Begin typing your search above and press return to search.

ఇలా అయితే అసలు కుదరదు పవన్...

By:  Tupaki Desk   |   13 Oct 2022 4:43 AM GMT
ఇలా అయితే అసలు కుదరదు పవన్...
X
జనసేనాని పాలిటిక్స్ ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు అంటున్నారు. గంభీరమైన ప్రకటనలు మాత్రం ఆయన నుంచి ప్రతీసారీ వస్తున్నాయి. కానీ దానికి తగిన విధంగా అడుగులు పడుతున్నాయా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏపీలో వైసీపీని దించేసే విషయంలో పవన్ లో కసి కనిపిస్తుంది. ఆ విషయంలో ఎవరూ వేలు పెట్టి చూపించలేరు. అంతే కాదు వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూస్తాను అని పవన్ అంటున్నారు. అంటే పొత్తు రాజకీయం అని భావించాలి. అది కూడా కరెక్టే అనుకున్నా అసలు జనసేనకు ఉన్న బలం ఎంత అన్నది ఎప్పుడైనా సమీక్ష చేసుకున్నారా అన్నదే ఇపుడు పాయింట్.

ఏపీలో చూస్తే వైసీపీ బలంగా ఉంది. టీడీపీ కూడా ఢీ కొడుతోంది. కానీ జనసేన మూడవ ప్రాంతీయ పార్టీగా సర్దుకునేంత రాజకీయ శూన్యత ఉన్నా కూడా ఎందుకో సరైన విధానాలు అవలంబించకపోవడం వల్లనే పవన్ వెనకబడుతున్నారు అని అంటున్నారు. ఎన్నికలు ఏణ్ణర్ధం వ్యవధిలోకి వచ్చేశాయి. ఇప్పటికి చూసినా మొత్తం 175 నియోజకవర్గాలలో గట్టి నాయకులు ఉన్నారా అన్నది ప్రశ్నించుకుంటే జవాబు లేదు అనే వస్తుంది.

పార్టీని ముందు సంస్థాగతంగా గట్టిపరచుకోవాలి కదా. అభిమానం ఉంటే చాలా. అది ఓట్లుగా మార్చే పార్టీ యంత్రాంగం ఉండేలా చూసుకోవాలి కదా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. బూత్ లెవెల్ దాకా పార్టీ క్యాడర్ ని చేరి అక్కడ నుంచి పార్టీ నిర్మాణం చేపడితేనే ఫలితాలు ఆశాజనంగా ఉంటాయి. అంతే తప్ప జనసేన సభలు సమావేశాలు పెట్టినపుడు వచ్చే జనాలను చూసుకుని విజయం ఖాయమనుకుంటే కుదరదు అని అంటున్నారు.

ఇక ప్రతీ మీటింగులో పవన్ సీఎం అని అభిమానులు గట్టిగా కేకలు వేస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే క్యాడర్ పెద్దగా కనిపించదు, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో చూస్తే పార్టీ బాధ్యులు కానీ నిర్మాణం కానీ ఈ రోజుకు ఉన్నట్లుగా ఏమీ కనిపించదు. అలా జనసేన తన రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తూ వస్తోంది.

ఈ రోజుకీ ఏపీ అంతటా క్షేత్ర స్తాయిలో పార్టీ జెండా మోసేవారిని పార్టీ అజెండా వివరించే వారిని తయారు చేసుకోకపోవడం అతి పెద్ద లోపంగానే చెబుతున్నారు. పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. దాన్ని సొమ్ము చేసుకుంటూ బూత్ లెవెల్ దాకా పార్టీ కమిటీలు వేయడం తరచూ పార్టీకి నిర్దిష్ట కార్యక్రమాలు ఇవ్వడం ద్వారా జనసేనను జనంలో ఉంచేలా చేయడం వంటివి చేయాలి.

పొత్తుల విషయం పక్కన పెడితే మొత్తం 175 సీట్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే దిశగా కార్యాచరణ‌ ఉండాలని జనసేన మేలుని కోరే వారు అంటున్న మాట. అపుడు ఏపీలో అధికార పార్టీని దించడం కానీ తాము అధికారంలోకి రావడం కానీ జరుగుతుంది అని సూచిస్తున్నారు. జనసేనాని ఆ వైపుగా ఆలోచనలు చేస్తారా. చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.