Begin typing your search above and press return to search.

జనసైనికుల్లో అరెస్టు ఎంతమంది? రిమాండ్ ఎందరికి?

By:  Tupaki Desk   |   17 Oct 2022 4:04 AM GMT
జనసైనికుల్లో అరెస్టు ఎంతమంది? రిమాండ్ ఎందరికి?
X
ఏపీ అధికారపక్ష నేతలకు అనూహ్యమైన అనుభవాన్ని మిగిల్చిన విశాఖ ఎయిర్ పోర్టు ఎపిసోడ్ ఏపీ వ్యాప్తంగానే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆసక్తిని.. ఉత్కంటను రేకెత్తించింది. గర్జన పేరుతో విశాఖపట్నంలో ర్యాలీని నిర్వహించిన వైసీపీ నేతలు.. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోవటం తెలిసిందే. ఎయిర్ పోర్టుకు వెళ్లిన మంత్రులు రోజా.. రజని.. జోగి రమేశ్ తదితర నేతల్ని చూసిన జనసైనికులు వారిని అడ్డుకోవటం తెలిసిందే.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టుకు వస్తున్న నేపథ్యంలో అక్కడకు చేరుకున్న వారు.. మంత్రులు జోగి రమేశ్.. రోజాలకు చెందిన వాహనాలపై దాడి చేశారు. తమ నాయకుడ్ని అదే పనిగా అనుచిత వ్యాఖ్యలు చేసే రోజా.. జోగి రమేశ్ లు అక్కడకు వచ్చారన్న విషయం తెలిసినంతనే వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

మంత్రుల వాహనాలపై దాడి జరిగిన ఎపిసోడ్ ను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గంటల వ్యవధిలోనే దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పెద్ద ఎత్తున జనసైనికుల్ని అదుపులోకి తీసుకుంది. అలా అదుపులోకి తీసుకున్న వారు ఏకంగా 70 మంది ఉండటం గమనార్హం. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించినట్లు చెబుతున్నా.. మరీ ఇంత మందిని అదుపులోకి తీసుకోవటమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమైంది.

అరెస్టు చేసిన 70 మంది జనసైనికుల్ని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ హాజరుకు ముందు పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల దాడిని ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొని.. జనసేనకు గట్టి మేసేజ్ పంపాలన్నట్లుగా పోలీసులకు అనధికార ఆదేశాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. హైడ్రామా నడుమ జడ్జి ఎదుట హాజరుపర్చిన 70 మందిలో 61 మందికి ఊరట లభించింది. 61 మందికి రూ.10 వేల పూచీకత్తు మీద కోర్టు విడుదల చేసింది.

మరో తొమ్మిది మందికి మాత్రం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. అయితే.. ఇక్కడ కూడా మరో విశేషం చోటు చేసుకుంది. రిమాండ్ విధించిన 9 మంది మీదా పోలీసులు సెక్షన్ 307 మీద కేసు నమోదు చేస్తే.. ఆ సెక్షన్ ను తొలగించి సెక్షన్ 326గా మార్చటం గమనార్హం.

అరెస్టు చేసిన 70 మంది జనసైనికులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరిచే సందర్భంగా కోర్టు ప్రాంగణంలోని అన్ని గేట్లను మూసేశారు. పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమైనా.. భారీగా అరెస్టులు చేసిన పోలీసులకు తీరుకు భిన్నంగా.. అత్యధికులకు బెయిల్ లభించటం జనసైనికులకు ఊరట లభించినట్లుగా చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.