Begin typing your search above and press return to search.

రణస్థలం సాక్షిగా పవన్ అవిశ్వాస ప్రకటన!

By:  Tupaki Desk   |   13 Jan 2023 6:31 PM GMT
రణస్థలం సాక్షిగా పవన్ అవిశ్వాస ప్రకటన!
X
నాయకుడు అన్న వారికి ముందు తమ మీద తమకు విశ్వాసం ఉండాలి. తాను చేస్తున్నది తాను నమ్ముతూ తన అనుచరులను నమ్మించేలా చేయాలి. ఒక సిద్ధాంతం అయినా విధానం అయినా తాను బలంగా నమ్మితే అది అనుచరులు మొత్తం పాటించేలా చేయాలి. కానీ పవన్ మాత్రం ఆ విశ్వాసం తనలో తాను తగ్గించుకున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఇంతకు ముందు నేను ఓడినా జనంలో ఉంటాను పాతికేళ్ళ రాజకీయం నాది అంటూ చెప్పే పవన్ ఇపుడు ఓటమిని వీరమరణం గా ఎలా అనుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్న.

రాజకీయాల్లో ఓటములు ఉంటాయి. ఎంతో మంది దిగ్గజ నేతలు ఓడారు. అసలు ఓటమి పెద్ద సమస్య కాదు, ఎపుడు ఓటమి నాయకుడికి అంటే తన మీద తనకు విశ్వాసం తగ్గినపుడు తన సిద్ధాంతాలను భావజాలాన్ని జనంలోకి గట్టిగా చెప్పుకోలేకపోయినపుడు. అంతే తప్ప ప్రజాస్వామ్యంలో ఓటమి అన్నది ఈవీఎం మిషన్లలో ఉండదు.

ఆ మాటకే వస్తే కమ్యూనిస్టులు ఎపుడూ గెలిచిన సందర్భాలు లేవు. కానీ వారు తన సిద్ధాంతాలను గట్టిగా నమ్ముతూ వాటిని ప్రచారం చేస్తూ అందులో ఎపుడూ గెలుస్తూనే ఉంటారు. మరి జనసేన అధినాయకుడు ఒక భావజాలంతోనే పార్టీ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఆయన 2019లో ఒంటరిగా పోటీ చేశారు. ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అంటే అంతమంది జనాలు జనసేనను ఆదరించినట్లే కదా.

మరో విడతలో అంతకు మించి ఓట్లు రావచ్చు. జనాల్లోకి ఎంత దూకుడుగా చొచ్చుకుని పోతే అంతలా ఆదరణ పెరగవచ్చు. మరి ఆ విషయంలో నిరాశ ఎందుకు అన్నదే ఇక్కడ ప్రశ్న. అదే విధంగా చూస్తే తన సభలకు వస్తున్న వారు అంతా ఓట్లేయరు అని ఒక మాట పవన్ వాడారు. అది పవన్ కి మాత్రమే కాదు ప్రతీ రాజకీయ నాయకుడికీ ఉంటుంది. ఏ నేత సభకు వచ్చినా జనాలు వారికి పూర్తిగా ఓట్లెస్తే ఎవరూ ఎపుడూ ఓడిపోరు.

తన పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసే వారు అనుచరులు ఉండాలి. అలాగే జనాలకు తాము ఏమి మంచి చేస్తామో చెప్పి ఒప్పించగలగాలి. అపుడే ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ కి ఇవన్నీ తెలియవు అని ఎవరైనా అనుకోగలరా. ఆయన ఎందుకో నిరాశావాదంతోనే ఉనారని అంటున్నారు. నిజానికి గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. ఆ పార్టీకి 2019 కంటే ఎక్కువ ఓటింగ్ రావచ్చు అంటున్నారు. కష్టపడితే సీట్లు కూడా వస్తాయి.

ఇలాంటి టైం లో తన అనుచరులు, అభిమానులతో పాటు ప్రజలను కూడా నమ్మలేను అన్నట్లుగా మీరు నాకు ఓటేయరు సభలకు మాత్రం వస్తారు అని అవిశ్వాస ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ కి తగదనే అంటున్నారు. పొత్తులు అన్నవి ఎపుడూ ఎన్నికల్లో ఎత్తులుగా ఉంటాయి. కానీ సాలిడ్ గా ఏ పార్టీకి ఆ పార్టీకి బలం సొంతంగా ఉంటుంది ఉండాలి. మేము సొంతంగా గెలుస్తాం కానీ అంతా కలిస్తే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది అని భావిస్తూ పొత్తులు అని చెప్పాలి.

మరి ఈ నర్మగర్భమైన వ్యవహారశైలి పవన్ కి తెలియక ఆయన ఈ రకమైన నిరాశావాద ప్రకటనలు చేస్తున్నారా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి. మరో వైపు చూస్తే మాకు ఒంటరిగా పోటీ చేసినా సత్తా చాటే సీన్ ఉంది అయినా విశాల ప్రయోజనాల కోసం పొత్తులు అంటూ చెబితేనే రాయబేరాలు సవ్యంగా సాగుతాయి. సీట్లు కూడా ఎక్కువగా దక్కే చాన్స్ ఉంటుంది. ఒంటరిగా వెళ్తే వీరమరణమే అని ముందే చెప్పేసుకుంటే ఎక్కువ సీట్లు పొత్తులో ఆశించడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ మునుపటి సభలకు రణస్థలం సభకు తేడా బాగా కనిపిస్తోంది.

ఇదివరకూ మేమే గెలుస్తామని గట్టిగా చెప్పే జనసేనాని ఇపుడు పొత్తులు ఎందుకు కుదుర్చుకోవాలి అన్న పాయింట్ ని పార్టీ వారికి వివరించే ప్రయత్నంలో భాగంగా పార్టీకి మూలమైన అస్థిత్వం అయినా విశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు అన్నది ఒక విశ్లేషణ. మరి దీని తరువాత జరిగే పరిణామాలు జనసేనకు లాభంగా మారుతాయా లేక ఇబ్బంది పెడతాయా అన్నది చూడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.