Begin typing your search above and press return to search.

నిన్న బాబుది... నేడు జగన్ ది.. రేపు పవన్ ది...!

By:  Tupaki Desk   |   13 Jan 2023 1:30 AM GMT
నిన్న బాబుది... నేడు జగన్ ది.. రేపు పవన్ ది...!
X
జనసేన క్యాడర్ మనోగతమిది. వారి ధీమా ఇది. వారి బలమైన ఆకాంక్ష ఇది. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ణి సీఎం గా చూడాలని గట్టిగా కోరుకుంటారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో జరిగిన యువశక్తి సభ సాక్షిగా వేదికపైన మాట్లాడిన జనసేన యువజన విభాగం నాయకులు పలువురు సీఎం పవన్ అని నినాదాలు చేశారు.

వేదిక మీద వారు మాట్లాడిన ప్రతీ మాట కూడా పవన్ సీఎం కావాలనే. ఇక వేచి ఉండలేమని కూడా స్పష్టంగా చెప్పేశారు. ఏపీకి నిన్న చంద్రబాబు సీఎం అయ్యారు. ఈ రోజు జగన్ సీఎం గా ఉన్నారు. రేపు పక్కాగా పవన్ కళ్యాణే సీఎం అవుతారు అని ఒక జనసేన నాయకుడు పవన్ ముందే చెప్పారు. తన మనసు విప్పారు. అంటే 2024 పవన్ దే అని ఆయన యువశక్తి సభ సాక్షిగా చాటారు అన్న మాట.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక సూక్తిని కూడా జనసేన నాయకుడు ఉంటకించారు. నిన్న నీది అయినది నేడు ఒకరిది,రేపు మరొకరిది అని చెబుతూ అధికారం జగన్ కి శాశ్వతం కాదు అని చెప్పుకొచ్చారు. అది బాబు నుంచి ఆయనకు దఖలు పడితే జగన్ నుంచి నేరుగా వచ్చి చేరేది పవన్ కే అని చెప్పడం ద్వారా జనసేన తగ్గేదే లే అని చెప్పేశారు.

నిజానికి ఏపీలో పొత్తుల రాజకీయం సాగుతొంది. పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశంతో కలసి వెళ్ళాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు. అలాంటి పరిస్థితులలో ఏర్పడే కూటమికి పెద్దన్నగా టీడీపీ మాత్రమే ఉంటుంది అని అందరికీ తెలిసిందే. మరి ఆ విధంగా ఆలోచిస్తే పవన్ కి సీఎం సీటు ఎలా వస్తుంది అన్నది ఆలోచించాలి.

కానీ జనసైనికులు మాత్రం అవన్నీ మాకు తెలియదు, ఆ రాజకీయ సమీకరణలు ఆ ఈక్వేషనల్తో తమకు అసలు పని లేదు అని చెప్పేస్తున్నారు. పవన్ సీఎం అవాల్సిందే అని అంటున్నారు. ఇక ఇదే సభలో మాట్లాడిన జనసేన నాయకుడు నాగబాబు పవన్ తప్పకుండా సీఎం అవుతారు అని క్యాడర్ కి ఉత్సాహం కలిగించారు. అయితే ఎపుడు అన్న దాని మీద ఆయన క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తులో అని చెప్పేశారు.

మరి ఆ భవిష్యత్తు ఎపుడు 2024లోనా లేక 2029లోనా అంటే మాత్రం ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. మొత్తానికి సభకు వచ్చిన వారు అంతా ఉత్సాహంతో పవన్ సీఎం అని నినాదాలు చేస్తూంటే మెగా బ్రదర్ కూడా వారి ఉత్సాహాన్ని పెంచేలాగానే మాట్లాడారు. పవన్ సీఎం అవడం తధ్యం, ఇది జరిగి తీరుతుంది అన్నారు. అదే విధంగా పవన్ మాత్రమే కాదు జనసేనలో ప్రతీ వారికీ సీఎం అయ్యే అవకాశం ఉందని, ఇది కుటుంబ పార్టీ కాదు అందరి పార్టీ అని నాగబాబు చెప్పడం విశేషం. మొత్తానికి పవన్ సీఎం అన్న నినాదం అయితే యువశక్తి సభలో మరింత గట్టిగా వినిపించడం జరిగింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.