Begin typing your search above and press return to search.

గుడివాడకు చెక్ పెట్టేలా జనసేన త్రిముఖ వ్యూహం ?

By:  Tupaki Desk   |   17 Nov 2022 12:30 AM GMT
గుడివాడకు చెక్ పెట్టేలా జనసేన త్రిముఖ  వ్యూహం ?
X
ఆయన వైసీపీలో యువ మంత్రి. జగన్ కి అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్నారు. ఆయనే గుడివాడ అమరనాధ్. కీలకమైన పరిశ్రమల శాఖతో సహా అయిదు శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయన తొలిసారి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినా మలి విడత విస్తరణలో జగన్ చాన్స్ ఇచ్చారు.

మంత్రిగా ఆయన శాఖాపరంగా ఎంతవరకూ పనిచేస్తున్నారు. ఎంతలా శాఖల విషయంలో తన అవగాహన పెంచుకున్నారు అన్నది పక్కన పెడితే విపక్షలా మీద విమర్శలు చేయడంతో దూకుడు చూపిస్తూ ఉంటారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ విషయంలో గుడివాడ వీర లెవెల్ లో రియాక్ట్ అవుతారు అన్నది తెలిసిందే.

ఇవన్నీ సరే కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేస్తారా అంటే అది డౌటే అని అంటున్నారు. దానికి కారణం సొంత పార్టీలో ఆయనకు సఖ్యత లేకపోవడం అని అంటున్నారు. మాజీ మంత్రి అనకాపల్లికి చెందిన సీనియర్ నేత అయిదు సార్లు అక్కడ నుంచి గెలిచిన దాడి వీరభద్రరావు ఈసారి గుడివాడకు టికెట్ ఇస్తే సహకరించేది లేదు అని ఖండితంగా అధినాయకత్వానికి చెప్పేశారు అని ప్రచారం సాగుతోంది.

మరో వైపు చూస్తే అనకాపల్లిలో గుడివాడ అభ్యర్ధిత్వం మీద వైసీపీ అధినాయకత్వం చేయించుకున్న సర్వేలోనూ ఆయనకు మైనస్ మార్కులే పడ్డాయని అంటున్నారు. దాంతో ఏకంగా హై కమాండే వేరే చోటు చూసుకోమని గుడివాడకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక గుడివాడకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన సీటు లేదనే అంటున్నారు.

ఆయన పెందుర్తి నుంచి పోటీ చేయాలనుకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ నుంచి వ్యతిరేకత వస్తోంది. ఒక వేళ ఆయన్ని తప్పించిన కూడా ఆశావహులు బోలేడు మంది లైన్ లో ఉన్నారు. ఈ పరిణామంతో పెందుర్తి నుంచి పోటీ చేయడం కష్టమే అన్న టాక్ ఉంది. ఇక మిగిలింది గాజువాక.

గుడివాడ సొంత ప్రాంతం మింది ఉన్నది ఈ నియోజకవర్గంలోనే. ఇక్కడ నుంచి పోటీ చేయవచ్చు. దాన్ని ఆయన పర్మనెంట్ సీటుగా ఉంచుకోవచ్చు. అయితే ఈ సీటులో గుడివాడ కంటే కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికే పట్టు ఎక్కువగా ఉంది. ఆయన వయోభారం వల్ల తాను ఈ సీటు నుంచి పోటీ చేయకపోతే తన కుమారుడికి ఇవ్వమని కోరుతున్నారు.

ఈ నేపధ్యంలో గుడివాడకు ఆప్షన్లు లేవు అని అంటున్నారు. ఇదిలా ఉంటే గుడివాడ ఎక్కద పోటీ చేసినా ఓడించాలన్న కసితో జనసేన ఉందని అంటున్నారు. జనసేన గాజువాక, అనకాపల్లి, పెందుర్తి సీట్లను టార్గెట్ చేసి మరీ రెడీగా ఉంచుకుంది. ఈ మూడింటిలో గుడివాడ ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓటమే లక్ష్యంగా తాము పావులు కదుపుతామని అంటోంది జనసేన.

అది పొత్తులతో ఉన్నా విడిగా పోటీ చేసినా కూడా ఈ సీట్ల మీద తమ పట్టు గట్టిగా ఉంటుందని చెబుతోంది ఆ పార్టీ. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గుడివాడ అమరనాధ్ పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే. అవి ఒక దశను దాటి ఏకంగా వ్యక్తిగత స్థాయికి కూడా వెళ్ళిపోయాయి. దాంతో గుడివాడ మీద గురి పెట్టేశారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే గుడివాడకు సిట్టింగ్ సీటు అనకాపల్లిలో వ్యతిరేకత ఉంది. పెందుర్తి, గాజువాకలలో పోటీకి దిగితే సొంత పార్టీ నుంచి సహకారం ఎంతవరకూ అన్న ప్రశ్న ఉంది. దీనికి తోడు అన్నట్లుగా జనసేన టార్గెట్ చేయడం అంటే ఈ యువ మంత్రి రెండవ సారి గెలుస్తారా. ద్వితీయ విఘ్నం దాటుతారా అన్న చర్చ అయితే ఉంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.