Begin typing your search above and press return to search.

అచ్చం ఫస్ట్ వేవ్ లో ఆలోచనలానే.. కొవిడ్ అంటించుకున్న చైనా సింగర్

By:  Tupaki Desk   |   22 Dec 2022 11:39 AM GMT
అచ్చం ఫస్ట్ వేవ్ లో ఆలోచనలానే.. కొవిడ్ అంటించుకున్న చైనా సింగర్
X
దాదాపు మూడేళ్ల కిందట కొవిడ్ చైనా నుంచి వ్యాప్తిలోకి వచ్చినప్పుడు ప్రపంచమంతటా ఓ నమ్మకం ఉండేది.. అదేంటంటే కొవిడ్ ఒక్కసారి వచ్చి పోతే మళ్లీ రాదని. భారత్ సహా చాలా దేశాల్లో ప్రజలు దీనిని నమ్మారు. కొందరైతే కొవిడ్ ఎంత తొందరగా వచ్చిపోతే అంత బాగుండు అనుకున్నారు కూడా. కొవిడ్ సోకి తగ్గితే శరీరంలో యాంటీబాడీలు ఏర్పడాతయనే నమ్మకంతో ఇలా భావించేవారు.

ఇందులో అప్పటివరకు ఉన్న అంచనా కొంతవరకు నిజమే. కానీ, ఎప్పుడైతే డెల్టా వేరియంట్ పుట్టి భారత్ లో సెకండ్ వేవ్ కు దారితీసిందో ఈ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. అమ్మో కొవిడ్ అంటూ దూరం పారిపోయే పరిస్థితి వచ్చింది. థర్డ్ వేవ్ లోనూ కొవిడ్ సోకి తగ్గితే బావుండు అనే ఆలోచన రాలేదు. కాగా, ఇప్పుడు చైనాలో మళ్లీ పాత పద్ధతిలో కొవిడ్ వచ్చిపోతే బాగుండు అనే ధోరణిలో వైరస్ ను అంటించుకున్న కేసు ఒకటి బయటపడింది. అదెవరో

కాదు.. ప్రముఖ సింగర్ కావడం విశేషం. ఆమె కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనాల్సి ఉండడం, ఆ సమయంలో వైరస్ సోకితే ఇబ్బంది అని ఈ పని చేసింది. ఈ విషయాన్ని స్వయంగానూ వెల్లడించడం గమనార్హం. లక్షల మంది ప్రాణాలు కో్ల్పోతుంటే.. ఓవైపు చైనాలో కరోనా విలయతాండవం చేస్తుందనే అంచనాల మధ్య గాయని చేసిన పని చర్చనీయాంశం అవుతోంది. లక్షల మంది చనిపోతారనే ఆందోళన వ్యక్తం అవుతుండగా ఇలా చేయడం ఏమిటనే ప్రశ్న వస్తోంది. అసలు కొవిడ్‌కు దూరంగా ఉండేందుకు పౌరులు జాగ్రత్తలు తీసుకుంటుంటే.. గాయని ఉద్దేశపూర్వకంగా అంటించుకోవడం అందరనీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆ గాయని తీరుపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ‘నూతన సంవత్సర వేడుకల సమయంలో అనారోగ్యం బారినపడతానేమోననే ఆందోళన చెందా. నాకే కాదు సహచరులకూ ఇబ్బంది అని అనుకున్నా.అందుకే పాజిటివ్‌ వచ్చిన కొందరు వ్యక్తుల ఇళ్లకు వెళ్లి కలిశా. ప్రస్తుతం నాకూ వైరస్‌ సోకింది. వేడుకల నాటికి కోలుకునేందుకు సమయం దొరికింది’ అంటూ గాయని జేన్‌ ఝాంగ్‌ పేర్కొన్నారు.

ఆమెకు ఉన్న లక్షణాలివే..బాధితులను కలిసి కొవిడ్ అంటించుకున్న జేన్‌కు జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు మొదలయ్యాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఈ లక్షణాలన్నీ ఆమెలో ఒక్క రోజు మాత్రమే ఉన్నాయట. అయితే రోజు మొత్తం విశ్రాంతి తీసుకున్న తర్వాత అవి తగ్గిపోయినట్లు జేన్‌ చెప్పింది.

ఆమె కథనాన్ని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక ప్రచురించింది. కాగా, చైనాలో ప్రమాదకరమైన బీఎఫ్‌.7 వేరియంట్‌ వ్యాపిస్తోంది. దీంతో గాయని ప్రకటన వైరల్ అయింది. ఆమె తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతోపాటు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో జేన్‌..వెంటనే క్షమాపణలు చెబుతూ సోషల్‌ మీడియా పోస్టును తొలగించారు. మరోవైపు చైనాలో కరోనా వైరస్‌ తీవ్రతకు ఆసుపత్రులు, శ్మశానవాటికలు నిండిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.