Begin typing your search above and press return to search.

తిరుపతి పోటీ నుంచి తప్పుకున్న జనసేన!?.. షాకింగ్ కారణం?

By:  Tupaki Desk   |   3 March 2021 7:30 AM GMT
తిరుపతి పోటీ నుంచి తప్పుకున్న జనసేన!?.. షాకింగ్ కారణం?
X
తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో ఇక్కడ జరిగే ఎన్నికకు ఆయా పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నారు. అధికార వైసీపీ అనధికారికంగా గురుమూర్తి అనే అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ బాహాటంగానే పనబాక లక్ష్మీ పేరును ఖరారు చేసింది. అయితే మొదటి నుంచి బీజేపీ, జనసేనలు కలిసి ఇక్కడ తమ అభ్యర్థి అంటే.. తమ అభ్యర్థిని ప్రకటించిన నాయకులు తీరా సమయానికి సైలెంట్ గా మారిపోయారు. ఇరు పార్టీలు అభ్యర్థుల గురించి ఏమాత్రం ప్రకటన చేయడం లేదు. దీంతో తిరుపతిలోని ఇరు పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని ఆ పార్టీకి చెందిన నాయకులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పైకి ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం అని చెబుతున్నా దానిని అడ్డుకోవడానికి మాత్రం ఎలాంటి కసరత్తు చేయడం లేదు. దీంతో ఈ సమయంలో ఉప ఎన్నికకు వెళితే ప్రజలు తిరగబడుతారని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుంది. ఇక్కడి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందు తమ పార్టీ నుంచే అభ్యర్థి ఉంటారని చెప్పిన నాయకులు నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు.

అటు మొన్నటి వరకు బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ప్రస్తుతం కమలం పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అధిష్టానాన్ని కలిసిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ పై పునరాలోచించాలని కోరారు. అంతేకాకుండా తిరుపతిలో పోటీచేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని అడిగారు. అయితే కేంద్రంలోని దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే బెటరని పవన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికకు దూరంగా ఉండేందుకు జనసేన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రాకముందు.. వచ్చాక.. వైసీపీని ఆడిపోసుకున్న పవన్ ఈ మధ్య జగన్ గురించి మాట్లాడడం లేదట. దీంతో ఆయన వైసీపీకి మద్దతు ఇస్తున్నారా..? అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే పవన్ తిరుపతిలో పోటీ చేయకుంటే మాత్రం ఇదే నిజం కానుందన్న వార్తలు వస్తున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.