గ‌లేదు. వాళ్లు చెబుతున్న‌ట్టు స‌మావేశాలు జ‌రిగి ఉంటే వాటిని అంత ర‌హ‌స్యంగా ఉంచ‌డం ఎందుకు అనేది ఇక్కడ పెద్ద ప్ర‌శ్నే. ఎందుకంటే ఒక పార్టీ కార్య‌క్ర‌మాలు చేసినా, మీటింగులు పెట్టినా ఆ హ‌డావుడే వేరు. ఏరోజూ అది ఏ మీడియాలోనూ క‌నిపించ‌లేదు. కానీ ఏకంగా అవ‌న్నీ జ‌రిగిపోయినట్టు పార్టీ ప్ర‌తినిధి ప్ర‌క‌టించారంటే... ఈ ర‌హ‌స్య చ‌ర్చ‌ల‌కు కారణాలేంటో మ‌రి!