Begin typing your search above and press return to search.

పవన్ చెప్పినట్లే టీడీపీ నాయకులు నడుచుకోవాలా..?

By:  Tupaki Desk   |   2 Jan 2022 5:56 AM GMT
పవన్ చెప్పినట్లే టీడీపీ నాయకులు నడుచుకోవాలా..?
X
ఏపీలో కొత్త రాజకీయం ఆసక్తిగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేనలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు వ్యూహం పన్నుతున్నాయి. ఈ క్రమంలో మొన్నటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఇక నుంచి టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైంది. టీడీపీ నేతలు సైతం ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు జనసేన కూడా టీడీపీతో కలిస్తే లాభిస్తుందని ఆలోచిస్తుంది. అయితే ఈ రెండు పార్టీల కలయికతో ఎవరిపై ఎవరి డామినేషన్ ఉంటుుందనే చర్చ జోరుగా సాగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటు బ్యాంకు పెంచుకోలేకపోతోంది. మరోవైపు అధికార వైసీపీ టీడీపీనే టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలే చివరివి అయ్యే అవకాశాలున్నాయి. ఆ తరువాత ఆయన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఆయన కుమారుడు లోకేశ్ నాయకత్వంపై నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈ ఎన్నికలు మిస్సయితే మళ్లీ అవకాశం ఉండదు.

మరోవైపు జనసేన మెల్లగా ప్రజా బలం పెంచుకుంటోంది. వైపీపీపై పోరాడుతూ పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుుతోంది దీంతో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ స్థానాన్ని సైతం దక్కించుకోగలిగింది. అయితే బీజేపీతో పొత్తు లేకపోతే మరిన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉండేవని జనసైనికులు చెప్పుకొచ్చారు. అయినా ఆ పార్టీ అధినేత ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు విజయవంతం అవుతున్నాయి.

ఈనేపథ్యంలో జనసేనతో కలిసి వెళితేనే బాగుంటుందని టీడీపీ నాయకులు సైతం భావిస్తున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సైతం జనసేనతో పొత్తుకు అంగీకరిస్తున్నారు. అటు పవన్ సైతం బాబుతో కలిసి పోటీకి సై అంటున్నారు. గతంలో టీడీపీ తరుపున పవన్ ప్రచారం చేశారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. మరోసారి పవన్ హ్యాండ్ ఉంటే కలిసొస్తుందని టీడీపీ నాయకులు ఆలోచిస్తున్నారు.

అయితే ఈ కలయికలో ఎవరి డ్యామినేషన్ ఎవరిపై ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నాయకులకంటే పవన్ పైనే క్రేజ్ ఉంది. జనాల్లో దూసుకుతపోతున్న పవన్ కు సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఇదే మెయింటేన్ చేస్తూ ప్రజాందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న రైతులు, నిన్న రోడ్లపై, నేడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఆందోళనలను చేస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయని అంటున్నారు. అయితే టీడీలోనీ సినియర్ నాయకులు సైతం ఇప్పుడు కామ్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గతంలో పవన్ తో ప్రచారం చేయించి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకుల్లో కొందరు పవన్ పై విమర్శలు చేశారు. ఆ తరువాత ఆ వ్యాఖ్యలపై పవన్ నిరాశ చెంది టీడీపీని వీడాల్సి వచ్చింది. మరోసారి అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండేందుకు పవన్ బాబుతో ముందే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఎందుకంటే పవన్ అవసరం వచ్చే ఎన్నికల్లో చాలా ఉంది. ఆయన ప్రజాబలంతో మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. మరోవైపు 2024 ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకమైనవి. పవన్ ఈసారి కాకపోయిన మరోసారి ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు కు ఇదే చివరి ఛాన్స్. అందువల్ల పవన్ చెప్పినట్లు టీడీపీ నాయకులు వినాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని అనుకుంటున్నారు.మరి అప్పటి వరకు ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.