Begin typing your search above and press return to search.

జనసేన విశ్వరూపం చూపించేది ఆ రోజేనా... ?

By:  Tupaki Desk   |   12 Feb 2022 9:37 AM GMT
జనసేన విశ్వరూపం చూపించేది ఆ రోజేనా... ?
X
జనసేన ఏపీ రాజకీయాలలో మెల్లగా తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. ఆ పార్టీకి బలమంతా చరిష్మాటిక్ లీడర్ పవన్ కళ్యాణే. పవన్ చుట్టూనే జనసేన తిరుగుతుంది. ఒక విధంగా ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీకి ఎలా అసెట్ అయ్యారో పవన్ కూడా జనసేనకు అతి పెద్ద పెట్టుబడి. జనసేన ఈ రోజుకు ఇలా నిలిచి ఉందంటే పవన్ కళ్యాణే కారణం. ఆయన 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడినా కూడా ఎక్కడా ఆయన పొలిటికల్ ఇమేజ్ చెక్కుచెదరకపోవడం విశేషం.

పవన్ చుట్టూ ఏపీ రాజకీయం గత మూడేళ్ళుగా అల్లుకుని సాగుతోంది. వైసీపీలో చిన్న స్థాయి నేత నుంచి ముఖ్యమంత్రి జగన్ వరకూ ప్రతీ సందర్భంలో పవన్ ని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో విమర్శించకుండా ఉండలేకపోతున్నారు అంటే అది జనసేనకు ఉన్న బలమే అనుకోవాలి.

ఇక పవన్ గతానికి భిన్నంగా పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తాను ప్రజలలో ఉన్నా లేకపోయినా అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఆసరాతో ఆయన నిత్యం ప్రతీ సమస్యను టచ్ చేస్తున్నారు. తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లుగా చెబుతున్నారు. వైసీపీని విమర్శించే విషయంలో ఎక్కడా తగ్గడంలేదు.

జనసేన పార్టీ పెట్టి మార్చి 14 నాటికి ఎనిమిదేళ్ళు అవుతుంది. ఇప్పటికి రెండు ఎన్నికలను జనసేన చూసింది. ఒక ఎన్నికల్లో మద్దతు పార్టీగా ఉంటే 2019 ఎన్నికల్లో నేరుగా రంగంలోకి దిగి తేల్చుకుంది. ఇక 2024 ఎన్నికలు జనసేనకు అత్యంత కీలకం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. గట్టిగా రెండేళ్ళ వ్యవధి మాత్రమే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి.

దాంతో ఈసారి పార్టీ వార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని జనసేన డిసైడ్ అయింది. గత రెండేళ్లూ కరోనా మహమ్మారి కారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్నది బహిరంగ సభ ద్వారా నిర్వహించలేదు. ఈసారి మాత్రం క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి పవన్ రెడీగా ఉన్నారు. మంగళగిరిలో సువిశాలమైన మైదానంలో నిర్వహించే ఈ భారీ బహిరంగసభ ఏపీ రాజకీయాలో పొలిటికల్ హీట్ ని ఒక్క లెక్కన పెంచుతుంది అంటున్నారు.

ఈ సభకు కచ్చితంగా లక్ష మందికి తగ్గకుండా జనసైనికులు పదమూడు జిల్లాల నుంచి తరలి వస్తారని ఇప్పటినుంచే అంచనా వేస్తున్నారు. అంతకు మించి వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఒక విధంగా ఈ సభ ఏపీ రాజకీయాల్లో జనసేన స్పేస్ ఏంటి అన్నది కూడా తెలియచేస్తుందని అంటున్నారు. ఇక ఈ సభ ద్వారా పవన్ రాజకీయ విశ్వరూపమే చూపిస్తారు అంటున్నారు.

ఆనాడు ఆయన సభలో మాట్లాడే అంశాలు అన్నీ కూడా అధికార వైసీపీ మీద గురి పెట్టే బాణాలే అంటున్నారు. మూడేళ్ల వైసీపీ పాలన మీద పవన్ సంధించే అస్త్రాలు జనసైనికులకు కొత్త హుషార్ ని ఇస్తాయని అంటున్నారు. మంగళగిరిలో తలపెట్టే ఈ సభ వైసీపీ కి పెను సవాల్ గా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ సభ ద్వారా ఇచ్చే బిగ్ సౌండ్ ఏపీలో రాజకీయాలను జోరెత్తిస్తుంది అని కూడా చెబుతున్నారు.

మొత్తానికి గేరు మార్చి స్పీడ్ పెంచడానికి పవన్ ఆవిర్భావ సభను వాడుకోబోతున్నారు. వైసీపీ వైఫల్యాలను లక్షలాది మంది జనం మధ్యన పవన్ ఏకరువు పెడితే తట్టుకోవడం కష్టమేనేమో. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. సరిగ్గా టీడీపీ పాలనకు రెండేళ్ళ గడువు ఉన్న వేళ గుంటూరులోనే 2017లో పవన్ పెట్టిన వార్షికోత్సవ సభ టీడీపీ గుండెలో డేంజర్ బెల్స్ ని మోగించింది. ఆ తరువాతనే అధికార పార్టీ గ్రాఫ్ బాగా తగ్గుతూ వచ్చింది.

ఇపుడు కూడా వైసీపీ పొలిటికల్ గ్రాఫ్ తగ్గించే దిశగానే పవన్ మార్క్ స్ట్రాటజీ సాగుతుంది అంటున్నారు. మొత్తానికి నెల రోజుల ముందే ఈ సభ గురించిన వివరాలు ఆరా తీస్తూ జన సైనుకులు ఫుల్ జోష్ లో ఉన్నారు అన్నది మాత్రం నిజం.