Begin typing your search above and press return to search.

అధికారం పంచుకోవాల్సిందే...పవన్ సందేశం అదే...?

By:  Tupaki Desk   |   14 Jan 2023 6:30 AM GMT
అధికారం పంచుకోవాల్సిందే...పవన్ సందేశం అదే...?
X
వచ్చే ఎన్నికల్లో ఏపీలో మిశ్త్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారు. అంటే అది జనసేన తెలుగుదేశం కలిసి ఏర్పడే ప్రభుత్వం అన్న మాట. మరో మాటగా చెప్పాలీ అంటే సంకీర్ణ ప్రభుత్వం. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం కాదు.

2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏపీలో ఏర్పడింది. ఆ పార్టీకి సొంతంగా 102 సీట్లు దక్కాయి. బీజేపీని మిత్రధర్మంగా క్యాబినేట్ లోకి తీసుకుని రెండు మంత్రి పదవులు ఇచ్చింది. అయితే ఈసారి అలా కాదు జనసేనతో కలసి అధికారం పంచుకోవాల్సిందే. ఈ రకమైన సూచననే పవన్ రణస్థలంలో తెలుగుదేశానికి చేశారు అని అంటున్నారు.

జనసేన ఆలోచనలు చూస్తే తాము ప్రభుత్వంలో కీలకమైన పాత్రను పోషించడమే కాదు పవర్ షేరింగ్ లోనూ ప్రముఖంగా ఉంటామని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సైతం గౌరవం ఇవ్వాలని ఒక కీలకమైన కండిషన్ పెట్టారు. ఆ గౌరవం వెనక చాలా కధ ఉంది అంటున్నారు.

ఏపీలో అధికారంలోకి రావాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. ఇక మొత్తం సీట్లు 175 ఉన్నాయి. ఇందులో జనసేనకు కచ్చితంగా 50 నుంచి 55 సీట్లు దాకా ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ అయితే ఉంది. దానికి వారు చెబుతున్న కారణం 2019 ఎన్నికల్లో తమ వల్లనే 53 సీట్లలో తెలుగుదేశం ఓడి వైసీపీ గెలిచింది అని. అంటే ఈ సీట్లు తమకు ఇవ్వకపోతే మళ్ళీ తాము ఒంటరిగా దిగితే తెలుగుదేశానికే ఇబ్బంది అని చెబుతున్నట్లుగా ఉంది.

అదే సమయంలో 50 కి పైగా సీట్లు అడగడానికి కూడా కారణం ఉంది. ఇందులో కచ్చితంగా 40 దాకా సీట్లు గెలుచుకుంటామన్న నమ్మకాన్ని జనసేన వ్యక్తం చేస్తోంది. అలా 40 సీట్లు తమ దగ్గర ఉంటే కనుక రేపటి ప్రభుత్వంలో తాము కీలకం కావడమే కాదు అధికారంలో వాటాదారులం కూడా అవుతామని అంటున్నారు

తమకు 55 సీట్లు ఇస్తే తెలుగుదేశం 120 దాకా పోటీ చేస్తే కచ్చితంగా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజరిటీ అయితే రాదు. అందువల్ల రేపటి ప్రభుత్వం ఏర్పాటులో తమ అవసరం పడుతుంది అన్నదే జనసేన ఆలోచన. అలా అవసరం పడాలని కూడా గట్టిగా కోరుకుంటున్నారు. ఇలా పవన్ ఆలోచనలు అన్నీ కూడా కలగలిపి రణస్థలం సభలో గౌరవప్రదంగా ఉంటేనే పొత్తులు అన్న మాట వాడారని అంటున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లు జనసేనకు ఇస్తుందా ఇచ్చి తాము సొంతంగా మెజారిటీ రాకుండా చేసుకుంటుందా జనసేన మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలో కూడా అనుకోదు అనే అంటున్నారు. అందువల్ల ఈ పొత్తుల ఎత్తుల విషయంలో చాలా ట్విస్టులే ఉంటాయని అంటున్నారు.

దాని కంటే ముందు బాబు మార్క్ వ్యూహాలు ఉంటాని అంటున్నారు. కూటమిలోకి చాలా పార్టీలను చేర్చుకోవడం ద్వారా జనసేన ప్రాధాన్యతను కూడా తగ్గించాలని బాబు ఆలోచించవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బాబు నుంచి సీఎం పదవి తీసుకోవడం నాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరిక్రిష్ణ, బాలక్రిష్ణలకే సాధ్యం కాలేదని, ఇపుడు కుదురుతుందా అన్న డౌట్లు అయితే వ్యక్తం చేసేవారు ఉన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.