Begin typing your search above and press return to search.

గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌న‌సేన ప్లీన‌రీ

By:  Tupaki Desk   |   1 March 2018 8:42 AM GMT
గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌న‌సేన ప్లీన‌రీ
X
కొద్ది రోజులు హ‌డావుడి చేయ‌టం.. ఆ వెంట‌నే కామ్ అయిపోవ‌టం.. మ‌ళ్లీ కొద్ది రోజుల‌కు మీడియా ముందుకొచ్చి చాలా చేయ‌నున్న‌ట్లు చెప్పేయ‌టం లాంటివి ప్ర‌స్తావించిన వెంట‌నే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌ప్పున గుర్తుకు వ‌స్తారు. సంప్ర‌దాయ రాజ‌కీయ పార్టీల‌కు భిన్నంగా.. అంతా తానే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మేకాదు.. మీడియా ముందుకు మొద‌లు.. పార్టీకి సంబంధించి ప్ర‌తి ప‌నిలోనూ తానే ప్ర‌త్య‌క్షంగా పాలుపంచుకుంటూ ఉంటారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఈ మ‌ధ్య‌న ఏపీకి కేంద్రం నుంచి వ‌చ్చిందేమిటి? పోయిందేమిటి? అన్న అంశాల‌తో పాటు.. విభ‌జ‌న హామీల అమ‌లుకు సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ అంటూ ఏర్పాటు చేసి హ‌డావుడి చేయ‌టం తెలిసిందే.

వ‌రుస‌గా స‌మావేశాలు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ సాధించిందేమీ లేద‌న్న‌విష‌యం చివ‌రి రోజున తేలిపోయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కామ్ గా ఉన్న ప‌వ‌న్‌.. ఇప్పుడు మ‌రో భారీ ప్లాన్ వేసిన‌ట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్లీన‌రీని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మార్చి14న జ‌న‌సేన ప్లీన‌రీని పెద్ద ఎత్తున గుంటూరుస‌మీపంలోని మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు.

ప్లీన‌రీకి సంబంధించి స‌రికొత్త‌గా ప్లాన్ చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ప్లీన‌రీకి ఐదు ల‌క్ష‌ల మందిని స‌మీక‌రించాల‌న్న‌ది టార్గెట్ గా చెబుతున్నారు. ఇందుకోసం ఏపీ న‌లుమూల‌ల నుంచి జ‌నాల్ని తీసుకొచ్చేందుకు తెర వెనుక చేయాల్సిన కార్య‌క్రమాల్ని స్టార్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వ్యూహం ఇప్ప‌టికే ఖ‌రారైంద‌ని.. వ‌ర్క్ మొద‌లైన‌ట్లుగా చెబుతున‌నారు. ల‌క్ష‌లాది రూపాయిలు ఈ స‌భ కోసం ఖ‌ర్చుచేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ స‌భ‌కు తొలిసారి బ్యార‌కేడ్ సిస్ట‌మ్ మీద వ‌ర్క్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇందుకు అవ‌స‌ర‌మైన దానిని జ‌న‌సేన త‌ర‌ఫున కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్లీన‌రీ త‌ర్వాత ఈ సామానును గుంటూరు.. విజ‌య‌వాడ మ‌ధ్య‌లో ఉంచి.. త‌ర్వాతి కాలంలో ఏపీలో నిర్వ‌హించే స‌భ‌ల‌కు వాడుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

దీంతో పాటు సౌండ్ సిస్టం.. లైటింగ్‌.. ఎల్ ఈడీ స్క్రీన్ల‌ను మాత్రం హైద‌రాబాద్‌కు తీసుకెళ‌తార‌ని చెబుతున్నారు. వేదికను భారీగా డిజైన్ చేయ‌నున్నారు. సుమారు 120 అడుగుల పొడ‌వు.. 18 అడుగుల వెడ‌ల్పు.. అంతే ఎత్తు ఉండే వేదిక‌ను డిజైన్ చేయ‌టంతో పాటు.. ఒకే వేదిక‌గా కాకుండా రెండు.. మూడు భాగాలుగా ఉంటుంద‌ని చెబుతున్నారు.ఈ వేదిక వెనుక బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం భారీ ఎల్ ఈడీ తెర‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

వేదిక‌కు ఎదురుగా మీడియాకు ప్లేస్ కేటాయిస్తారు. వారికి కుడివైపున మ‌హిళ‌లు.. ఎడ‌మ‌వైపు ప్ర‌ముఖుల‌కు గ్యాల‌రీలు ఏర్పాటు చేస్తార‌ని చెబుతున్నారు. మీడియా వెనుక మొత్తం ఆరు విభాగాలు ఉంటాయ‌ని.. అందులో జ‌నాల్ని కూర్చోబెట్ట‌నున్నారు. ప్ర‌తి విభాగానికి ఒక ఎంట్రీ ఉంటుంది. అన్ని విభాగాల‌కు మ‌ధ్య‌లో నేరుగా దారి ఉంటుంది. ఎక్క‌డా ఎలాంటి తొక్కిస‌లాట‌కుఅస్కారం లేకుండా ప్లాన్ చేస్తున్నారు. ఎంత‌మంది తోసేసిన బ్యారికేడ్లు క‌ద‌ల‌కుండా ఉండేలా బ‌ల‌మైన బ్యారికేడ్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వేదిక మీద ఎప్ప‌టి మాదిరే ప‌వ‌న్ ఒక్క‌రే ప్ర‌సంగిస్తార‌ని చెబుతున్నారు.

ప‌రిమితంగా సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో పాటు.. ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీలో ఉన్న స‌భ్యుల‌ను కూడా ప్లీన‌రీకి పిలిచే వీలున్న‌ట్లు చెబుతున్నారు. ఇక‌.. ప్లీన‌రీకి సంగీత ద‌ర్శ‌కుడు.. ప‌వ‌న్ న‌టించిన గోపాల గోపాల మూవీకి మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ చేత పాట‌లు రూపొందిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక‌.. అస్థాన క‌వులు ఇప్ప‌టికే పాట‌ల త‌యారీలో నిమ‌గ్న‌మైన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌న‌సేన నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల అన్నింటిలోకి అతి పెద్ద కార్య‌క్ర‌మంగా ఈ ప్లీన‌రిని అభివ‌ర్ణిస్తున్నారు.