Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌ స‌వాల్‌కు జ‌గ‌న్ సిద్ధ‌మేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2022 11:04 AM GMT
జ‌న‌సేన‌ స‌వాల్‌కు జ‌గ‌న్ సిద్ధ‌మేనా?
X
త‌న బ‌స్సు యాత్ర‌ను వాయిదా వేస్తున్నాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై వైఎస్సార్సీపీ మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి పేర్ని నాని అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని తూర్పుగోదావ‌రి జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు కందుల దుర్గేష్ మండిప‌డ్డారు. ఏ ప‌రిస్థితుల్లో బ‌స్సు యాత్ర‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చిందో ప‌వ‌న్ జ‌నసేన లీగల్ స‌మావేశంలో వివ‌రించార‌ని గుర్తు చేశారు. త‌మ‌ను ప్ర‌శ్నించే ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌తో సెప్టెంబ‌ర్ 20న‌ జ‌గ‌న్ నిర్వ‌హించాల‌నుకున్న‌ స‌మావేశాన్ని ఎందుకు వాయిదా వేశార‌ని కందుల దుర్గేష్ ప్ర‌శ్నించారు. ప్ర‌జాస్వామ‌బ‌ద్ధంగా నిర్వ‌హించాల్సిన స‌మావేశాన్ని వాయిదా వేయ‌డం వెనుక ఎమ్మెల్యేలు, మంత్రులంటే జ‌గ‌న్‌కు లెక్క‌లేదా అని నిల‌దీశారు.

పేర్ని నానికి ఈ బానిస‌త్వం ఎందుక‌ని కందుల దుర్గేష్ ప్ర‌శ్నించారు. పేర్ని నాని తండ్రి కృష్ణ‌మూర్తి నేష‌న‌ల్ మ‌జ్దూర్ యూనియ‌న్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవార‌ని గుర్తు చేశారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేశార‌న్నారు. అలాంటి వ్య‌క్తి క‌డుపున పుట్టి జ‌గ‌న్‌కు బానిస‌లాగా తయార‌య్యార‌ని మండిప‌డ్డారు. పేర్ని నాని ఒక పండిత పుత్ర‌: ప‌ర‌మ శుంఠ‌: మాదిరి త‌యార‌య్యార‌ని ఎద్దేవా చేశారు. పేర్ని నాని మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న శాఖ‌పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడేవార‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తిట్ట‌డానికి అప్పుడు ఇప్పుడు పేర్ని నాని ప‌రిమిత‌మ‌య్యార‌ని ఎద్దేవా చేశారు. కాప‌లా కుక్క‌లా బానిస‌త్వ‌పు బ‌తుకు వ‌ద్ద‌ని పేర్ని నానికి హిత‌వు ప‌లికారు. త‌మ పార్టీ నిర్ణ‌యాల‌పై ప‌వ‌న్ మాట్లాడుతుంటే వాటిని కూడా పేర్ని నాని విమ‌ర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అలాగే ఆర్కే రోజా.. జ‌గ‌న్‌పై ప‌వ‌న్ పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాళ్లు విసురుతున్నార‌ని.. అయితే అందుకు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంద‌నే విష‌యాన్ని రోజా గుర్తుంచుకోవాల‌న్నారు. అక్క‌డిదాకా అవ‌స‌రం లేద‌ని ద‌మ్ముంటే రాష్ట్రంలో ఎక్క‌డైనా వైఎస్సార్సీపీ నేత‌లు జ‌గ‌న్‌తో స‌భ పెట్టించాల‌ని కోరారు. మ‌రుస‌టి రోజు అదే ప్ర‌దేశంలో ప‌వ‌న్ కూడా స‌భ పెడ‌తార‌ని.. ఎవ‌రి స‌భకు ఎక్కువ వ‌చ్చారో తేలుద్దామ‌ని సవాల్ విసిరారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ స‌భ‌ల‌కు జ‌నాన్ని త‌ర‌లించ‌డం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని డ‌బ్బు, మ‌ద్యం, బిర్యానీ పొట్లాలు పంచుతున్నార‌ని కందుల దుర్గేష్ నిప్పులు చెరిగారు. అంతేకాకుండా ర‌వాణా శాఖ అధికారుల‌పై ఒత్తిడి తెచ్చి వాహ‌నాల‌ను కూడా త‌ర‌లిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అసెంబ్లీలో జ‌గ‌న్ మాట‌ల‌కు, న‌ట‌న‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వ‌వ‌చ్చ‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును అన్ని విధాల భ్ర‌ష్టుప‌ట్టించార‌ని కందుల దుర్గేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు పోల‌వ‌రం పూర్త‌వుతుందో త‌న‌కే తెలియ‌ద‌ని చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. మాట‌లు త‌ప్ప చేత‌లు లేవ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై దుర్గేష్ ధ్వ‌జ‌మెత్తారు. పోల‌వ‌రంపై ఇన్ని విన్యాసాలు ఏమిట‌ని నిల‌దీశారు. ముందు పోల‌వరంతో న‌ష్ట‌పోయే వాళ్ల‌కు ఆర్ఆర్ ప్యాకేజీ కింద రూ.15 లక్ష‌లు ఇస్తామ‌న్నార‌ని.. మ‌ళ్లీ ఆ త‌ర్వాత రూ.10 ల‌క్ష‌లు ఇస్తామ‌ని మాట మార్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌రికి కూడా రూ.10 ల‌క్ష‌లు ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. నిర్వాసితులు నెల‌ల త‌ర‌బ‌డి ఉద్య‌మాలు చేస్తున్నా ప్ర‌భుత్వానికి క‌ళ్లు క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల‌లో పోల‌వ‌రానికి ఎంత డ‌బ్బు తీసుకొచ్చారో శ్వేత‌పత్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై స్వ‌యంగా సుప్రీంకోర్టు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింద‌ని కందుల దుర్గేష్ విమ‌ర్శించారు. జ‌గ‌న్ పాల‌న తీరు అలా ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. స్వ‌యంగా జ‌గ‌న్ చిన్నాన్న కూతురుకే న్యాయం ద‌క్క‌ని ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉంద‌న్నారు. అన్న మీద న‌మ్మ‌కం లేక విచార‌ణ‌ను వేరే రాష్ట్రానికి మార్చాల‌ని అడుగుతుందంటే ఎంత సిగ్గు చేటో ఆలోచించాల‌న్నారు. చిరంజీవికి ప‌వ‌న్ వెన్నుపోటు పొడిచారని పేర్ని నాని చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకా కూతురు స‌మ‌స్య‌పై పేర్ని నాని స్పందించాల‌ని డిమాండ్ చేశారు. చిరంజీవి పార్టీని ప‌వ‌న్ కొన‌సాగిస్తున్నార‌ని దుర్గేష్ గుర్తు చేశారు.

కాకినాడ‌లో బ‌ల్క్ డ్ర‌గ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామ‌ని జ‌గ‌న్ చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. కాకినాడ‌లో ఈ బ‌ల్క్ డ్ర‌గ్ యూనిట్ వ‌ల్ల మ‌త్య్స‌కారుల జీవ‌నోపాధికి తీవ్ర న‌ష్టం ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు. జ‌గ‌న్ త‌నకు కావాల్సిన అర‌బిందో ఫార్మాకు ఈ బ‌ల్క్ డ్ర‌గ్ యూనిట్ ను క‌ట్ట‌బెడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని సాగ‌నంప‌డానికి ప్ర‌జ‌లంతా సిద్ధంగా ఉన్నార‌ని తేల్చిచెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.