Begin typing your search above and press return to search.

జనసేన - టీడీపీ.. ఫ్రెండ్లీ ఫైట్ మాత్రమేనా?

By:  Tupaki Desk   |   13 March 2019 4:22 AM GMT
జనసేన - టీడీపీ.. ఫ్రెండ్లీ ఫైట్ మాత్రమేనా?
X
ఏపీ రాజకీయంలో ఇప్పుడు జనసేన పాత్ర ఏమిటి? ఒంటరి పోరుకు సై అని ప్రకటించిన పార్టీ.. ఈ ఎన్నికల్లో ఎలాంటి పాత్రను పోషించబోతోంది? జనసేన రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి దిగినప్పటికీ… నిజంగా పోటీ ఇచ్చేది ఎన్ని చోట్ల? ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ టికెట్లు దొరక్క చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో అయితే అలాంటి వారు వీధికి ఎక్కారు కూడా. అలాంటి వారు తాము ఇండిపెండెంట్లుగా నిలబడతామని అంటున్నారు. సొంత పార్టీని ఓడించడానికి వెనుకాడేది కూడా లేదని అంటున్నారు. అయితే ఎవ్వరూ జనసేన వైపు మాత్రం చూడటం లేదు!

ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? జనసేనలోకి భారీగా ఉంటాయనుకున్న వలసలు ఎందుకు లేవు? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎడా పెడా ఇతర పార్టీల నుంచి నేతలు వలస వెళ్లారు - అయితే ఇప్పుడు మాత్రం ఆ ఊసే లేదు - ఆ ఊపూ లేదు! పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసి.. ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమనే విశ్వాసాన్ని వ్యక్తం చేసుకొంటూ ఉన్నారు. అయితే ఆ విశ్వాసం మాత్రం ఎవ్వరిలోనూ కలిగినట్టుగా లేదు.

అందుకే జనసేనలోకి జాయినింగ్స్ ఊసే లేకుండా పోయింది. వారం రోజుల్లో నామినేషన్ల నేఫథ్యంలో కూడా వైఎస్సార్సీపీ - టీడీపీ గేట్ల ముందు నేతలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు తప్ప - జనసేన తలుపులు మాత్రం తట్టడం లేదు.

ఇదీ రాజకీయ పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో జనసేన విషయంలో వినిపిస్తున్న కబురు ఏమిటంటే.. ఆ పార్టీ కేవలం ఫ్రెండ్లీ కంటెస్ట్ మాత్రమే చేస్తుందనేది. ఈ ఎన్నికల్లో జనసేన కేవలం స్నేహపూర్వకమైన పోటీ మాత్రమే చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరితో ఆ స్నేహం అంటే.. అధికార పార్టీతోనే అంటున్నారు.

ఈ మేరకు టీడీపీ - జనసేనల మధ్యన ఒప్పందం జరిగినట్టే అని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించడం.. అనే ఉద్దేశంతో మాత్రమే జనసేన పోటీ చేస్తుందని, అదే ఈ ఫ్రెండ్లీ కంటెస్ట్ లోని రహస్యం అని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల జనసేన విజయానికి కూడా తెలుగుదేశం పార్టీ సహకారం అందిస్తుందట. అందులో భాగంగా కొన్ని సీట్లకు జనసేన అభ్యర్థులను అనౌన్స్ చేస్తుందని - వాటిల్లో టీడీపీ బలహీనమైన అభ్యర్థులను పెడుతుందని.. జనసేన విజయానికి టీడీపీ సహకరిస్తుందనే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి.

సింగిల్ డిజిట్ సీట్లలో జనసేన విజయానికి టీడీపీ సహకరిస్తే.. మిగతా చోట్లంతా తెలుగుదేశం విజయానికి జనసేన సహకారం అందిస్తుందని.. ప్రజా వ్యతిరేక ఓటును చీల్చి జనసేన సహకరించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి లోగుట్టు ఏమిటో.. ప్రచారం సమయానికి తెలిసిపోయే అవకాశాలున్నాయి!