Begin typing your search above and press return to search.

బాబుకు షాక్‌!... హోదా భేటీకి జ‌న‌సేన దూరం!

By:  Tupaki Desk   |   30 Jan 2019 4:29 AM GMT
బాబుకు షాక్‌!... హోదా భేటీకి జ‌న‌సేన దూరం!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధిస్తానంటూ బీరాలు ప‌లుకుతున్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న దిశ‌గా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం త‌ర‌ఫున అఖిల ప‌క్ష భేటీని నిర్వ‌హిస్తున్నామ‌ని, ఈ భేటీకి హాజ‌రుకావాలంటూ అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చంద్ర‌బాబు స‌ర్కారు ఆహ్వానాలు పంపింది. ఈ భేటీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌వుతారంటూ నేటి సాయంత్రం దాకా వార్త‌లు వినిపించాయి. ప‌వ‌న్‌ ను ఈ భేటీకి ర‌ప్పించడం ద్వారా మంచి మైలేజీ పొందొచ్చ‌ని టీడీపీ భావించింది. అయితే అధికార పార్టీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ ప‌వ‌న్... ఈ భేటీకి తాము హాజ‌రు కాబోమ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. అస‌లు తామెందుకు ఈ భేటీకి రావాలని కూడా ప‌వ‌న్ టీడీపీకి ఎదురు ప్ర‌శ్న‌లు సంధించారు. అంతేకాకుండా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధ‌న దిశ‌గా చంద్ర‌బాబు స‌ర్కారు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను తూర్పార‌బ‌ట్టిన ప‌వ‌న్‌... చంద్ర‌బాబు సాగిస్తున్న ఉద్య‌మంలో ప‌స లేద‌ని తేల్చి పారేశారు. ఈ మేర‌కు నేటి రాత్రి ప‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

మూడు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా ఈ భేటీని నిర్వ‌హించ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో మంచి మైలేజీ పొంద‌వ‌చ్చ‌ని టీడీపీ భావించింది. అందులో భాగంగానే హోదా సాధ‌న కోసం ఢిల్లీలో దీక్ష‌కు కూడా దిగుతానంటూ ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... ఆ దీక్ష‌కు టీడీపీ ఒక్క‌టే కాకుండా మిగిలిన పార్టీల‌ను కూడా క‌లుపుకుపోవ‌డం ద్వారా ఓ మోస్త‌రు సెంటిమెంట్‌ ను ర‌గిలించేయొచ్చ‌ని భావించారు. అంతేకాకుండా రేపు నిర్వ‌హించ‌నున్న అఖిల‌ప‌క్ష బేటీకి ఎలాగూ వైసీపీ దూరంగానే ఉండ‌నుంద‌ని, వైసీపీ మిన‌హా మిగిలిన అన్ని పార్టీల‌ను... ప్ర‌త్యేకించి తాను పొత్తు కోసం అర్రులు చాస్తున్న జ‌న‌సేన‌ను భేటీకి ర‌ప్పించ‌డం ద్వారా వైసీపీని దోషిగా నిల‌బెట్ట‌వ‌చ్చ‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహంగా విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బాబుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి ఊహించని ఎదురు దెబ్బ త‌గిలింది. నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అంట‌కాగిన టీడీపీ... ప్ర‌త్యేక హోదా వ‌ద్దు, ప్ర‌త్యేక ప్యాకేజీ ముద్దు అంటూ కాలం వెళ్ల‌దీసిన టీడీపీ... ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు త‌న ప్ర‌మేయం లేకుండానే రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని చెబుతున్న టీడీపీది అవ‌కాశ‌వాద‌మేన‌ని ఆరోపిస్తున్న వైసీపీ... ఈ భేటీపై త‌న స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని ప్ర‌క‌టించేసింది.

అంతేకాకుండా ఏపీకి ప్ర‌త్యేక హోదా డిమాండ్ ఇంకా స‌జీవంగా ఉన్న‌దంటే దానికి త‌మ పోరాటాలే కార‌ణ‌మ‌ని కూడా వైసీపీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఈ నేప‌థ్యంలో మోస‌కారి అయిన టీడీపీ నిర్వ‌హించే అఖిల ప‌క్ష భేటీల‌తో ఒరిగేదేమీ లేద‌ని కూడా వైసీపీ తేల్చేసింది. దీంతో ఈ భేటీకి ప‌వ‌న్‌ను ర‌ప్పించ‌డం ద్వారా వైసీపీ వాద‌న‌ను తిప్పికొట్ట‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే బాబుకు ఊహించ‌ని విధంగా దెబ్బ కొట్టేసిన ప‌వ‌న్‌... ఈ భేటీకి తాము హాజ‌రు కాలేమంటూ |షాకిచ్చారు. రేపు సమావేశం ఉంటే ఇవాళ సాయంత్రం ఆహ్వానిస్తే ఎలా అని కూడా ప‌వ‌న్‌ ప్రశ్నించారు. సరైన ఎజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి భేటీలకు జనసేన దూరంగా ఉంటుందని ప‌వ‌న్ తేల్చి పారేశారు. మొత్తంగా చంద్ర‌బాబుకు ప‌వ‌న్ గ‌ట్టి దెబ్బ కొట్టేశార‌నే చెప్పాలి.