Begin typing your search above and press return to search.

జనతా ఎమర్జెన్సీ.. మోడీ భారీ వ్యూహంలో భాగమా?

By:  Tupaki Desk   |   22 March 2020 6:30 AM GMT
జనతా ఎమర్జెన్సీ.. మోడీ భారీ వ్యూహంలో భాగమా?
X
పెద్ద విషయాల్ని ఒక్కసారిగా చెబితే కలకలం రేగుతుంది. దాన్ని అర్థం చేసుకోవటం కూడా అంత తేలికైన పని కాదు. మనలాంటి దేశంలో అందరూ ఒకేలా ఆలోచించే అవకాశం లేదు సరకదా.. ఒక్కొక్కరి వాదన ఒక్కోలా ఉంటుంది. ఇలాంటి దేశంలో కరోనా లాంటి ప్రమాదకర వైరస్ ఎంట్రీ ఇచ్చి.. దాని పీచమణచటం అంత తేలికైన విషయం కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వైరస్ విషయంలో యావత్ జాతి ఒకే తాటి మీదకు తీసుకురావటం అన్నింటి కంటే పెద్ద సమస్య. ఇలాంటి విషయాన్ని తనదైన శైలిలో ప్రధాని మోడీ డీల్ చేస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ఈ రోజు ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ జనతా ఎమర్జెన్సీ పేరుతో చేస్తున్న ప్రయత్నం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న మాట వినిపిస్తోంది. కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న చోట్ల షట్ డౌన్ ప్రకటిస్తే.. ప్రజల్లో భయాందోళనలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతాయి. అందునా.. పరిమితుల మధ్య బతికే అలవాటు లేని మనలాంటి సమూహంలో ఇళ్లకే పరిమితం కావాలని చెబితే.. దాన్ని భారంగా తీసుకుంటారే కానీ బాధ్యతగా తీసుకోరు. అలాంటప్పుడు.. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ ఉన్నప్పుడు.. ఎలా మెలగాలన్న విషయాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటం కోసం మోడీ వేసిన భారీ వ్యూహంలో జనతా ఎమర్జెన్సీ అన్నది ఒక అడుగుగా చెబుతున్నారు.

ఒక్క రోజు దేశం కోసం అంటూ సమాయుత్తం చేసేలా మోడీ మాటలకు యావత్ దేశం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని.. దేశాన్నికాపాడే అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు.. దాన్ని పాటించకుండా ఉంటానా? మరి.. మీ సంగతేమిటంటూ వాట్సాప్ లో వచ్చిన ఒక పోస్టు చూస్తే.. ప్రజలు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టటం కోసం.. అవసరమైతే ఇళ్లకే పరిమితం చేసేందుకు వీలుగా.. ట్రయల్ బేసిస్ లో దేశ వ్యాప్తంగా ఒక రోజు పద్నాలు గంటల పాటు ఇళ్లలోనే ఉండేలా చేయటం కోసమే జనతా ఎమర్జెన్సీని తీసుకొచ్చారని చెప్పాలి.

ఈ ప్రయత్నం లో ఎదురైన కష్ట నష్టాలపై సమీక్ష జరిపి..కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పూర్తిస్థాయి షట్ డౌన్ దిశగా అడుగులు వేసేందుకు జనతా ఎమర్జెన్సీ అవకాశం ఇస్తుందని చెప్పాలి. ఇంట్లోనే ఉండిపోవటం వల్ల మంచే తప్పించి చెడు జరగదన్న విషయం అర్థమయ్యాక.. దేశ ప్రజలు మానసికంగా సిద్ధం కావటం ఖాయమంటున్నారు. ఇలాంటి ఆలోచనతోనే.. భావోద్వేగంతో దేశ ప్రజల్ని ఒకటి చేసేలా మోడీ జనతా ఎమర్జెన్సీ పనికి వస్తుందని చెబుతున్నారు.