Begin typing your search above and press return to search.

జనసేనాని షాకింగ్ డెసిషన్... ఏపీ .రాజకీయాల్లో పెను సంచలనం

By:  Tupaki Desk   |   15 Nov 2022 3:30 PM GMT
జనసేనాని షాకింగ్ డెసిషన్... ఏపీ .రాజకీయాల్లో పెను సంచలనం
X
ఏపీ రాజకీయాల్లో ఎవరు అవునన్నా కాదన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్. ఆయన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నది ఒక పెద్ద చర్చ అయితే ఆయన గెలుపు ఓటములు కూడా ఎవరికి ప్రభావితం చేస్తాయన్న దాని మీద లెక్కలు ఏ రాజకీయ ఉద్ధండుడికీ అంతు చిక్కడం లేదు. ఇక పోతే 2019 ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ చేశారు. అయితే కామ్రేడ్స్, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారనుకోండి.

ఆ ఎన్నికల్లో పవన్ పార్టీకి ఆరు శాతం ఓట్లు ఒక సీటూ దక్కింది. అయితే పవన్ పోటీ వల్ల టీడీపీకి ఏకంగా ముప్పయి నుంచి నలభై సీట్లలో అతి పెద్ద దెబ్బ తగిలింది. ఇంకో వైపు చరిత్రంలో గతంలో లేని విధంగా వైసీపీకి 50 శాతం ఓట్ల షేరింగ్ తో పాటు 151 సీట్లు లభించి రికార్డు కొట్టింది.

దీని వల్ల అర్ధమైనది ఏంటి అంటే పవన్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి దారుణంగా నష్టమని అనుకున్నారు. అయితే 2024 లెక్కలు 2019 లా ఉండవని వేరే విధంగా ఉంటాయని కూడా అంచనా వేసే వారు ఉన్నారు. అదెలా అంటే 2019 ఎన్నికల్లో జగన్ కి ఒక్క చాన్స్ ఇచ్చి సీఎం గా ఆయనను చూడాలని ఉంది అనుకునే జనాలు మెజారిటీ ఉన్నారు.

ఇక 2024 ఎన్నికలకు వస్తే జగన్ ఎటూ సీఎం అయ్యారు. దాంతో రిలాక్స్   మూడ్ లో వైసీపీ శ్రేణులు ఉండిపోతున్నాయి. జనాలలో చూస్తే అయిదేళ్ల జగన్ పాలన మీద తప్పనిసరిగా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దాంతో జగన్ వైపు నుంచి కూడా ఓట్లు తాజాగా పవన్ పార్టీ వైపు ట్రావెల్ అవుతాయి అంటున్నారు. ఆ విధంగా అనుకుంటే జనసేన గ్రాఫ్ బాగా పెరుగుతున్న నేపధ్యంలో ఒంటరిగా ఆయన కనుక పోటీ చేస్తే వైసీపీకి కూడా దెబ్బ పడుతుంది అని అంటున్నారు.

అది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాలో కొన్ని జిల్లాలలో ప్రభావం ఉంటుంది అని చెబుతున్నారు. ఆ విధంగా అధికార వైసీపీ ప్రధాన పక్షం టీడీపీలను పవన్ సోలో ఫైట్ అంచనాలకు అందని విధంగా దెబ్బేసే సీన్ అయితే ఉంది అంటున్నారు. ఇక పవన్ ఒంటరిగా బరిలోకి దిగితే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అది ఏపీ రాజకీయాల్లో గతంతో పోల్చితే ఊహించనిదే. ఏ విశ్లేషణకు అందనిదే అని అంటున్నారు.

అదేలా ఉంటే ఏపీలో ఉన్న 175 సీట్లలో సగానికి పైగా సీట్లు వస్తేనే అధికారం దక్కినట్లు. ఆ మ్యాజిక్ ఫిగర్ ని ఇటు వైసీపీకి అటు టీడీపీకి కూడా దూరం చేసే విధంగా పవన్ ఒంటరి పోరు సాగుతుంది అని లెక్కలేస్తున్నారు. అపుడు పవన్ కళ్యాణ్ జనసేనకు ఏ ముప్పయి సీట్లు వచ్చినా కూడా కింగ్ మేకర్ గా ఆయన నిలవడం ఖాయమని చెబుతున్న వారూ ఉన్నారు.

మరి ఈ రకమైన విశ్లేషణలు, అంచనాలూ అన్నీ దగ్గర పెట్టుకునే పవన్ ఒంటరి పోరుకు సై అంటున్నారా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. మరో వైపు ఈసారి ఎన్నికల్లో పవన్ సీఎం కావాలని జనసేన తో పాటు బలమైన కాపు సామాజికవర్గం కూడా కోరుకుంటోంది. ఆయన టీడీపీ తో వెళ్తే సీఈం కోరిక తీరే చాన్స్ అసలు లేదు. పెద్ద పార్టీగా టీడీపీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ని అసలు వదులుకోదు.

మరి బీజేపీతో కలసి వెళ్దామంటే ఆ పార్టీ జనసేనకు అదనపు బరువు తప్ప మరేమీ కాదు అన్న వాదనలు ఉన్నాయి. పైగా దేశంలో మోడీ హవా ఎలా ఉన్నా ఏపీకి వచ్చేసరికి బీజేపీకి ఉన్న మైనస్సులు ఏపీకి ఏమీ చేయడంలేదు అన్న విమర్శల వల్ల దాన్ని మోసే జనసేనకు కూడా అది రివర్స్ అవుతుందని అంటున్నారు.

దాంతో పవన్ కళ్యాణ్ ఒక రిస్కీ డెసిషన్ నే తీసుకుంటున్నారు అని అంటున్నారు. అదేంటి అంటే ఒంటరిగా పోటీ చేసి తాడో పేడో తేల్చుకోవడం, టీడీపీ వంటి పార్టీల పక్క వాయిద్యంగా ఉండి 2029 ఎన్నికల వరకూ వేచి చూడకపోవడం. ఈ ఎన్నికల్లో సోలోగా జనసేన పోటీ చేస్తే కాపు ఓట్లు టోటల్ గా పోలరైజ్ అయి జనసేన వైపు మళ్ళుతాయి అన్న లెక్కలు ఉన్నాయి.

దాంతో పాటు ఇతర వర్గాలను కూడా ఆకట్టుకుంటే మంచి నంబర్ లో సీట్లతో పాటు ఓట్లు దక్కి ఏపీలో తదుపరి సీఎం గా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగడం ఖాయమని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా విజయనగరం టూర్ లో తన టోన్ మార్చారు. ఆయన తాను సీఎం అవుతాను అని చెబుతూ తనకు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. అంటే ఫుల్ ప్రిపేర్ అయిన తరువాతనే పవన్ ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇచ్చారని చెబుతున్నారు.

ఇలా చంద్రబాబు తనకు సంఘీభావం తెలిపినా టీడీపీకి అనుకూలంగా పవన్ ప్రకటనలు చేయకపోవడం, మరో వైపు మోడీ వంటి బిగ్ షాట్ ప్రధాని తనతో భేటీ వేసినా బీజేపీ వైపుగా పాజిటివ్ రియాక్షన్స్ ఇవ్వకపోవడం వెనక పవన్ మాస్టర్ ప్లాన్ ఉంది అని అంటున్నారు. మెగా ఫ్యామిలీ అంతా పూర్తి మద్దతు ఇస్తున్న వేళ ఈసారి ఎన్నికల్లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికే పవన్ రెడీ అయ్యారని చెబుతున్నారు. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదు అవడం ఖాయమనే అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.