Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీలు ముద్దపప్పులా? మంట పుట్టిస్తున్న జనసైనికుడి ఫైరింగ్

By:  Tupaki Desk   |   20 Dec 2021 6:30 AM GMT
వైసీపీ ఎంపీలు ముద్దపప్పులా? మంట పుట్టిస్తున్న జనసైనికుడి ఫైరింగ్
X
ఏపీలో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక అంశం ఏపీలో రగులుతూనే ఉంది. తిరుగులేని అధిక్యత చేతికి చిక్కిన వేళ.. సాధారణంగా అయితే విపక్షాలు నీరసించిపోతాయి. నిరసన వ్యక్తం చేయటం వరకు తర్వాత.. తమ వాదనను బలంగా వినిపించేందుకు అంత ఆసక్తిని చూపించవు. అందుకు భిన్నంగా విపక్షాలు ఎవరికి వారుగా.. ఏపీ అధికారపక్షంపై విరుచుకుపడే తీరు.. వారిని విమర్శించేందుకు చూపించే ఉత్సాహం ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది.

ఏపీ ఉక్కు.. ఆంధ్రుల హక్కుగా చెప్పుకునే విశాఖ ఉక్కుకర్మాగారాన్ని కేంద్రం అమ్మకానికి పెట్టటం తెలిసిందే. దీనిపై ఏపీ అధికారపక్షం రియాక్టు అయిన తీరు అంతంతమాత్రమే. కోట్లాది మంది సెంటిమెంట్ కు భిన్నంగా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. అందుకు వ్యతిరేకంగా జనసేన నిరసన కార్యక్రమాల్ని చేపడుతోంది. ఇప్పటికే పలు కార్యక్రమాల్ని నిర్వహించిన తమ పార్టీకి భిన్నంగా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. విశాఖ ఉక్కు మీద ధైర్యంగా పోరాడుతున్నారని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని.. కానీ ఏపీ అధికారపక్షం మాత్రం ఎలాంటిపోరాటం చేయటం లేదని జనసేన అభిప్రాయపడుతోంది. కేంద్రంలోని మోడీ సర్కారు అంటే వైసీపీ ఎంపీలకు ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. బీజేపీ అంటేనే వైసీపీ నేతలకు వణుకుగా అభిప్రాయపడ్డారు.

లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించేందుకు వీలుగా విశాఖ ఉక్కు అంశంపై ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేయటానికి వచ్చే ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకుంటున్నారేమో.. ఎంపీ అంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముద్దపప్పులుగా భావిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు జనసేన నేత పోతిన వెంకట మహేశ్.

విశాఖ ఉక్కు అంశంలో కేంద్రం తీరును తప్పు పడుతూ.. వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకోవాలన్నారు. ఒకవేళ ప్లకార్డులు పట్టుకోకపోతే.. ఏపీ ప్రజలు నవ్వుతారన్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలో విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తే.. దానికి సంపూర్ణ బాధ్యత జగన్మోహన్ రెడ్డి సర్కారుదే అవుతుందన్నారు. ఒకవైపు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ఒకటి తర్వాత మరొకటి చొప్పున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటివేళ.. జనసైనికులు సైతం అధినేతకు దన్నుగా నిలుస్తూ.. ఉత్సాహంగా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయటం.. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. ఒత్తిడిని బిల్డ్ చేస్తున్నారని చెప్పాలి. మరి.. జనసేన కోరినట్లే.. పార్లమెంటులో ప్లకార్డులు ఎంత మేర పట్టుకుంటారో చూడాలి.