Begin typing your search above and press return to search.

32 నారసింహ క్షేత్రాలు.. 32 సీట్లలో పోటీ.. తెలంగాణలో జనసేన సీనేంటి?

By:  Tupaki Desk   |   17 Jan 2023 3:30 PM GMT
32 నారసింహ క్షేత్రాలు.. 32 సీట్లలో పోటీ.. తెలంగాణలో జనసేన సీనేంటి?
X
ఎన్నికల కోసం వారాహి పేరిట ప్రత్యేకంగా ప్రచార రథాన్ని సమకూర్చుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటనకు సంసిద్ధం అవుతున్నారు. ఆయన అనుష్టుప్‌ నారసింహ యాత్ర సంకల్పించారు. ఈ నెల 24న ధర్మపురి నారసింహస్వామి ఆలయ సందర్శనతో ఈ యాత్ర మొదలవుతుంది. మొత్తం 32 నారసింహస్వామి క్షేత్రాలను పవన్ కల్యాణ్ సందర్శిస్తారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి పవన్ కల్యాణ్ కు ఇష్టదైవం. తొలిగా ఈ క్షేత్రాన్ని సందర్శించి వారాహి వాహనానికి సంప్రదాయ పూజ నిర్వహిస్తారు.

నాటి ప్రమాదంలో గట్టెక్కి..

2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇందులో భాగంగా పవన్ కొండగట్టు ప్రాంతంలో సైతం పర్యటించారు. నాడు ఆయన ప్రచార వాహనానికి విద్యుత్తు తీగలు తగిలాయి. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు ఆ తర్వాత పలుసార్లు పవన్ చెప్పారు. ఇప్పుడిదే విషయాన్ని పేర్కొంటూ పవన్ యాత్రను కొండగట్టు నుంచి చేపడుతున్నారని జనసేన తన ప్రకటనలో పేర్కొంది.

కొండపైన మొక్కు.. కొండ కింద భేటీ

కాగా, ఈ నెల 24న కొండగట్టులో అంజన్నను దర్శించుకున్న పవన్.. వారాహికి పూజలు చేస్తారు. తర్వాత కొండ దిగువ ప్రాంతంలో తెలంగాణలోని 35 నియోజకవర్గాలకు చెందిన జనసేన కన్వీనర్లు, రాజకీయ నాయకులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను, చేపట్టబోయే కార్యక్రమాలను చర్చించి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ధర్మపురికి చేరుకుని స్వామి వారి ఆలయంలో పూజలు చేసి అనుష్టుప్‌ నారసింహ యాత్రను ప్రారంభిస్తారు.

ఏపీలో అలా.. తెలంగాణలో ఎలా..?

పవన్ కల్యాణ్ రాజకీయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఆయనకు అభిమానులున్నా.. పార్టీ బలం తక్కువే. ఏపీలో ఇప్పటికి ఉన్న పరిస్థితిని చూస్తే పవన్ టీడీపీతో పొత్తుతో వెళ్లే యోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో స్నేహం మొదలుపెట్టినా.. వచ్చే ఎన్నికల నాటికి అది కొనసాగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీని ఎదుర్కొనాలంటే టీడీపీతో కలిసివెళ్లాలని.. అదికూడా గౌరవ తగ్గని రీతిలో పొత్తు అయితేనే అని నిబంధన విధించారు పవన్. ఇక తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీ జన సేన ప్రభావం ఏమిటో తెలిసేందుకు రానున్న పర్యటన కీలకం కానుంది. పవన్ తెలంగాణ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి సభలు, సమావేశాలు నిర్వహిస్తే వాటికి హాజరయ్యే వారిని బట్టి ప్రభావం ఎంతో చెప్పొచ్చు.

బీజేపీతో కలిసా? ఒంటరిగానా?

తెలంగాణలో పవన్ రాజకీయం బీజేపీతో కలిసా ఒంటరిగానా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలో ఉండీ లేనట్లున్న పొత్తుతో వెళ్తున్న ఆయన తెలంగాణలో తొలిసారిగా చేపట్టిన భారీ పార్టీ కార్యక్రమంలో ఏం చేస్తారో చూడాలి. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద ప్రధాని మోదీకి ఎంత గురి ఉందో నిన్నటి జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా తెలిసింది. బీజేపీ అధిష్ఠానం కూడా తెలంగాణపై నజర్ పెట్టింది. ఈ నేపథ్యంలో పవన్ తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్తారా? లేదా అన్నది చూడాలి? మధ్యలో ఇటీవలే పునరుత్తేజం పొందుతున్న టీడీపీని కలుపకొని వెళ్తారా? అన్నదీ ఆసక్తికరం.

ఆ నియోజకవర్గాలు ఏమిటో..?

తెలంగాణలో టీడీపీకి సంప్రదాయంగా కొన్ని సీట్లలో బలం ఉంది. బీజేపీ ఎలాగూ దూకుడు ప్లస్ నాయకత్వ పరంగా బలంగా ఉంది. అధికార బీఆర్ఎస్ గురించి చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ ఓట్ల శాతం 20 వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పోటీకి ఎంచుకున్న 32 సీట్లు ఏవి? అనేది చూడాలి. ఆ సీట్లలో ఆయన ఏ మేరకు పార్టీ అభ్యర్థులను సంసిద్ధం చేస్తారు? ఎంత సీరియస్ గా పోటీ ఇస్తారు? అనేది మిగతా పార్టీలకూ కీలకం కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.