Begin typing your search above and press return to search.

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ వార్ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   16 Sep 2022 11:30 PM GMT
ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ వార్ త‌ప్ప‌దా?
X
కోన‌సీమ జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు ఆస‌క్తి రేపుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థి ఈసారి జ‌న‌సేన త‌ర‌ఫున‌, జ‌న‌సేన త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వ్య‌క్తి ఈసారి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసే అవ‌కాశం ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. అటు రెండు పార్టీలు, ఇద్ద‌రు నేత‌లు ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం కోసం ఎదురుచూస్తుండ‌టం ఇక్క‌డ హాట్ టాపిక్‌గా మారింది.

2019 ఎన్నిక‌ల్లో రాజోలు నుంచి జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు గెలుపొందారు. త‌ద్వారా జ‌న‌సేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక నిలిచారు. అయితే ఆయ‌న ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీతో అంట‌కాగుతూ వ‌స్తున్నారు. 2009లో కూడా రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు రాజోలు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా గెలుపొందారు. ఈ నేప‌థ్యంలో రాజోలు నుంచి రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. 2014లో వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాపాక కేవ‌లం 300 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఇక బొంతు రాజేశ్వ‌ర‌రావు 2014, 2019ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున రాజోలు పోటీ చేసి ఓడిపోయారు. అయితే రెండు ప‌ర్యాయాలు అతి త‌క్కువ మెజారిటీతోనే ప‌రాజ‌యం పాల‌య్యారు. 2014లో 4,600 ఓట్ల తేడాతోనూ, 2019లో 816 ఓట్ల తేడాతోనూ బొంతు రాజేశ్వ‌రరావు ఓడిపోయారు.

కాగా ప్ర‌స్తుతం రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వైఎస్సార్సీపీతో అంట‌కాగుతుండ‌టం, ఆయ‌న‌కే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి ప్రాధాన్య‌త ఇస్తుండ‌టంతో ప‌లువురు నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్సీపీ నాయ‌కులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ గా ఉన్న బొంతు రాజేశ్వ‌ర‌రావు సైతం పార్టీకి రాజీనామా సమ‌ర్పించారు. అంతేకాకుండా హైద‌రాబాద్ వెళ్లి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మాట్లాడి వ‌చ్చారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బొంతు రాజేశ్వ‌రరావు జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు రాజోలు నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన పార్టీ శ్రేణులు కూడా రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. గ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రాపాక సొంత ఊరిలో జ‌న‌సేన అభ్య‌ర్థిని స‌ర్పంచ్‌గా గెలిపించుకుని రాపాకకు షాక్ ఇచ్చారు. అంతేకాకుండా రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ పంచాయ‌తీల‌ను జ‌న‌సేన పార్టీనే కొల్ల‌గొట్టింది. త‌ద్వారా రాపాక గెలిచింది సొంత ఇమేజ్‌తో కాద‌ని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రేజ్‌తోనేన‌ని జ‌న‌సేన శ్రేణులు నిరూపించాయి.

మరోవైపు బొంతు రాజేశ్వ‌ర‌రావు కూడా వైఎస్ జ‌గ‌న్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారని అంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న త‌న‌ను కాద‌ని.. రాపాక‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంపై మండిప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి రాపాక‌కు, అటు జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాల‌నే యోచ‌న‌తో ఉన్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.