Begin typing your search above and press return to search.

జగన్ కిషన్ రెడ్డి కలిశారు.. జనసేన లో ఆలోచన.. ఉందామా వెళ్లిపోదామా!

By:  Tupaki Desk   |   23 Aug 2021 12:30 PM GMT
జగన్ కిషన్ రెడ్డి కలిశారు.. జనసేన లో ఆలోచన.. ఉందామా వెళ్లిపోదామా!
X
రాజ‌కీయాల్లో పార్టీల న‌డ‌మ పొత్తులు సాధార‌ణ‌మే. ఇరు వ‌ర్గాల ప్ర‌యోజ‌నాల కోసం పార్టీలు పొత్తులు పెట్టుకోవ‌డం చూస్తూనే ఉంటాం. అయితే ఒకే ప‌డ‌వ‌లో సాగే రెండు పార్టీలు ఒకే విధానాన్ని అనుస‌రించాల్సి ఉంటుంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల విష‌యంలోనూ అదే తీరుగా సాగాలి. కానీ ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ వైసీపీ విష‌యంలో అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తి రాజ‌కీయాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా జ‌న ఆశీర్వాద్ యాత్ర పేరుతో ఏపీలో ప‌ర్య‌టించిన బీజేపీ కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి.. ఏపీ సీఏం జ‌గ‌న్‌ను క‌ల‌వడం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన‌.. ఆ బంధాన్ని ఉంచుకోవాలా? తెంచుకోవాలా? అనే మీమాంస‌లో ప‌డ్డ‌ట్లు స‌మాచారం.

2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌న‌సేన పార్టీ అధినేత అధికార ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అధికార పార్టీ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల సంక్షేమాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న చాలాసార్లు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల నిర్మాణం చేప‌డ‌తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తూ ప‌వ‌న్‌.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు.

అప్ప‌టి నుంచి ఈ రెండు పార్టీల మ‌ధ్య మంచి అనుబంధ‌మే సాగుతోంది. కానీ ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌ను కిష‌న్ రెడ్డి క‌ల‌వ‌డంతో అది కూడా ఎవ‌రికీ ముంద‌స్తు స‌మాచారం లేకుండా ర‌హ‌స్య భేటీ నిర్వ‌హించ‌డం జ‌న‌సేన వ‌ర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మైంది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షెడ్యూల్ లో సీఎం తో మీటింగ్ లేకున్నా కూడా తాడేపల్లి సీఎం ఆఫీస్ కి వెళ్లి మరి కేంద్ర మంత్రి సీఎం తో సమావేశం అయ్యారు . ముందుగా ఎక్కడ బయట చెప్పకుండా కలిశారు అని కొందరు వాదిస్తున్నారు. అయితే బీజేపీ లో కొందరు వైస్సార్సీపీ కి సపోర్ట్ చేసే వాళ్ళే ఈ పని చేసారు అని . ఇలా అయితే ఎలా అని జనసేన నాయకులు మదన పడుతున్నారు అట.

ఓ వైపు అధికార పార్టీ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన పోరాటం చేస్తుంటే.. జ‌న‌సేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి చెందిన కేంద్ర‌మంత్రి జ‌గ‌న్‌కు క‌ల‌వ‌డం ఏమిట‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కిష‌న్ రెడ్డి వ‌చ్చింది అధికారిక ప‌ర్య‌ట‌న కాదు రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా జ‌న్ ఆశీర్వాద్ యాత్ర కోసం వ‌చ్చారు. అలాంటిది ఆయ‌న జ‌గ‌న్‌ను ఎందుకు క‌లిశార‌ని ఇటు జ‌న‌సేన పార్టీతో పాటు అటు రాష్ట్ర బీజేపీ వ‌ర్గాల్లోనూ అస్ప‌ష్ట‌త నెల‌కొంది. ఇలా అయితే ఇక ప్ర‌భుత్వంపై తాము చేసే విమ‌ర్శ‌ల‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటార‌ని జ‌న‌సేన నాయ‌కులు మ‌ద‌న ప‌డుతున్నారని తెలిసింది.

ఈ విష‌యంపై బీజేపీ అధిష్టానంతో మాట్లాడాల‌ని జ‌న‌సేన అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కూడా ఇదే కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఓ సారి అధిష్ఠానంతో మాట్లాడిన త‌ర్వాతే బీజేపీతో పొత్తులో కొన‌సాగాలా? లేదా బ‌య‌ట‌కు వెళ్లిపోవాలా? అనే విష‌యంపై జ‌న‌సేన ఓ నిర్ణ‌యం తీసుకునే వీలుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఎలాంటి మ‌లుపులు తీసుకుంటుందో చూడాలి.

గమనిక: పాఠకులే దేవుళ్లు.. వారి సలహాలు, సూచనలు విలువైనవి.. మా ఆర్టికల్ చదివిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.. కింద కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయండి.. మీ ఆలోచనలకు మేం అక్షర రూపాన్ని ఇస్తాం..